ఉలిక్కి పడ్డ నిర్మల్..!

దిశ, ఆదిలాబాద్ : కరోనా వైరస్ (కోవిడ్ -19)తో నిర్మల్ జిల్లా ఉలిక్కిపడింది. ఆ మహమ్మారి కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే, బుధవారం గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన జిల్లావాసిలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వారిని క్వారంటైన్‌కు పంపారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, కరోనా లక్షణాలున్న ఆ […]

Update: 2020-04-02 01:00 GMT

దిశ, ఆదిలాబాద్ : కరోనా వైరస్ (కోవిడ్ -19)తో నిర్మల్ జిల్లా ఉలిక్కిపడింది. ఆ మహమ్మారి కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే, బుధవారం గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన జిల్లావాసిలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వారిని క్వారంటైన్‌కు పంపారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, కరోనా లక్షణాలున్న ఆ వ్యక్తి జిల్లాలో ఎంత మందిని కలిసారో, వారి ద్వారా కోవిడ్ -19 వ్యాప్తి ఇంకా జరిగే ప్రమాదముందని జిల్లావాసులు భయపడుతున్నారు.

గాంధీ ఘటన‌తో కలవరం..

నిర్మల్ పట్టణంలోని జోహార్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ ఇసాక్ అనే వ్యక్తి కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అయితే, ఆయన రెండోరోజు మృతి చెందడం ఆందోళనకు కారణం అవుతున్నది. మృతి చెందిన వ్యక్తితో పాటు ఆయన కుటుంబీకులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రచారం జరగడం జిల్లా వాసులను కలవరపెడుతున్నది. ఈ విషయమై రాత్రికి రాత్రే నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి కార్యచరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. నిర్మల్ జిల్లాలో కరోనా జడలు విప్పకుండా అధికారులు తగు నివారణా చర్యలకు సిద్ధమవుతున్నారు.

రంగంలోకి ఆరోగ్య శాఖ ప్రత్యేక టీంలు..

నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య టీంలు గురువారం ఉదయం 7 గంటల నుంచి రంగంలోకి దిగాయి. 40 మంది ఏఎన్ఎంలు, 65 మంది ఆశా కార్యకర్తలు, ఏడుగురు పర్యవేక్షణ సిబ్బంది, నలుగురు వైద్యులతో జిల్లా కేంద్రంలో సర్వే ప్రారంభించారు. పట్టణంలోని జోహార్ నగర్‌తో పాటు‌ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి కుటుంబాలు, ఇరుగుపొరుగు ఇళ్లోలో కరోనా లక్షణాలున్నాయా అని పరిశీలించనున్నారు. అనుమానితులు ఉన్నట్లయితే వారందరినీ తక్షణమే క్వారంటైన్‌కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజా పరిణామాలు జిల్లా వాసులు భయాందోళనలను కలిగిస్తున్నాయి.

మాకు రక్షణ ఏదీ..?

కరోనా పాజిటివ్ కేసు ఏరియాలో సర్వే చేయాలని తమకు ఆదేశాలు జారీ కావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి రక్షణ లేకుండా తాము ఎలా సర్వే చేయాలని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం ఎన్-95 మాస్కులు ఇవ్వకుండా సర్వే చేయాలనడం బాధాకరమని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో తమ సిబ్బంది‌పై సర్వే జరిపిన ఏరియాల్లో కొందరు దాడులు జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags: corona virus, covid 19 positive cases, high alert

Tags:    

Similar News