అజ్ఞాతంలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు.. మిత్రుడు దెబ్బకేనా..?
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందారు. మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఎన్ని పార్టీలు మారినా ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయాలపై మంచి పట్టున్న ఆయన రాజకీయ పరిణామాలపై అంచనా వేస్తూ పార్టీలు మారిపోతూ ఉంటారు. పార్టీలు మారినా కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందుతారు. అందుకే ఆయనను ఎన్నికల మాస్టారుగా పిలుస్తుంటారు. కీలక నేతలను ఓడించిన నేత కావడంతో ఆయనను లక్కీ పొలిటీషియన్ అని పిలుస్తుంటారు. అంతటి […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందారు. మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఎన్ని పార్టీలు మారినా ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయాలపై మంచి పట్టున్న ఆయన రాజకీయ పరిణామాలపై అంచనా వేస్తూ పార్టీలు మారిపోతూ ఉంటారు. పార్టీలు మారినా కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందుతారు. అందుకే ఆయనను ఎన్నికల మాస్టారుగా పిలుస్తుంటారు. కీలక నేతలను ఓడించిన నేత కావడంతో ఆయనను లక్కీ పొలిటీషియన్ అని పిలుస్తుంటారు. అంతటి లక్కీ పొలిటీషియన్‌కు కాలం కలిసిరావడం లేదో ఏమో ఆయన ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆయన అనుచరులే వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టించిన ఆ నేత ఇప్పుడు కానరాకుండా పోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇంతకీ అజ్ఞాతంలో ఉన్న ఆ నాయకుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెవరు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు. గత కొన్ని నెలలుగా ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడ నుంచి పోటీ చేసినా విజయం తథ్యం..
గంటా శ్రీనివాసరావు పుట్టింది ప్రకాశం జిల్లా. కానీ ఆయన రాజకీయారంగేట్రం చేసింది మాత్రం విశాఖపట్టణం జిల్లా నుంచి. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన నాన్ లోకల్ అయినప్పటికీ విశాఖ రాజకీయాలను శాసించారు. 1999లో అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో చోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయన నాటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. 2014లో భీమిలి నియోజవర్గం నుంచి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇలా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీసారి నియోజకవర్గం మార్చడం ఆయనకు అలవాటు. నియోజవర్గం మార్చినా కూడా గెలుపు మాత్రం ఆయనదే. అందుకే రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావును ఎన్నికల మాస్టారు అని పిలుస్తారు. ఇకపోతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం..ఒకప్పటి రాజకీయ మిత్రుడు అవంతి శ్రీనివాస్ మంత్రి అయ్యారు. గంటా శ్రీనివాసరావు మాత్రం రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. రాజకీయాలను అంతగా పట్టించుకోవడం మానేశారు. రాజకీయాల్లో మంత్రిగానో లేక ఒక ఉన్నత హోదాలో ఉంటూ హల్‌చల్ చేసే గంటా కేవలం ఎమ్మెల్యే పదవికే పరిమితమవ్వడంతో ఆయన ఒక్కసారిగా రాజకీయాలకు దూరమయ్యారు. మధ్యలో తానున్నానంటూ ఓ ప్రెస్మీట్ పెట్టి మళ్లీ సైలెంట్ అయిపోయేవారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా..
విశాఖ ఉక్కును కాపాడుకోడానికి అంతా రాజీనామాలు చేయాలని పిలుపు ఇచ్చారు. ఆ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. గంటా రాజీనామా చేసిన వెంటనే అవంతి శ్రీనివాసరావు మళ్లీ విమర్శలు చేశారు. పని లేని వారే ఇలా రాజీనామాలు చేస్తారు అంటూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. విశాఖ ఒడిలో ఎదిగిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఈ రాజీనామాతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి తొలి అడుగు వేశాను. పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అంతా పోరాటం చేయాలి. స్టీల్ ప్టాంట్‌కు సొంత గనులుంటే టన్ను ఉక్కు ఉత్పత్తికి ఖర్చు తగ్గుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మారాలి. ఢిల్లీలో రైతులు, తమిళనాడు జల్లికట్టు ఉద్యమంలా ప్రతి ఒక్కరు ఉద్యమంలోకి రావాలి. మన ముఖ్యమంత్రి.. ప్రధానిపై ఒత్తిడి తీసుకు వచ్చి ప్రైవేటీకరణ ఆపాలి.
