"వీళ్లు పోలీసులపై కాల్పులు జరిపారు"
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి డివిజన్ మావోయిస్టు కమిటీకి చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయిం అస్మి , బి/39 సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, చింతూరు డిఎస్పీ ఖాదర్ పాషా ఎదుట ఎటపాక పోలీస్ స్టేషన్లో శనివారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నయిం అస్మి వారి వివరాలను వెల్లడించారు. ‘చింతూరు మండలం అల్లివాగు గ్రామానికి చెందిన మడకం మాస అలియాస్ రాణు ఆజాద్ […]
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి డివిజన్ మావోయిస్టు కమిటీకి చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయిం అస్మి , బి/39 సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, చింతూరు డిఎస్పీ ఖాదర్ పాషా ఎదుట ఎటపాక పోలీస్ స్టేషన్లో శనివారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నయిం అస్మి వారి వివరాలను వెల్లడించారు. ‘చింతూరు మండలం అల్లివాగు గ్రామానికి చెందిన మడకం మాస అలియాస్ రాణు ఆజాద్ రక్షణ దళ సభ్యుడిగా పనిచేశాడు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇర్రంపల్లి వద్ద పోలీసులపై ఎదురు కాల్పుల్లో పాల్గొన్నాడు. మరో మావోయిస్టు భీమయ్య అలియాస్ భీములుది ఏటపాక మండలం జగ్గారం 2019 నుంచి తెలంగాణ రాష్ట్రం చర్ల స్థానిక గెరిల్లా స్క్వాడ్ లో దళ సభ్యుడిగా ఆయుధాలను క్యారీ చేశాడు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పలుమార్లు పోలీసులపై ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడు. మడవి లక్ష్మీ అలియాస్ నవిత, పద్దం శాంతి అలియాస్ కవిత, మడివి జోగమ్మ అలియాస్ జోగి.. ఈ ముగ్గురు ఏటపాక మండలం విస్సాపురం గ్రామ పరిధిలోని గొల్లగుప్పకు చెందినవారు. వీరు 2019 నుంచి చర్ల స్థానిక గెరిల్లా దళంలో సభ్యులుగా పనిచేశారు. ల్యాండ్‌మైన్ అమర్చడం, మావోయిస్టు సభలకు గిరిజనులను బలవంతంగా తీసుకువెళ్లడం, మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు పంపిణీ, పోలీసుల రాకపోకల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేయడం వంటి పనులు చేసేవారు. బలవంతంతో వీరు మావోయిస్టు మిలీషియా సభ్యులుగా చేరారు. అయితే మావోయిస్టుల పద్ధతులు, విధానాలు నచ్చకపోవడంతో జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయారు’ అని ఎస్పీ తెలిపారు. అనంతరం లొంగిపోయిన వారికి ఎస్పీ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. వీరికి పునరావాసానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. దళ సభ్యుల లొంగుబాటుకు కృషి చేసిన ఏటపాక ఎస్సైలు చినబాబు, జ్వాలాసాగర్, పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎటపాక సీఐ గీతా రామకృష్ణ, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ శ్రీకృష్ణ సలాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.