ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు.. గోనె ప్రకాశ్‌రావు కంప్లైంట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కళ్ళముందు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం సైతం ప్రేక్షకపాత్ర వహించిందని, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు గోనె ప్రకాశరావు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘటనల వివరాలను ఆ ఫిర్యాదుతో జతపరిచారు. సీసీటీవీ ఫుటేజీ, మీడియా విజువల్స్ ఆధారంగా స్వతంత్ర దర్యాప్తు జరిపించడంతో పాటు అధికార పార్టీ క్యాంపులు ఏర్పాటుచేసి కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కళ్ళముందు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం సైతం ప్రేక్షకపాత్ర వహించిందని, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు గోనె ప్రకాశరావు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘటనల వివరాలను ఆ ఫిర్యాదుతో జతపరిచారు. సీసీటీవీ ఫుటేజీ, మీడియా విజువల్స్ ఆధారంగా స్వతంత్ర దర్యాప్తు జరిపించడంతో పాటు అధికార పార్టీ క్యాంపులు ఏర్పాటుచేసి కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు అందజేసిన తర్వాత ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించే విధానాన్ని తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో అరాచకాలు జరిగాయని, ఈ జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సారంగపూర్ జెడ్పీటీసీ పీ రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారని, కానీ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు పత్రాలను సమర్పించారని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ సైతం నిజానిజాల లోతుల్లోకి వెళ్ళకుండా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు కలిసి ఫోర్జరీ సంతకాలతో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ తంతును ముగించారని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలోనూ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శైలజా రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్తే టీఆర్ఎస్ నేతలు ఆమె చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చింపేశారని, ప్రైవేటు టీవీ ఛానెళ్ళ కెమేరాల ముందే ఈ ఘటన జరిగిందని, చివరకు బాధితురాలు పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా అటు కలెక్టర్, ఇటు పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఆమె గోడును పట్టించుకోలేదని వివరించారు. ఈ తరహా ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించేవన్నారు. ఎన్నికల్లో పోటీలోనే లేకుండా చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలను ఖర్చు చేసి క్యాంపులు ఏర్పాటు చేసిందని, దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులిచ్చినా ఎలాంటి చర్యలూ లేవన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు.