వెలుతురు మాటున చీకటి దందా.. అది ఏంటో తెలుసా?

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గ్రామ కూడలిలో పెద్ద లైట్లు, గ్రామంలో ప్రధాన వీధుల వెంట ఎల్ఈడీ లైట్లను అమర్చారు. విప్రో సంస్థకు చెందిన లైట్లను కొనుగోలు చేశారు. స్తంభానికి ఫిట్టింగ్ ఛార్జీలతో మొత్తం కలుపుకుని ఒక్కో 18 నుంచి 24 వాట్స్ లైట్కు రూ. 1710 చొప్పున చెల్లించారు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల […]

Update: 2021-01-03 22:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గ్రామ కూడలిలో పెద్ద లైట్లు, గ్రామంలో ప్రధాన వీధుల వెంట ఎల్ఈడీ లైట్లను అమర్చారు. విప్రో సంస్థకు చెందిన లైట్లను కొనుగోలు చేశారు. స్తంభానికి ఫిట్టింగ్ ఛార్జీలతో మొత్తం కలుపుకుని ఒక్కో 18 నుంచి 24 వాట్స్ లైట్కు రూ. 1710 చొప్పున చెల్లించారు.

ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు ఇచ్చిన సంస్థ మాత్రం రెండింతలు వసూలు చేస్తోంది. గ్రామాల్లో ఒక్కో లైట్ ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ 18 వాట్స్ బల్బుకు రూ. 2933.31 చొప్పున వసూలు చేస్తోంది. వీటిని గ్రామ పంచాయతీల నుంచే వసూలు చేయనున్నారు. లూమినోస్​కు చెందిన ఎల్ఈడీ బల్బును ఏర్పాటు చేస్తున్నారు. కానీ ధరలను మాత్రం రెండింతలు వేస్తున్నారు.

ఎందుకంటే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పే సమాధానం జిల్లా నుంచి ఉన్నతస్థాయి వరకు కమీషన్లు ఇవ్వాల్సిందే. అందుకే ధరలు పెరుగుతున్నాయి. అసలు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీల నుంచి రూపాయి రూపాయి వసూలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకే ఎల్ఈడీ లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నా.. వాటన్నింటనీ తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం పంచాయతీ పాలకవర్గాలపై ఒత్తిడి పెడుతున్నారు. తీర్మానాలు ఇవ్వాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. దీంతో పంచాయతీలపై విద్యుత్ దీపాల నిర్వహణ భారం పెరగనుంది. వాటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఏడేళ్లపాటు ఈఈఎస్ఎల్ సంస్థకు అప్పగించింది. ఒక్కో దీపంపై నిర్వహణ చార్జీల పేరిట భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై సర్పంచులు వ్యతిరేకంగా ఉన్నారు.

రెండింతలుగా సొమ్ము

రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో ఎల్ ఈడీ విద్యుత్​ దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఈఈఎస్ఎల్ సంస్థకు అప్పగించింది. లైట్లు ఏర్పాటు చేయడం, ఏడేండ్ల కాలానికి నిర్వహణను ఈ సంస్థకు అప్పగించింది. మొత్తం వీధిదీపాలు 16,31,715 ఉండగా.. వీటన్నింటా ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. దాదాపుగా 16.46 లక్షల ఎల్ఈడీ దీపాలను కొత్తగా బిగించనున్నారు.

ధరలు పెంచారు..

వీధి దీపాల ఏర్పాటుపై చాలా మేరకు ధరలు పెంచినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కొన్ని గ్రామాలు ఇప్పటికే ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ధరలతో పోలిస్తే తాజాగా ప్రభుత్వం కొటేషన్​లో ప్రకటించిన ధరలకు చాలా వ్యత్యాసం ఉంటోంది. పెట్టుబడి వ్యయాన్ని భారీగా నిర్ధారించారు. వాస్తవంగా పలు గ్రామాల్లో ఒక్కో వీధి దీపానికి కంపెనీ ధరల ప్రకారం బల్క్​గానే కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అప్పగించిన సంస్థ కూడా ఒకేసారి లక్షల దీపాలు కొనుగోలు చేస్తుండటంతో భారీగా తక్కువకు వచ్చే ఛాన్స్​ ఉన్నా ఎక్కువ ధరలు పెట్టారు.

18 వాట్స్ ఎల్ఈడీ దీపానికి రూ. 990గా పేర్కొనగా… ఇన్స్టాలేషన్​, పాత లైట్​ తొలగించడం, క్లాంప్స్, వైర్, కేబుల్, ప్రాజెక్టు మేనేజ్​మెంట్​ కన్సల్టెన్సీ ఫీజు వంటి కలుపుకుని ఒక్కో లైటును రూ. 2933.31కు బిగించనున్నారు. 35 వాట్స్ ఎల్​ఈడీకి రూ. 3,437.28 ఉండగా… 70 వాట్స్ బల్బుకు రూ. 4,674.55 చొప్పున, 110 వాట్స్​కు రూ. 6363.67 చొప్పున, 190 వాట్స్​ ఎల్​ఈడీకి రూ. 9927.13 చొప్పున పంచాయతీల నుంచి వసూలు చేయనున్నారు. వాస్తవంగా గ్రామాల్లో ఇప్పటి వరకు బిగించుకున్న 24 వాట్స్ లైట్లకే రూ. 1710 వరకు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం 18 వాట్స్ ఎల్ఈడీని బిగించేందుకు ఏకంగా రూ. 2933 చొప్పున బిల్లు వేస్తున్నారు. అంటే దాదాపుగా రెండింతలుగా బిల్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాలు విప్రో సంస్థ బల్బులను వాడుతుండగా… ఈ సంస్థ మాత్రం కొత్తగా లూమినోస్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే కంపెనీ ధరల ప్రకారం ఒక వందో, రెండు వందలో ఎక్కువగా ఉండే అవకాశాలున్నా.. భారీ స్థాయిలో పెంచడంపై గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏడేండ్ల వారంటీ ఉన్నా.. నెలనెలా నిర్వహణ ఛార్జీలే..