నీతి ఆయోగ్ నిర్ణయాలన్నీ ప్రభుత్వం అమలు చేయాలని లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాలంటూ గంటా కీలకవ్యాఖ్యలు చేశారు. అనంతరం స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేశారు. అంతేకాదు తన రాజీనామాను ఆమోదించాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి మరీ విజ్ఞప్తి చేశారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నారు. నేతలతో చర్చలు జరిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన తన రాజకీయ ప్రత్యర్థి, ఒకప్పటి మిత్రుడు, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావుతో సైతం ముచ్చటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణలతో కూడా కలిసి చర్చించారు. ఈ పరిణామాలతో గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అవుతున్నారని..ఇక ఆయన రాజకీయాల్లో మళ్లీ బీజీకాబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
బెడిసికొట్టిన వ్యూహం..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటూ వార్తలు వినిపించాయి. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఆ స్థానంలో తాను పోటీ చేయనని స్టీల్ ప్లాంట్ కార్మికుడిని పోటీ చేయిస్తానని చెప్పుకొచ్చారు. ఒక వేళ విశాఖ ఉక్కు ఉద్యమం తరపున నిజంగా అభ్యర్థిని నిలబెడితే అతడికి టీడీపీ, వైసీపీలు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అప్పుడు రెండు పార్టీలు విశాఖ ఉక్కు ఉద్యమానికి వ్యతిరేకమనే భావన ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఇటు సొంత పార్టీతో పాటు.. తాను చేరాలని భావించినా కొర్రీలు పెడుతున్న వైసీపీ, బీజేపీలకు కూడా చెక్ పెట్టొచ్చని గంటా వ్యూహ రచన చేశారు. అయితే గంటా వ్యూహాలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెక్ పెట్టారు. అటు టీడీపీ నుంచి కూడా సహాయనిరాకరణ ఎదురైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దూకుడుగా వ్యవహరించింది. ఈ పరిణామాలతో గంటా శ్రీనివాసరావు మళ్లీ సైలెంట్ అయిపోయారు. రాజీనామా విషయంలో సైలెంట్ గా ఉండడమే మంచిదని భావించిన ఆయన భావించినట్లు తెలుస్తోంది.
అజ్ఞాతం వీడని గంటా శ్రీనివాసరావు..
విశాఖ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఉద్యమంలా..జల్లికట్టు ఉద్యమంటా తీసుకురావాలంటూ పిలుపునిచ్చిన గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. స్టీల్ ప్లాంట్ నిరసనలలో కూడా పాల్గొనలేదు. ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కార్మికులు రెండు దఫాలుగా పర్యటించారు ఆ పర్యటనలలో ఎక్కడా కనిపించలేదు. తొలు దఫాలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. ఆ సందర్భంలో వైసీపీ నేతలు కనిపించారే గానీ గంటా మాత్రం కానరాలేదు. ఆ తర్వాత ఢిల్లీలో రెండు రోజులపాటు మహాధర్నాలు నిర్వహించారు. ఆ మహాధర్నాలో కూడా కనిపించలేదు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించినా గంటా శ్రీనివాస్ మాత్రం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. ఇది రాజకీయాల్లో సంచలనంగా మారింది.
నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన అజ్ఞాతం వీడటం లేదు. రోజు రోజుకు కేంద్రం ఒక్కో ప్రకటన విడుదల చేస్తోంది. 100శాతం ప్రైవేటీకరణ చేసి తీరతామని ప్రకటిస్తోంది. అయినప్పటికీ గంటా మాత్రం కనీసం స్పందించడం లేదు. ఉన్నట్టుండి గంటా సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి..? ఆయన వ్యూహం బెడిసి కొట్టిందా..? వైసీపీ నేతలు చెక్ పెడుతున్నారా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇకనైనా గంటా అజ్ఞాతం వీడతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.