ఫీల్డ్ అసిస్టెంట్లపై స‌స్పెన్షన్‌ వేటు!

దిశ, న‌ల్లగొండ‌: స‌ర్య్కుల‌ర్ నెంబ‌ర్- 4779-2019ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ స‌మ్మె చేస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తాత్కాలికంగా తొల‌గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల‌ను తీసుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు నిరాక‌రించారు. దీంతో ఆదివారం సంబంధిత గ్రామ పంచాయ‌తీ కార్యద‌ర్శులు ఫీల్డ్ అసిస్టెంట్ల ఇంటి తలుపులకు ఆ ఉత్తర్వుల ప్రతుల‌ను అంటించి, ఆ ఫోటోలను వారికి వాట్సాప్‌లో పంపించారు. ఈ నోటీసుల‌పై రెండు రోజుల్లోగా జిల్లా డీఆర్‌డీవో అధికారికి […]

Update: 2020-03-15 06:51 GMT

దిశ, న‌ల్లగొండ‌:

స‌ర్య్కుల‌ర్ నెంబ‌ర్- 4779-2019ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ స‌మ్మె చేస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తాత్కాలికంగా తొల‌గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల‌ను తీసుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు నిరాక‌రించారు. దీంతో ఆదివారం సంబంధిత గ్రామ పంచాయ‌తీ కార్యద‌ర్శులు ఫీల్డ్ అసిస్టెంట్ల ఇంటి తలుపులకు ఆ ఉత్తర్వుల ప్రతుల‌ను అంటించి, ఆ ఫోటోలను వారికి వాట్సాప్‌లో పంపించారు. ఈ నోటీసుల‌పై రెండు రోజుల్లోగా జిల్లా డీఆర్‌డీవో అధికారికి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, లేక‌పోతే శాశ్వతంగా విధుల నుంచి తొల‌గించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే వాట్సాప్ ద్వారా వ‌చ్చిన నోటీసుల‌పై ఫీల్డ్ అసిస్టెంట్లు స‌మాధానం ఇవ్వాలా? వ‌ద్దా? అన్నదానిపై త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. న్యాయ నిపుణ‌ుల‌తో చ‌ర్చించిన త‌రువాతే నోటీసుల‌పై స్పందించాల‌న్న నిర్ణయానికి వ‌చ్చినట్టు సమాచారం. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ల విధుల‌కు క‌త్తి పోటుగా మారిన 4779 స‌ర్క్యుల‌ర్‌తో పాటు చ‌ట్ట ప్రకారం స‌మ్మె చేస్తున్న త‌మ‌ను విధుల నుంచి తొల‌గిస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వుల‌ను వెన‌క్కి తీసుకోకుంటే అసెంబ్లీని మ‌ట్టడించేందుకు సైతం వెనుక‌డామ‌ని ఫీల్డ్ అసిస్టెంట్లు వెల్లడించారు.

4779 స‌ర్క్యుల‌ర్‌పై స‌మ్మె ఇందుకే..

ఉపాధి హామీ ప‌నులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత గ్రామాల్లో 40 శాతం జాబ్ కార్డుల‌కు 100 రోజుల ప‌నిదినాలు క‌ల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మ‌ధ్యంత‌ర ఉత్తర్వుల‌ను తీసుకొచ్చింది. అలా ప‌ని దినాలు క‌ల్పించినవారికి మాత్రమే వేత‌నం రూ.8900, అల‌వెన్స్ రూ.1100తో కలిపి మొత్తం రూ. ప‌ది వేలు ఇస్తామ‌ని తేదీ 10-12-2019 రోజున రాష్ట్ర ప్రభుత్వం స‌ర్క్యుల‌ర్ నెంబ‌ర్ 4779-2019ను జారీ చేసింది. 40 శాతం ప‌నిదినాలు క‌ల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లను లిస్ట్-1లో చేర్చారు. వీరి ఉద్యోగాల‌కు ఎలాంటి ఢోకా లేద‌న్న మాట‌. 25 నుంచి 40 శాతంలోపు జాబు కార్డుదారుల‌కు 100 ప‌నిదినాలు క‌ల్పించినవారిని లిస్ట్ -2లో చేర్చారు. వీరిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా తొల‌గించి సీనియ‌ర్ మేట్ల కింద చేర్చారు. వీరికి 3,900 వేత‌నం, రూ.1100 అల‌వెన్స్ ఇస్తారు. 10 శాతంలోపు జాబు కార్డుదారుల‌తో 100 దినాలు ప‌ని చేయిస్తే వారిని శాశ్వతంగా విధుల నుంచి తొల‌గించ‌డ‌మే ఈ స‌ర్క్యుల‌ర్ ఉద్దేశం. ఈ సర్క్యులర్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లల్లో 4,339 మంది లిస్టు-2లో చేర్చబ‌డ్డారు. ఇక లిస్ట్-3 తొలగించే జాబితాలో 249 మంది ఉండగా న‌ల్లగొండ ఉమ్మడి జిల్లాలోనే సుమారు 54 మంది వ‌ర‌కు ఉన్నారు. అయితే ఈ స‌ర్క్యుల‌ర్‌ను ర‌ద్దు చేయాల‌ని ఫీల్డ్ అసిస్టెంట్లు ఫిబ్రవ‌రి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ద‌శ‌ల వారీగా ఆందోళ‌న చేయ‌డంతో కొంచెం వెన‌క్కి తగ్గింది. 30 శాతం జాబ్ కార్డుదారుల‌కు 100 రోజులు ప‌ని క‌ల్పించ‌ని వారికి వేటు త‌ప్పద‌ని స‌ర్క్యుల‌ర్‌ను స‌వ‌రించింది. ఈ పరిణామాలతో విసుగు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులు బ‌హిష్కరించి ఎంపిడీవో కార్యాల‌యాల ఎదుట స‌మ్మె చేస్తున్నారు.

