IPL: విదేశీ ప్లేయర్లకు బీసీసీఐ షాక్.. ఐపీఎల్‌కు రాకపోతే జీతాలు కట్
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ క్రికెట్‌కు దిక్సూచి ఐసీసీ అయినా.. పెద్దన్న మాత్రం బీసీసీఐ అని అందరూ అంటుంటారు. అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ తమకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోదని పలువురు చెబుతుంటారు. కరోనా కారణంగా అర్దాంతరంగా ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 18 నుంచి యూఏఈ వేదికగా లీగ్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌లు నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే వేదిక, లాజిస్టిక్స్, ఇతర విషయాలపై ఎమిరేట్స్ క్రికెట్ […]
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ క్రికెట్‌కు దిక్సూచి ఐసీసీ అయినా.. పెద్దన్న మాత్రం బీసీసీఐ అని అందరూ అంటుంటారు. అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ తమకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోదని పలువురు చెబుతుంటారు. కరోనా కారణంగా అర్దాంతరంగా ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 18 నుంచి యూఏఈ వేదికగా లీగ్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌లు నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే వేదిక, లాజిస్టిక్స్, ఇతర విషయాలపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ పాలకులు చర్చలు జరుపుతున్నారు. ఆ వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఇప్పుడు ఐపీఎల్ నిర్వహణకు అతిపెద్ద అడ్డంకు విదేశీ ప్లేయర్ల గైర్హాజరు. ‘ఎవరు వచ్చినా రాకపోయినా ఐపీఎల్ మాత్రం జరిగి తీరుతుంది’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దుబాయ్‌లో వ్యాఖ్యానించారు. కానీ వాస్తవానికి ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్లు లేకపోతే మజానే ఉండదనేది జగమెరిగిన సత్యం. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బంగ్లాదేశ్ క్రికెటర్లు సెప్టెంబర్ 18 నుంచి జరిగే మలి విడత ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరనే వార్తలు వచ్చాయి. ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గిల్స్ ఈ విషయంపై ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు సెప్టెంబర్ మూడో వారంలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తున్నందున ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరని స్పష్టం చేశారు.
రాకపోతే.. భారీ కోతే..
ప్రపంచంలో మరే ఇతర లీగ్‌లో రానంత డబ్బు కేవలం ఐపీఎల్ ఆడితే వస్తుంది. అందుకే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడటానికి మొగ్గు చూపిస్తుంటారు. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ తప్ప మిగతా లీగ్స్‌పై పెద్దగా ఆసక్తి చూపించరు. ఆసీస్ క్రికెటర్లు అయితే బిగ్ బాష్‌లో ఆడినా ఆడకపోయినా.. ఐపీఎల్ అనగానే ఇండియాలో వాలిపోతారు. కాగా, ఇప్పుడు పలు దేశాల క్రికెటర్లకు ఐపీఎల్ రెండో ఫేజ్ ఆడాలని ఉన్నా వారి క్రికెట్ బోర్డులే అడ్డుపడుతున్నట్లు బీసీసీఐ అనుమానిస్తున్నది. అందుకే ఆటగాళ్ల ద్వారా బోర్డులను దెబ్బకొట్టే ఆలోచన చేసింది.
ఐపీఎల్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడితే వారికి అంత మేరకే వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. అంటే ప్రో-రేటా ప్రకారమే ఆటగాళ్లకు చెల్లింపులు ఉంటాయి. ఉదాహరణకు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన పాట్ కమిన్స్‌కు గత ఏడాది రూ. 15.5 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది 7 మ్యాచ్‌లే ఆడినందుకు కేవలం రూ. 7.75 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. ఒక వేళ పాట్ కమిన్స్ యూఏఈలో జరిగే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటే అతడికి పూర్తి వేతనం వస్తుంది. ఐపీఎల్ ఫేజ్ 2కి దాదాపు 40 మంది విదేశీ ఆటగాళ్లు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వీళ్లు కనుక గైర్హాజరయితే భారీ మొత్తంలో వేతనాలను ఫ్రాంచైజీలు కోతపెట్టనున్నాయి.
బోర్డులకూ నష్టమే..
ఆటగాళ్లకు జీతాల్లో కోత విధించం వల్ల ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులకు కూడా ఆదాయంలో గండి పడనున్నది. ఐపీఎల్ ఆడటానికి తమ క్రికెటర్లను అనుమతించినందుకు గాను ప్రతి బోర్డుకు తమ ఆటగాడు ఐపీఎల్‌లో సంపాదించే దానిలో కొంత శాతం ఆ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ చెల్లిస్తుంది. ఇప్పుడు కనుక ఆటగాళ్ల వేతనాల్లో కోత పడితే.. క్రికెట్ బోర్డులు కూడా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది. ఐపీఎల్‌లో బెన్ స్టోక్స్, జే రిచర్డ్‌సన్, కైల్ జేమిసన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, రషీద్ ఖాన్, క్రిస్ మోరిస్, స్టీవ్ స్మిత్ వంటి క్రికెటర్లు భారీగా సంపాదిస్తున్నారు. వీళ్లే కాకుండా అనేక మంది విదేశీ క్రికెటర్లకు ఐపీఎల్‌లో భారీగానే వేతనాలు అందుతున్నాయి. వీళ్లు కనుక గైర్హాజరైతే క్రికెట్ బోర్డుల ఆదాయానికి కూడా గండిపడే అవకాశాలు ఉన్నాయి.
‘యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లకు రాని ఆటగాళ్ల వేతనాల్లో భారీ కోత పడే అవకాశం ఉన్నది. ప్రో-రేటా పద్దతిలోనే చెల్లింపులు ఉంటాయి. దీని వల్ల ఆటగాడే కాకుండా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా భారీగానే ఆదాయాన్ని కోల్పోతాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అంటే ఐపీఎల్‌కు కనుక ఇంగ్లాండ్ క్రికెటర్లు రాకపోతే.. ఈసీబీ భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది.
ఇండియన్ క్రికెటర్లు సేఫ్..
ఐపీఎల్‌లో ఇండియన్ క్రికెటర్లకు ప్రత్యేక ఇన్స్యూరెన్స్ ఉండటం వల్ల వారికి ప్రో-రేటా పద్దతి వర్తించదని బీసీసీఐ చెబుతున్నది. ఐపీఎల్‌కు ఎంపికైనా గాయాల కారణంగా లేదా ఇతర సమస్యల వల్ల ఐపీఎల్‌లో ఆడలేని టీమ్ ఇండియా క్రికెటర్లకు 2011 నుంచి ఇన్స్యూరెన్స్ అమలు చేస్తున్నారు. వీళ్లు ఆడినా, ఆడకపోయినా పూర్తి వేతనం వారి అకౌంట్లలో పడుతుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్ సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమ్యాడు. కానీ అతడికి ఇన్స్యూరెన్స్ ఉండటంతో పూర్తి వేతనాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చెల్లించింది. బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న టీమ్ ఇండియా క్రికెటర్లు అందరికీ ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది.