జోరుగా హవాలా దందా.. రూ.62లక్షలు స్వాధీనం
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో హవాల డబ్బు తరలింపునకు సంబంధించిన కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండ్రోజుల కిందట రూ.50 లక్షలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేయగా, తాజాగా రూ.62.95 లక్షల హవాల డబ్బును పట్టుకున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన మనీష్ తోష్నివాల్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. శాలిబండకు చెందిన విష్ణు బిరదార్‌తో కలిసి హవాలా డబ్బును ఒక ప్రాంతం నుంచి […]
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో హవాల డబ్బు తరలింపునకు సంబంధించిన కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండ్రోజుల కిందట రూ.50 లక్షలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేయగా, తాజాగా రూ.62.95 లక్షల హవాల డబ్బును పట్టుకున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన మనీష్ తోష్నివాల్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. శాలిబండకు చెందిన విష్ణు బిరదార్‌తో కలిసి హవాలా డబ్బును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కమీషన్ బేసిస్‌లో తరలించే వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలో గురువారం రూ.31.26 లక్షల నగదును హోండా యాక్టివాపై కస్టమర్లకు తరలిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఓఎస్డీ డీసీపీ రాధాకిషన్ నేతృత్వంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను చూపించకపోవడంతో మనీష్ తోష్నివాల్, విష్ణులను అరెస్టు చేశారు. దాంతో రూ.31.26 లక్షలతో పాటు యాక్టివా హోండాను సీజ్ చేశారు. ఈ కేసును విచారణ నిమిత్తం సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు.
మరో కేసులో.. బేగంబజార్‌లో నివసించే గుజరాత్‌కు చెందిన నాయి లలిత్ కుమార్, రాజస్థాన్‌కు చెందిన అశోక్ సింగ్‌లు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని ఇతర రాష్ట్రాల్లో హవాల ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నగరంలో వ్యాపార వేత్తలతో సంప్రదింపులు జరుపుతూ హవాల డబ్బును ఒక ప్రదేశం నుంచి మరోచోటుకు రవాణా చేస్తుంటారు. అందుకోసం రూ. లక్షకు 5 శాతం కమీషన్ పొందుతున్నారు. శుక్రవారం నాయి లలిత్‌కుమార్ తన సహచరుడు అశోక్ సింగ్‌తో కలిసి సికింద్రాబాద్ సిటీలైట్ హోటల్ సమీపంలోని నరేడి లక్ష్మీకాంత్ రెడ్డికి రూ.16.69 లక్షల నగదును డెలివరీ చేసేందుకు ఏపీ09 సీక్యూ 7850 నెంబరు గల హోండా యాక్టివాలో వెళ్తున్నారు.
సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో వీరిద్దరితో పాటు హవాలా వినియోగదారుడు నారెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డిలను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను మహాంకాళి పీఎస్ కు తరలించారు. ఇదిలా ఉండగా, నారాయణగూడ పీఎస్ పరిధిలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ. 15 లక్షలను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఈ డబ్బు కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ పి. శ్రావణ్ కుమార్ రెడ్డివిగా విచారణలో తేలడంతో పోలీసులు ఆయనను కూడా అరెస్టు చేశారు. ఈ కేసుల్లో చాకచాక్యంగా వ్యవహరించిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్ స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్ఐ బి.పరమేశ్వర్‌లను ఓఎస్‌డీ డీసీపీ రాధాకిషన్ రావు అభినందించారు.