కూలీల‌కు ప‌ని క‌ల్పించ‌డంలేదంటూ స‌స్పెన్షన్‌..

ఫీల్డ్ అసిసెంట్లు స‌మ్మె మొదలెట్టినప్పటి నుంచి గ్రామాల్లో ఉపాధి హామీ ప‌నులు బంద్ అయ్యాయి. ఇదే విష‌యాన్ని మండ‌ల అభివృద్ధి అధికారులు మార్చి 11న జిల్లా క‌లెక్టర్‌కు నివేదించారు. 2005 గ్రామీణ ఉపాధి చ‌ట్టాన్ని అనుస‌రించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి నెంబ‌ర్ డి1-2152- హెచ్.ఆర్|ఎఫ్‌.ఎ|2019-20 ప్రకారం మాన‌వ వ‌న‌రులు, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం- జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ క్షేత్ర స‌హాయ‌కులు ప‌నిచేయించడంలో విఫ‌ల‌మైనందున తాత్కాలికంగా విధుల నుంచి తొల‌గిస్తున్నట్టు స‌స్పెన్షన్ ఆదేశాల‌ను శ‌నివారం జారీ చేశారు. 7 రిజిష్టర్ల నిర్వహ‌ణ చేయకపోవడంతోపాటు మినిమ‌మ్ ఫ‌ర్మారెన్స్ పాల‌సీ 3(ఎ) ప్రకారం అడిగిన ప్రతి ఒక్క కూలీకి ప‌నులు కల్పించడంలో విఫ‌లమైనారని తెలిపింది. కాగా, హెచ్‌ఆర్ పాల‌సీ ప్రకారం (12) కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అండ్ మెయింటెనెన్స్‌, డిసిప్లెయిన్ పాల‌సీ మిస్ కండ‌క్ట్ (పి)లోని క్రమ‌సంఖ్య 3 మ‌రియు 7 అనుస‌రించి చ‌ర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. స‌స్పెన్షన్‌కు సంబంధించిన ఆరోప‌ణ‌ల‌పై ప్రతివాదన‌ను వినిపించేందుకు మార్చి 20వ తేదీ మ‌ధ్యాహ్నంలోగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాల‌యానికి రావాల‌ని స‌స్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు.

స‌మ‌స్యలు ప‌రిష్కరించే వ‌ర‌కు స‌మ్మె కొన‌సాగింపు

ప్రభుత్వం ఎన్ని బెదిరింపుల‌కు పాల్పడినా భయపడేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు అంటున్నారు. చ‌ట్ట ప్రకారంగా స‌మ్మె నోటీసు ఇచ్చినా త‌మ‌ను విధుల్లో తొల‌గిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడం హ‌ాస్యాస్పదంగా ఉంద‌ని విమర్శిస్తున్నారు. త‌మ న్యాయ‌మైన డిమాండ్లను ప‌రిష్కరించే వ‌ర‌కు స‌మ్మె కొన‌సాగిస్తామ‌ని ఆ సంఘం రాష్ట్ర నాయ‌కులు బ‌బ్బూరి శంక‌ర్ తెలిపారు. 14 సంవ‌త్సరాలుగా ఉపాధి హామీ ప‌థ‌కంతోపాటు ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ అమలుకు ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమ‌డింప చేసినట్టు తెలిపారు. అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్లను తొల‌గించేందుకు ప్రయత్నిస్తున్న స‌ర్కార్ ఈ దుశ్చర్యను విప‌క్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విష‌యాన్ని చ‌ర్చించేందుకు సోమ‌వారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెఢీ అవుతున్నట్టు సమాచారం.

Tags : Mahatma Gandhi Employment Scheme, Nalgonda, DRDO, Assembly

Tags:    

Similar News