హైదరాబాద్ @మున్సిపాలిటీ నుంచి GHMC వరకు..
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మున్సిపాలిటీ వ్యవస్థను నిజాం ప్రభుత్వం 1869లో అమల్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో హైదరాబాద్, చాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో పరిధిలో నాలుగు, చాదర్‌ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి. 1886లో చాదర్‌ఘాట్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్పు చేశారు. 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేది. 1921లో హైదరాబాద్ 84 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ నేపథ్యంలో 1933లో చాదర్‌ఘాట్ కార్పొరేషన్‌ను హైదరాబాద్ మున్సిపాలిటీలో […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మున్సిపాలిటీ వ్యవస్థను నిజాం ప్రభుత్వం 1869లో అమల్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో హైదరాబాద్, చాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో పరిధిలో నాలుగు, చాదర్‌ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి. 1886లో చాదర్‌ఘాట్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్పు చేశారు. 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేది. 1921లో హైదరాబాద్ 84 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ నేపథ్యంలో 1933లో చాదర్‌ఘాట్ కార్పొరేషన్‌ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
1934లో తొలిసారి ఈ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. 1937లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి, 1942లో హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్‌కు కార్పొరేషన్ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు. 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపి ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)’గా మార్చారు.
2007లో జీహెచ్ఎంసీగా..
2007 ఏప్రిల్ 16 వ తేదీన రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు (ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్ చెరు), 8 గ్రామ పంచాయతీలు (శంషాబాద్, సాతంరాయి, జల్ పల్లి , మామిడిపల్లి, మక్తల్, అల్మాస్ గూడా, సర్ధార్ నగర్, రావిరాల) హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసి హైదరాబాద్ మహానగర పాలక సంస్థను ఏర్పాటు చేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం 2019లో హైదరాబాద్ మహానగరపాలక సంస్థను ఆరు మండలాలుగా (దక్షిణ, తూర్పు, ఉత్తర, ఈశాన్య, పశ్చిమ, మధ్య మండలాలు), 150 వార్డులుగా విభజించింది.
నాటి నుండి నేటి వరకు మేయర్లు..
మేయర్ పదవీ కాలం
1951 -1957 మాడపాటి హన్మంతరావు
1957-1962 కృష్ణ స్వామి ముదిరాజ్
1962 -1964 రాణి జానుపల్లి
1965 – 1969 సరోజినీ పుల్లారెడ్డి
1969 – 1975 లక్ష్మీనారాయణ ముదిరాజ్
1986 – 1987 కల్ర ప్రకాశ్
1988-1989 సత్యనారాయణ
1989-1991 ఆలంపల్లి పోచయ్య
1991 -1995 మీర్ జుల్ఫీకర్ అలీ
1995-1999 ఎంకే ముబిన్
1999 -2002 మీర్ జుల్ఫీ కర్ అలీ
2002 – 2007 తీగల కృష్ణారెడ్డి
2009-2012 బండా కార్తీక రెడ్డి
2012-2014 మహ్మద్ మాజీద్ హుసేన్
2016- 2021 బొంతు రామ్మోహన్
1976 -1986 వరకు ఎమర్జెన్సీ కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు.
2007-2009 వరకు జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు.
2014 నుంచి 2016 వరకు మేయర్ ఎన్నికలు జరగలేదు.
తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గద్వాల విజయలక్ష్మి మేయర్ పీఠం అధిష్టించారు.