తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు..గ్యాస్‌కు పెరిగిన డిమాండ్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 మహమ్మారి అన్ని రంగాలను భయపెడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో…కార్యాలయాల నుంచి కర్మాగారాల వరకూ మూతపడ్డాయి. అత్యవసరమైన సేవలను మాత్రమే మినహాయింపు ఇచ్చారు. విదేశాలకే కాకుండా దేశీయంగా కూడా విమానాలన్ని నిలిపోయాయి. రైళ్లు, బస్సులు వంటి ప్రజా రవాణా మొత్తం నిద్రావస్థలోకి జారుకుంది. దీంతో రోజుకు వేలల్లో తిరిగే వాహనాలు రోడ్డు ముఖం చూడక వారాలు గడిచాయి. వాహనాలు తిరగక దేశీయంగా పెట్రోల్, […]

Update: 2020-04-07 01:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 మహమ్మారి అన్ని రంగాలను భయపెడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో…కార్యాలయాల నుంచి కర్మాగారాల వరకూ మూతపడ్డాయి. అత్యవసరమైన సేవలను మాత్రమే మినహాయింపు ఇచ్చారు. విదేశాలకే కాకుండా దేశీయంగా కూడా విమానాలన్ని నిలిపోయాయి. రైళ్లు, బస్సులు వంటి ప్రజా రవాణా మొత్తం నిద్రావస్థలోకి జారుకుంది. దీంతో రోజుకు వేలల్లో తిరిగే వాహనాలు రోడ్డు ముఖం చూడక వారాలు గడిచాయి. వాహనాలు తిరగక దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు దిగజారాయి. అయితే, ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండి ఏం చేయాలో పాలుపోక రకరకాల వంటకాలు మొదలుపెట్టారు కాబోలు మిగిలిన ఇంధనాల అమ్మకాలు పడిపోతుంటే ఎల్‌పీజీ గ్యాస్‌కు మాత్రం డిమాండ్ పెరిగింది. ఏ ఏ ఇంధన అమ్మకాలు ఎంతమేరకు తగ్గాయో పరిశీలిస్తే..!

ఇండియాలో పెట్రోల్ అమ్మకాలు 17.6 శాతం తగ్గిపోయాయి. డీజిల్ అమ్మకాలకు కూడా డిమాండ్ సుమారు 26 శాతం పడిపోయాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా వాహనాలు చాలా తక్కువ స్థాయిలో రోడ్లమీదకు వస్తున్నాయి. అత్యవసరంగా తప్పించి మిగిలిన వారు ఇంటివద్దే ఆగిపోవడంతో ఇంధన డిమాండ్ పూర్తీగా తగ్గిపోయింది. ఇక, విమానయాన రంగం కూడా పూర్తీగా నిలిచిపోవడంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అమ్మకాలు 31.6 శాతం క్షీణించాయి. అనేక రకాల వ్యాపారాలు ఆగిపోవడం వంటి కారణాలతో విమానాలన్నీ పార్కింగ్‌లకే పరిమితమయ్యాయి.

దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనంగా డీజిల్ 25.9 శాతం పెరిగి 4.982 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అమ్మకాలు 4,63,000 టన్నులకు పడిపోయాయి.

అయితే, లాక్‌డౌన్ కారణంగా దేశంలో 80 శాతం జనాభా ఇళ్లకే పరిమితం కావడంతో గృహావసరాల కోసం వాడే ఎల్‌పీజీ గ్యాస్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. మార్చి నెలలో ఎల్‌పీజీ గ్యాస్ అమ్మకాలు 1.9 శాతం పెరిగి 2.286 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.

లాక్‌డౌన్ మరింత కాలం పొడిగిస్తారనే సంకేతాలున్నప్పటికీ..డిమాండ్‌లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదని, ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఆంక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వం నుంచి తగిన సూచనలు వస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు క్రితం ఏడాది కంటే మూడింట ఒక వంతు డిమాండ్ తగ్గొచ్చని, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజా రవాణాపై ఆంక్షలు సడలించిన తర్వాతే డిమాండ్ పెరుగుతుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.

గడిచిన రెండున్నరేళ్ల కాలంలో పెట్రోల్ అమ్మకాలు ఈ స్థాయిలో దిగజారడం ఇది తొలిసారి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల్లో ఇంధనం అమ్మకాలు 8.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. డీజీల్ 2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి వరకూ 1.1 శాతం వినియోగం పెరిగింది. ఫిబ్రవరిలో మరింత పెరగాల్సిన అమ్మకాలు కరోనా వ్యాప్తితో ప్రతికూలంగా మారాయి. ఇక, లాక్‌డౌన్‌తో పెరిగిన ఎల్‌పీజీ వినియోగం ఒక్క ఫిబ్రవరిలో 4.3 శాతం, గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి కాలానికి 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Tags: Narendra Modi, Diesel, Covid, Fuel, Lockdown, Petrol Sales, Coronavirus, Fuel Sales

Tags:    

Similar News