ఈ స్థాయిలో ధరలు పెంచడం, వాటిని ఏర్పాటు చేసే అంశంలో కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు నిలదీస్తున్నారు. పంచాయతీ అధికారులను అడుగుతున్నారు. అయితే ఏడేండ్ల వారంటీ ఉంటుందని సమాధానం దాటవేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే పంచాయతీలు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లకు రెండేండ్ల వారంటీ ఉంది. కానీ లూమినోస్ సంస్థ లైట్లకు ఏడేండ్ల వారంటీ ఇస్తున్నారు. కానీ దీనికి ప్రతినెలా నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఏడేండ్ల వారంటీ ఉంటే మళ్లీ నిర్వహణ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

పంచాయతీలకు భారం..

గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణ, విద్యుత్తు ఛార్జీల చెల్లింపుల బాధ్యతను ఇప్పటి వరకూ పంచాయతీలు చూస్తున్నాయి. సర్కారు సూచనల మేరకు.. విద్యుత్తు బిల్లుల ఆదా, పారదర్శకత పేరిట వీధిదీపాల నిర్వహణ బాధ్యతను ఈఈఎస్‌ఎల్‌కు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో పాత దీపాలను తొలగించి ఎల్‌ఈడీ బల్బులను సంస్థ అమర్చనుంది. ఏర్పాటు వ్యయమంతా భరిస్తూ దీపాల సామర్థ్యం మేరకు ఒక్కోదానిపై రూ.2930 నుంచి రూ.9,990 వరకు వెచ్చించనుంది. ఏడేళ్లలో నిర్వహణ, కొత్త పెట్టుబడి బాధ్యత ఆ సంస్థదే. ఈ వ్యవధిలో పంచాయతీలు ఒక్కో దీపంపై విద్యుత్‌ ఛార్జీల కింద నెలకు రూ.104 నుంచి రూ.284 వరకు చెల్లించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. నెలవారీగా తమకు చెల్లించే నిర్వహణ ఛార్జీల్లో పెట్టుబడి వ్యయం తిరిగి రాబట్టడం, దీపాల సామగ్రి, ప్రాజెక్టు నిర్వహణ, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, డాష్‌బోర్డు నిర్వహణ ఖర్చులు మాత్రమే ఉంటాయని ఆ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంటే ఎక్కువ ధరతో ఏర్పాటు చేస్తూనే నెలనెలా నిర్వహణ ఛార్జీలు తీసుకోనున్నారు. అయితే ఒక్కనెల ఆలస్యమైనా… అపరాధ రుసుంతో కలిపి పంచాయతీల నుంచి వసూలు చేయనున్నారు.

కరెంట్ బిల్లు మళ్లీ పంచాయతీలపైనే..

కేవలం విద్యుత్​ దీపాల నిర్వహణ ఛార్జీలకే సంస్థ పరిమితమవుతోంది. నిర్వహణ ఛార్జీల్లో నెలవారీ విద్యుత్తు ఛార్జీలు లేకపోవడంపై పంచాయతీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 120 దీపాలున్న గ్రామంలో నెలకు రూ. 8 వేల వరకు విద్యుత్తు ఛార్జీలు పడుతుంటే, ఒప్పందం ప్రకారం నిర్వహణ ఛార్జీల పేరిట కనీసం నెలకు రూ. 18 వేల వరకు భరించాల్సి పరిస్థితి ఉంటుందని చెప్పుతున్నారు. ఈ లెక్కన నిర్వహణ, విద్యుత్​ బిల్లుల పేరుతో పంచాయతీలపై అదనంగా రూ. 10 వేలు వసూలు చేసుకుంటారని స్పష్టమవుతోంది.

ఎందుకీ అదనపు వసూళ్లు..?

వాస్తవంగా పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో ఉంటున్నాయి. పల్లె ప్రగతి కింద ఇచ్చే నిధులు ఇప్పటికే విద్యుత్ బిల్లు, ట్రాక్టర్ల ఈఎంఐల వరకు సరిపోతున్నాయి. మళ్లీ వేతనాల కోసం సొంత ఆదాయంతో వచ్చే వాటినే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, వాటి మెయింటెనెన్స్ పేరుతో మరింత భారం మోయాల్సి వస్తోంది. దీనికి సొమ్ము ఎక్కడి నుంచి తేవాలనేదే అంతుచిక్కని ప్రశ్న. ఇదిలా ఉంటే పంచాయతీలు బిగించుకునే ఎల్ఈడీ వీధి దీపాలతో పోలిస్తే ప్రభుత్వం అప్పగించిన సంస్థ నుంచి బిగించే వాటికి ఎక్కువగా చెల్లించే సొమ్ము అదనంగా ఉంటోంది. ఎందుకంటే ఇక్కడ కూడా కమీషన్ల కోసమేనంటూ స్థానిక సంస్థల అధికారులే ఆఫ్​ ది రికార్డుగా చెప్పుతున్నారు.

Tags:    

Similar News