ఇటుక వ్యాపారుల ఇల్లీగల్ దందా

దిశ, మెదక్: జిల్లాలో అక్రమ ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ సహజ సంపదలను దోచేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, వెల్దుర్తి, చేగుంట, రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట, నార్సింగి, హావేలీ ఘనపూర్, మనోహరాబాద్ తదితర మండలాల్లో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. వాగులూవంకలు, చెరువులు, మత్తడులు తదితర ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నట్టు […]

Update: 2021-01-06 20:42 GMT

దిశ, మెదక్: జిల్లాలో అక్రమ ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ సహజ సంపదలను దోచేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు.

జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, వెల్దుర్తి, చేగుంట, రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట, నార్సింగి, హావేలీ ఘనపూర్, మనోహరాబాద్ తదితర మండలాల్లో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. వాగులూవంకలు, చెరువులు, మత్తడులు తదితర ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నట్టు ఆయా మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వహణ కోసం మైనింగ్, రెవెన్యూ, లేబర్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ, ట్రాన్స్కో, పోలీసు తదితర శాఖలు అనుమతులు తీసుకోవాలి.. కానీ జిల్లాలో ఎక్కడా అనుమతులు ఉన్న దాఖలాలు లేవు. మైనింగ్ శాఖలో అనుమతుల కోసం పెట్టుకున్న ఆర్జీలు అలాగే ఉన్నాయి. ప్రతి ఏటా ఒకవేళ పర్మిషన్లు ఉన్నా వాటిని రెన్యూవల్ చేసుకోవాలి.. కానీ ఇప్పటి వరకు ఒక్క వ్యాపారి కూడా లైసెన్సులను రెన్యూవల్ చేసుకోలేదు. ఇటుక బట్టీల నిర్వాహకులపై సంబంధిత అధికారులు ఇప్పటి వరకు తూతుమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల కనుసన్నల్లోనే..

ఇటుక వ్యాపారుల ఇల్లీగల్ దందా సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతుందని ఆయా మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు వీటిపై రెవెన్యూ, మైనింగ్, లేబర్ శాఖ అధికారులు పట్టించుకోకపోగా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలోని అనేక మండలాల్లో అధికార పార్టీకి చెందిన చోటమోటా నాయకులే ఈ అక్రమ వ్యాపారం నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రాజకీయ వత్తిళ్లు ఉండడంతో కొన్నిసార్లు అధికారులు కూడా మిన్నకుండిపోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో అధికారులను మామూళ్ల మత్తులో ఉంచి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

సిండికేట్ దోపిడీ..

జిల్లా కేంద్రంతో పాటు అనేక మండలాల్లో వ్యాపారులు కొత్త పద్ధతుల్లో అక్రమ దందాను నడిపిస్తున్నారు. జిల్లాలో సుమారు 200 నుంచి 300 వరకు ఇటుక బట్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాపారం సవ్యంగా సాగాలంటే మైనింగ్, రెవెన్యూ, ట్రాన్స్కో, లేబర్ ఆఫీసర్, పోలీసు, తదితర శాఖలను ముందస్తుగా మేనేజ్ చేస్తారని, దీనికోసం ముందుగానే వ్యాపారులంతా సిండికేట్ గా ఏర్పడి ఆయా శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు అందజేస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయా మండలాల్లో ఉండే అధికార పార్టీ నేతలు వ్యాపారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉండి పెద్దమొత్తంలో డబ్బులు దంటుకుంటారని సమాచారం. కాగా, బట్టీల్లో పనిచేసే కార్మికులను బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి తక్కువ జీతం ఇచ్చి వారితో ఎక్కువ శ్రమ చేపిస్తున్నారే ఆరోపణలూ ఉన్నాయి.

Tags:    

Similar News