ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థకు మంగళం!
దిశ, ఆదిలాబాద్: ఉపాధి చూపించేవారి జీవనోపాధి గల్లంతు కానుందా.. ఫీల్డ్ మీదుండి పనులు చేయించేవారికే పనిలేని దీనస్థితి నెలకొనబోతున్నదా.. అంటే పరిణామాలు అవుననే అంటున్నాయి. అధికార వర్గాల నుంచి అవే సంకేతాలు వస్తున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్థికభారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఉపాధి హామీ పథకంలో పనులను మరింత మెరుగ్గా చేయించుకోవచ్చన్న ఆలోచనతో ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడబోతున్నది. ఇప్పటిదాకా ఫీల్డ్ అసిస్టెంట్లు […]
దిశ, ఆదిలాబాద్:
ఉపాధి చూపించేవారి జీవనోపాధి గల్లంతు కానుందా.. ఫీల్డ్ మీదుండి పనులు చేయించేవారికే పనిలేని దీనస్థితి నెలకొనబోతున్నదా.. అంటే పరిణామాలు అవుననే అంటున్నాయి. అధికార వర్గాల నుంచి అవే సంకేతాలు వస్తున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్థికభారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఉపాధి హామీ పథకంలో పనులను మరింత మెరుగ్గా చేయించుకోవచ్చన్న ఆలోచనతో ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడబోతున్నది. ఇప్పటిదాకా ఫీల్డ్ అసిస్టెంట్లు చూసిన పనులన్నింటినీ గ్రామపంచాయతీ కార్యదర్శులకు అప్పగించబోతున్నారు. ఉద్యోగ భద్రతపై ఆందోళనగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు రెండురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగారు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసనను పట్టించుకోకపోగా వారిపై వేటు వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పొమ్మనలేక పొగబెట్టిన సర్కారు ఆందోళనలను సాకుగా చూపి వారి తొలగింపునకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకుపైగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పనులకు దూరంగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటానికి దిగిన వీరిని ఎక్కడికక్కడ తొలగించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
పొగబెట్టారు ఇలా…
ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పని పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే క్రమంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకరచన చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఏడు వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు పది వేల రూపాయల చొప్పున వేతనాలను చెల్లిస్తున్నది. అయితే వారి పనికి తగ్గ పారితోషికం పేరిట వేతనాల అనే సరికొత్త విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ప్రతి కుటుంబంలో ఉండే ఒక జాబ్‌కార్డు వార్షికంగా 30 నుంచి 40 పని దినాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.10,000, 20 నుంచి 30 పనిదినాలు కల్పించేవారికి రూ.9000, అలాగే 10 నుంచి 20 రోజులు పనిదినాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్‌లకు రూ.7500 చొప్పున వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం గుట్టుగా అన్ని జిల్లాలకు సర్క్యులర్లు జారీ చేసింది. ఇలా ఫీల్డ్ అసిస్టెంట్లకు మింగుడు పడకుండా చేసింది. ఈ నేపథ్యంలో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని గ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు పూనుకున్నారు. దీంతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్‌కు రంగం సిద్ధం?
వేతనాల వివాదంలో ఆందోళనకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్ల మెడపై కత్తి వేలాడుతోంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా తమ వేతనాలు పెంచాల్సిందిపోయి ప్రభుత్వం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లు టెంట్లు వేసి ధర్నా చేస్తున్నారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అవుతున్నారన్న సాకు చూపుతూ వారందరినీ సస్పెండ్ చేయాలని అధికారులకు పైనుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లను వదిలించుకోవడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
క్షేత్ర బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులకు…
ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయి బాధ్యతలు చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలన్నీ ఇకపై గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు చూడబోతున్నారు. ఇప్పటికే అన్ని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు కూడా అందాయి. అనేక గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు అమలు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు తోడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించిన విషయం కూడా తెలిసిందే. దీంతో ఆయా గ్రామాల్లో జరిగే ఈజీఎస్ పనులను కూడా వారికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు విధిగా ఉపాధి హామీ పథకం పనులు కూడా నిర్వహించాలని ఆదేశాలు అందాయి. ఇక పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపట్టే ఈజీఎస్ పనుల సమాచారాన్ని నేరుగా ఈజీఎస్ శాఖ కాకుండా మండల పంచాయతీ అధికారికి ఆ తర్వాత మండల అభివృద్ధి అధికారి కి చేరవేస్తారు. ఆపై అన్ని మండలాల ఎంపీడీవోల నుంచి జిల్లా పరిషత్ సీఈఓలకు సమాచారాన్ని అందించనున్నారు. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం క్షేత్రస్థాయిలో అసిస్టెంట్లు తమపై ఉండే టెక్నికల్ అసిస్టెంట్‌లకు, ఆపై మండల స్థాయి ఏపీవోలకు పనుల సమాచారాన్ని అందించేవారు. దీన్నిబట్టి క్రమంగా ఉపాధిహామీ శాఖ నిర్వీర్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆర్థికభారాన్ని తగ్గించుకునే వ్యూహం..!
ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నూతన పంచాయతీ చట్టాన్ని తీసుకు వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టింది. గ్రామస్థాయిలో పంచాయతీ పనులతోపాటు హరితహారం ఇంకా అనేక పనులను వారికి అప్పగించింది. పనిలో పనిగా ఉపాధి హామీ పనులను కూడా పంచాయతీ కార్యదర్శుల ద్వారానే చేయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించినా ఆ శాఖ పనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. పంచాయతీ కార్యదర్శులకు టీవీఎస్ పనులు అప్పగిస్తే జవాబుదారీతనం కూడా పెరిగి మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ఆశగా ఉందని జిల్లాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా, 370 పైగా పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రం 222 మంది మాత్రమే ఉన్నారు. వీరందరినీ తొలగించి ఈజీఎస్ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈజీఎస్ పనుల నిర్వహణ మొదలైంది. ఇదే విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే జరిగితే సుమారు 15 ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థకు మంగళం పాడినట్లే.
Tags: mgnrega, field assistant, panchayat secretary, zilla parishath ceo