కరోనా కష్టాల్లో ‘గ్రేటర్’ ఆర్టీసీ
దిశ, న్యూస్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ కరోనా పద్మ వ్యూహంలో చిక్కుకుంది. బస్సులు బయటికి తీసి తిప్పితే కరోనా వ్యాప్తి ఎక్కడ ఎక్కువవుతుందోనన్న భయం ఓ వైపు ఎక్కువ రోజులు బస్సులు నడపకుండా ఉంటే నష్టాలు ఎక్కువయి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి మరోవైపు ఉంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గ్రేటర్ జోన్‌కు ప్రస్తుత లాక్‌డౌన్‌లో కోలుకోలేని దెబ్బ తగులుతోంది. మూడో దశ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో […]
దిశ, న్యూస్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ కరోనా పద్మ వ్యూహంలో చిక్కుకుంది. బస్సులు బయటికి తీసి తిప్పితే కరోనా వ్యాప్తి ఎక్కడ ఎక్కువవుతుందోనన్న భయం ఓ వైపు ఎక్కువ రోజులు బస్సులు నడపకుండా ఉంటే నష్టాలు ఎక్కువయి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి మరోవైపు ఉంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గ్రేటర్ జోన్‌కు ప్రస్తుత లాక్‌డౌన్‌లో కోలుకోలేని దెబ్బ తగులుతోంది. మూడో దశ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో బస్సులు తిరగడానికి అనుమతిచ్చిన ప్రభుత్వం గ్రేటర్‌లో మాత్రం బస్సులు తిరగడానికి అనుమతి ఇవ్వలేదు. తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం గ్రేటర్ పరిధిలోనే నమోదవుతుండడంతోనే నాలుగో దశ లాక్‌డౌన్‌లోనూ రాజధానిలో బస్సులు తిప్పకూడదని నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే గ్రేటర్‌లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడం, ఇక్కడ బస్సులు బయటికి తీస్తే వాటిలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం పొరపాటు దొర్లినా నగరం మొత్తం కరోనామయమవుతుందనే భయంతోనే ప్రభుత్వం గ్రేటర్‌లో బస్సులకు అనుమతివ్వలేదని అధికారులు చెబుతున్నారు. 29 డిపోలు 2800 బస్సులతో గ్రేటర్ ఆర్టీసీ తెలంగాణలోనే అతి పెద్ద జోన్‌గా ఉంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు రోజుకు కోటి మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తుంటే అందులో 35 లక్షల మందిని ఒక్క గ్రేటర్ జోన్ ఆర్టీసీయే గమ్యానికి చేరుస్తుందంటే జోన్ ప్రాముఖ్యాన్నిఅర్ధం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో తెలంగాణలో ఆర్టీసీ మొత్తానికి రూ.12 కోట్ల దాకా ఆదాయం వస్తే, ఒక్క గ్రేటర్‌లోనే రూ.4 కోట్ల వసూలవుతుంది. నగరంలోనే విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో వారి పాసులు, సబ్సిడీల భారం ఎక్కువగా ఈ జోన్ మీదే పడుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ నష్టాలు కూడా ఈ జోన్‌లోనే ఎక్కువగా ఉంటూ వస్తున్నాయి. గతేడాది సమ్మె తర్వాత చార్జీలు పెంచడంతో ఈ నష్టాలు కొంత వరకు తగ్గినప్పటికీ జోన్ బ్రేక్ ఈవెన్‌కు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని నగరంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కరోనా వ్యాప్తి మరింత కుంగదీస్తోంది.
ఆ పరిస్థితి ఉండకపోవచ్చు..
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోలాగా కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటూ ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ బస్సులు నడపే పరిస్థితి రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం రాజధానిలో బస్సుల్లో సగటున ఉండే 65 శాతం ఆక్యుపెన్సీ శాతంలో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ వాటానే ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చూడడంలో ఆర్టీసీ ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ప్రశ్నార్ధకంగా ఉంది. ఇక జీహెచ్ఎంసీలో ప్రస్తుతం కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో బస్సులు తిప్పకుండా కొన్ని ప్రాంతాలకే బస్సులు నడిపితే ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనలోనూ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో మత పరంగా సున్నితంగా ఉండే ప్రాంతాలుండడంతో ప్రాంతాల వారీగా బస్సులు నియంత్రిస్తూ నడపడం మరో వివాదంగా మారే అవకాశం లేకపోలేదు. మరోపక్క రాజధాని హైదరబాద్‌లో ఆర్టీసీ బస్సులు లేకుండా రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో ముఖ్యమైన నగరంలో పూర్తిస్థాయి ప్రజా రవాణా ఎంత వరకు సాధ్యమన్న వాదన వినిపిస్తోంది.
ఎలా గాడినపడుతది..?
ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ ఉద్యోగులను ఆఫీసులకు చేర్చడానికి, వలస కార్మికులను రైల్వే స్టేషన్లకు చేర్చడానికి, ఇతరత్రా ప్రత్యేక అవసరాలకు మాత్రమే కొన్ని బస్సులను వినియోగిస్తున్నారు. సాధారణ ప్రజలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో నగరంలో ఇప్పటికే ప్రైవేటు ఆటోలు, క్యాబులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి భౌతిక దూరం ఊసే లేకుండా అధిక సంఖ్యలో జనాలను కుక్కి తీసుకెళుతున్నసంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతేగాక ఆటోలు, క్యాబులు నడిపేవాళ్లు ప్రజల అవసరాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బడిముబ్బడిగా చార్జీలు వసూలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని రెడ్‌జోన్‌గా ఉన్న రాజధానిలో లాక్‌డౌన్ సడలింపులిస్తూ అన్ని రకాల యాక్టివిటీలకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులు ప్రారంభమై పూర్తిస్థాయి ప్రజారవాణా సౌకర్యం అందుబాటులోకి రాకుండా నగర ఆర్థికవ్యవస్థ ఎలా గాడినపడుతుందన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నాలుగో దశ లాక్‌డౌన్ ముగిసే సమయానికి రాత్రి పూట కర్ఫ్యూ, లాక్‌డౌన్ మరింత పొడిగించే అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలిస్తుందో చూసి, అప్పటికి నగరంలో కరోనా కేసుల తీవ్రతను బట్టి ప్రభుత్వం గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సులను పూర్తిస్థాయిలో నడిపే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.