టీమిండియా నిలవాలంటే ఆ మ్యాచ్ గెలవాల్సిందే.. ఆందోళనలో అభిమానులు
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. గ్రూప్ 2లో టాప్ పొజిషన్ చేరుకుంటుందని భావించిన భారత జట్టు.. ప్రస్తుతం చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నది. గ్రూప్ 2లో ఉన్న టీమ్ ఇండియా, పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లు వరల్డ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 2, 3, 4 స్థానాల్లో […]
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. గ్రూప్ 2లో టాప్ పొజిషన్ చేరుకుంటుందని భావించిన భారత జట్టు.. ప్రస్తుతం చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నది. గ్రూప్ 2లో ఉన్న టీమ్ ఇండియా, పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లు వరల్డ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లు వరుసగా 8, 14, 19వ స్థానాల్లో ఉన్నాయి. టీమ్ ఇండియా ఎలాగైనా సెమీస్ చేరుకుంటుందని.. మిగిలిన బెర్త్ కోసం పాకిస్తాన్, న్యూజీలాండ్ పోటీ పడతాయని అందరూ ఊహించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మొత్తం తలకిందులైది. గ్రూప్ 2లో వరుసగా ఇండియా, న్యూజీలాండ్ జట్లను ఓడించి పాకిస్తాన్ సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నది. మిగిలిన ఒక స్థానం కోసం కివీస్, ఇండియా పోటీ పడుతున్నాయి. ఆదివారం ఇరు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ చావో రేవో కానున్నది.
మ్యాచ్ గెలవాల్సిందే..
ఇండియా – న్యూజీలాండ్ మధ్య జరుగనున్న మ్యాచ్ గ్రూప్ 2లో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సెమీఫైనల్ అవకాశం దక్కుతుంది. ఇరు జట్లు చాలా బలంగానే ఉన్నాయి. ఆటగాళ్లు కూడా గత కొంత కాలంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా ఇరు జట్లలోని బలహీనతలు బయటపడ్డాయి. భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలోని లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఓపెనర్లు విఫలమైతే భారత జట్టు దగ్గర మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఇక భువనేశ్వర్ ఫామ్‌లో లేకపోవడంతో పాటు బుమ్రా సరైన లెంగ్త్ అందిపుచ్చుకోలేక పోతున్నాడు. మిస్టరీ స్పిన్నర్ అని చెప్పుకున్న వరుణ్ చక్రవర్తిని పాక్ ఓపెనర్లు అలవోకగా ఆడేశారు. మరోవైపు కివీస్ జట్టు కూడా బ్యాటింగ్‌లో తడబడింది. పాక్ బౌలర్లను ఎదుర్కోవడంతో విఫలమయ్యింది. కానీ, కివీస్ బౌలర్లు మాత్రం కాసేపు పాకిస్తాన్‌ను భయపెట్టారు. భారత జట్టుకు కివీస్ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానున్నది. కీలకమైన మ్యాచ్ కాబట్టి భారత బ్యాటర్లు తమ మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకోవాల్సిందే. లేకపోతే కనీసం నాకౌట్ దశకు కూడా చేరుకోకుండా వెనుదిరగాల్సి వస్తుంది.
నెట్ రన్‌రేట్ కీలకం..
భారత జట్టు కేవలం విజయాలు సాధిస్తే సరిపోదు. నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవల్సి ఉంటుంది. చిన్న జట్టైన అఫ్గానిస్తాన్ ప్రస్తుతం భారీ నెట్ రన్‌రేట్ కలిగి ఉన్నది. గ్రూప్ మ్యాచ్ చివరకు వచ్చే సరికి ఒక్కోసారి రన్‌రేట్ కూడా కీలకంగా మారనున్నది. అందుకే సాధ్యమైనంత వరకు విజయాలపై దృష్టిపెట్టడమే కాకుండా రన్‌రేట్‌ను కూడా పెంచుకోవాలి. స్కాట్లాండ్, నమీబియా జట్లపై భారీ విజయాల ద్వారా దీన్ని సాకారం చేసుకోవచ్చు. ఇప్పుడు టీమ్ ఇండియా ముందు ఉన్న అసలు సవాలు న్యూజీలాండ్‌పై గెలవడం. ఆ తర్వాత నెట్ రన్‌రేట్ మెరుగు పరుచుకోవడమే. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు కూడా గట్టి పోటీ ఇస్తున్నది. కాబట్టి ఆ జట్టుతో కూడా కాస్త జాగ్రత్తగా ఆడటం మేలు. పాకిస్తాన్ తర్వాత యూఏఈలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అనుభవం అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు ఉన్నది.