టీఆర్ఎస్‌లో సంస్థాగత చిచ్చు.. పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామ, వార్డు కమిటీల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే గ్రామకమిటీల ఎన్నిక ఆపార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతం అవుతుండటంతో ఆ పార్టీలో కలవరం రేపుతోంది. ఎమ్మెల్యేలు, మండలపార్టీ అధ్యక్షులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ అనుచరులకే పెద్దపీట వేస్తున్నారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. […]

Update: 2021-09-13 19:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామ, వార్డు కమిటీల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే గ్రామకమిటీల ఎన్నిక ఆపార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతం అవుతుండటంతో ఆ పార్టీలో కలవరం రేపుతోంది. ఎమ్మెల్యేలు, మండలపార్టీ అధ్యక్షులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ అనుచరులకే పెద్దపీట వేస్తున్నారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలోని పలుచోట్ల అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని మధ్యలో ఇతర పార్టీల నుంచి చేరినవారికి అందలం వేస్తున్నారని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన 60 మంది పార్టీ కార్యకర్తలు తమ రాజీనామా లేఖలను మండల అధ్యక్షుడికి అందజేశారు. దీనికి తోడు జనగామ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ నాయక్ పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డటం టీఆర్ఎస్‌లోని విభేదాలు బహిర్గతమవుతున్నాయి.

టీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత నిర్మాణం కోసం కమిటీలను ఈ నెల 2 నుంచి పార్టీ జెండాలను ఆవిష్కరించి రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు, 142 మున్సిపాలిటీల్లో గ్రామ, వార్డు, మున్సిపాల్టీలో వార్డు కమిటీల నిర్మాణంను ప్రారంభించారు. ఈ నెల 12 వరకు పూర్తి చేయాలని, 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలు, 20 తర్వాత జిల్లా కమిటీల నిర్మాణం చేయాలని పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ కార్యదర్శులకు సూచించారు. సోషల్ మీడియా కమిటీలను సైతం నియమించాలని ఆదేశించారు. అయితే కమిటీలు ప్రారంభం నుంచి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.

నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం వెలిమినేడులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాలు వేర్వేరుగా జెండాను ఆవిష్కరించారు. వేర్వేరుగా గ్రామకమిటీలను వేసుకున్నారు. అదే విధంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని 10వ వార్డులో కండ్లకోయలో జెండావిష్కరణలో మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. వైస్ చైర్మన్ జెండా ఎగురవేసేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. సిద్ధిపేటలో టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్త గుండు రవితేజ పార్టీలో గుర్తింపు రాకపోవడంతో రాజీనామా చేశారు.

టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు.. ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. కారుకు బ్రేకులు.?

ఇదిలా ఉంటే భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వలిగొండ మండలంలోని గోకారం, రెడ్లరేపాక గ్రామకమిటీల ఎన్నికవాయిదా పడింది. ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి చేయలేదని జైనపల్లిలో గ్రామకమిటీలు అవసరం లేదని సర్పంచ్ సహా టీఆర్ఎస్ కార్యకర్తలు తీర్మాణం చేసి ఎమ్మెల్యేకు పంపగా, తిరిగి హామీ మేరకు ఎట్టకేలకు కమిటీని ఎన్నుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడ, నాంపల్లి, చండూరు, చౌటుప్పల్, మునుగోడు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తూ కమిటీ నియమకాలకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గ నేతలను సమన్వయం చేసేందుకు జిల్లా పార్టీ ఇన్ చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు బాధ్యతను అప్పగించారు. ఇది ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాలలో సర్పంచ్ ఒక కమిటీని నియమించగా, పార్టీ మండలాధ్యక్షుడు ఒక కమిటీని నియమించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకుంటుండటంతో పార్టీలోని విభేదాలు రక్తికట్టిస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మండలంలోని సీనియర్ నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు నేతలు పార్టీ కార్యకలాపాల్లో ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన 60 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ మండలాధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ కు ముకుమ్మడిగా రాజీనామా పత్రాన్ని అందజేశారు. నూతన గ్రామకమిటీలను ఏకపక్షంగా ఎన్నుకుంటున్నారని, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నవారిని విస్మరిస్తున్నారని, కొత్తగా వచ్చినవారికి గుర్తింపు నిస్తున్నారని ఆరోపించారు. ఆ అవమానంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అదే విధంగా జనగామా జిల్లాకు చెందిన టీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త లక్ష్మణ్ నాయక్ సైతం పార్టీలో అన్యాయం జరిగిందని, పార్టీ బలోపేతానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశానని పేర్కొంటూ ప్రగతిభవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అడ్డుకొని పోలీసుస్టేషన్ కు తరలించారు. ఇలా పార్టీలోని విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయోనని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సంస్థాగతం ఏమోగానీ గ్రూపుల లొల్లిమాత్రం తారాస్థాయికి చేరింది.

Tags:    

Similar News