వరంగల్ మేయర్‌గా సుధారాణి.?

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ అధిష్టానం మహిళలను ఖరారుచేసింది. ఖమ్మం మేయర్‌గా పి.నీరజ, వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి పేర్లను ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. కొత్తూరు, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు కూడా ఛైర్‌పర్సన్లుగా మహిళలనే ఖరారు చేసినట్లు తెలిసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు పార్టీ తరఫున పరిశీలకులుగా నియమితులైన వారికి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల పేర్లను సీల్డ్ కవర్‌లో […]

Update: 2021-05-06 10:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ అధిష్టానం మహిళలను ఖరారుచేసింది. ఖమ్మం మేయర్‌గా పి.నీరజ, వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి పేర్లను ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. కొత్తూరు, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు కూడా ఛైర్‌పర్సన్లుగా మహిళలనే ఖరారు చేసినట్లు తెలిసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు పార్టీ తరఫున పరిశీలకులుగా నియమితులైన వారికి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల పేర్లను సీల్డ్ కవర్‌లో పెట్టి అందజేసినట్లు తెలిసింది. శుక్రవారం ఈ పోస్టులకు జరిగే ఎన్నికల సందర్భంగా వీరు అధికారికంగా ఎన్నిక కానున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు శుక్రవారం మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఎన్నికల పరిశీలకులు అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకున్న విషయం విధితమే. ఖమ్మం కార్పొరేషన్‌కు మేయర్‌గా పి. నీరజ, డిప్యూటీ మేయర్‌గా కె. మురళీ, వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ గా నరేంద్ర కుమార్, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్‌గా రాచకొండ శ్రీను, వైస్ చైర్ పర్సన్‌గా కె. ఉమారాణి, కొత్తూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ చైర్ పర్సన్‌గా కరుణశ్రీ సుదర్శన్‌గౌడ్, సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా మంజుల, వైస్ చైర్‌పర్సన్‌గా కవిత సంపత్ రెడ్డి, అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్‌గా నర్సింహాగౌడ్, వైస్ చైర్ పర్సన్‌గా శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్‌గా దోరపల్లి లక్ష్మీరవీందర్, వైస్ చైర్ పర్సన్‌గా హారికా రామ్మోహన్‌ను ఎన్నిక చేసినట్లు సమాచారం.

పరిశీలకులు నిత్యం పర్యవేక్షణ..

గత నెల 30న ఎన్నికలు జరుగగా, మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టగా టీఆర్ఎస్.. వరంగల్‌లోని 66 డివిజన్లలో 48, ఖమ్మంలో 60 డివిజన్లలో 43, జడ్చర్ల మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో 23, అచ్చంపేటలో 20 వార్డుల్లో 13, నకిరేకల్లోని 20 వార్డుల్లో 11, సిద్దిపేటలోని 43 వార్డుల్లో 36, కొత్తూరులోని 12 వార్డుల్లో 7 వార్డులను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విజయం సాధించిన అభ్యర్థులంతా ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచే క్యాంపునకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్, మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకొని మేయర్, చైర్మన్ల ఎన్నికలో పాల్గొననున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేయగా, ఎన్నికల పరిశీలకులుగా నియమించడిన టీఆర్ఎస్ నేతలు గెలిచిన అభ్యర్థులు ఎటూ వెళ్లకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.

స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన పేర్లే..!

స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన అభ్యర్థులనే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎంపిక చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజాసేవ చేసే గుణం ఉన్న వారితో పాటు నమ్మకంగా, విధేయుడిగా ఉంటూ పనిచేసే వారినే పీఠంపై కూర్చోబెడుతున్నారు. పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలతో మంతనాలు చేసినా స్థానిక ఎమ్మెల్యేలు ససేమిరా అన్నట్లు సమాచారం. పీఠం కోసం పోటీపడి దక్కనివారికి అధిక ప్రాధాన్యం ఇస్తామని అందరూ కలిసి పనిచేసుకోవాలని నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీని వీడితే నష్టపోతారని కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

 

Tags:    

Similar News