పొట్ట కూటికి పోతే.. కాటికి పంపుతున్న కరోనా

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో ఇప్పటికే ఎన్నో జీవితాలు ఆగమయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లో కొవిడ్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళ్తే అదే పని కరోనా వ్యాప్తికి కారణమై కాటికి పంపుతోంది. అందరి ఇండ్లలో పొయ్యి వెలిగేలా కృషి చేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్ ఇంట్లోనే నేడు పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీల్లో కరోనా వీర విజృంభణ చేస్తుండటంతో సెకండ్ వేవ్ లో 40కి పైగా […]

Update: 2021-05-23 10:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో ఇప్పటికే ఎన్నో జీవితాలు ఆగమయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లో కొవిడ్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళ్తే అదే పని కరోనా వ్యాప్తికి కారణమై కాటికి పంపుతోంది. అందరి ఇండ్లలో పొయ్యి వెలిగేలా కృషి చేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్ ఇంట్లోనే నేడు పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీల్లో కరోనా వీర విజృంభణ చేస్తుండటంతో సెకండ్ వేవ్ లో 40కి పైగా డెలివరీ బాయ్స్ మృతిచెందారు. ఏడుగురు డిస్ట్రిబ్యూటర్లు సైతం కొవిడ్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇదంతా కేవలం నెలరోజుల వ్యవధిలోనే జరగడంతో మిగతా డెలివరీ బాయ్స్, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబీకులైతే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోక, యాజమాన్యాలు చేయూతనందించక ఛిన్నాభిన్నమైపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులు కోటి 27 లక్షల మంది ఉన్నారు. ప్రతినెల 53 నుంచి 55 లక్షల సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. వారికి గ్యాస్ సిలిండర్లు చేరవేసేందుకు వెళ్తుండటంతో డెలివరీ బాయ్స్ కొవిడ్ బారిన పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంస్థలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు 720 మంది ఉండగా ఇందులో 40 శాతం వరకు కొవిడ్ బారిన పడ్డారు. ఇందులో ఇటీవల నెల వ్యవధిలోనే ఏడుగురు మృత్యువాతపడ్డారు. డెలివరీ బాయ్స్, కార్యాలయ సిబ్బంది, మెకానిక్ మొత్తాన్ని కలుపుకొని 15 వేల పైచిలుకు మంది ఉన్నారు. ఇందులో 2000 వేల మందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. మొత్తంగా 40కి పైగా మరణాలు సంభవించాయి. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ డెలివరీ చేయడం వల్లే తమకు కరోనా వ్యాప్తి చెందుతోందని భావించి డెలివరీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ అందిస్తే కానీ రాలేమని యాజమాన్యాలకు ఇప్పటికే తేల్చి చెప్పారు. అలాగే తమను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి డోర్ డెలివరీ చేసేదిలేదని గ్యాస్ డెలివరీ బాయ్స్ తేల్చేశారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన రమేశ్ కుమార్ భారత్ గ్యాస్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో కరోనా తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఇటీవల రమేశ్ కుమార్ గుండెపోటుతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. సర్జరీ చేయడంతో అంతా బాగుందని ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. ఆస్పత్రిలోనే చికిత్సపొందుతూ పది రోజుల క్రితం రమేశ్ కుమార్ మరణించాడు. ఇదిలా ఉండగా ఉద్యోగ నిమిత్తం ఆయన పెద్ద కుమారుడు రవిచంద్ర ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. కొవిడ్ కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో తండ్రి కడసారి చూపులకు కూడా నోచుకోలేదు. ఇలాంటి ఘటనలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.

Tags:    

Similar News