ఏపీలో వింత ఆచారం : వర్షం పడాలంటే.. నాలుకతో దానిని స్వీకరించాలట!
దిశ, ఏపీ బ్యూరో: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఆచరిస్తూ తమ విశ్వాసాలను చాటుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామంలో రైతులు వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా పాటిస్తున్నారు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతకు వినూత్నంగా పూజలు చేయడం ఇక్కడి రైతులు పూర్వీకుల నుంచి ఆచరిస్తున్న ఆనవాయితీ. విజయనగరం జిల్లాలో జరిగే ఈ పూజల గురించి తెలుసుకుందాం రండి..! సాలూరు మండలం కూర్మరాజుపేట ప్రాంత రైతులకు పంటలు పండించాలంటే […]
దిశ, ఏపీ బ్యూరో: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఆచరిస్తూ తమ విశ్వాసాలను చాటుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామంలో రైతులు వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా పాటిస్తున్నారు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతకు వినూత్నంగా పూజలు చేయడం ఇక్కడి రైతులు పూర్వీకుల నుంచి ఆచరిస్తున్న ఆనవాయితీ. విజయనగరం జిల్లాలో జరిగే ఈ పూజల గురించి తెలుసుకుందాం రండి..!
సాలూరు మండలం కూర్మరాజుపేట ప్రాంత రైతులకు పంటలు పండించాలంటే వర్షాధారణమే దిక్కు. పూర్వ కాలం నుంచి ఈ ప్రాంతంలో వర్షాపాతం తక్కువగా నమోదు అవుతుంది. దీంతో ఆ కాలం నుంచి అక్కడి గ్రామస్తులు, రైతులు వర్షాకాలం ప్రారంభంలో గ్రామదేవత జాకరమ్మకు పూజలు చేస్తుంటారు. అయితే ఈ పూజలను సాధారణంగా కాకుండా వినూత్నం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రతి ఏటా వర్షాకాలంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామ సమీపంలో ఉన్న కొండపైకి గ్రామస్తులు, రైతులు అందరూ చేరుకుంటారు. అక్కడే వంటలు చేసుకొని దేవత జాకరమ్మకు నైవేద్యంగా కోడి, మేకను బలిస్తారు. ప్రసాదాన్ని నేలపై వేసి గ్రామస్తులందరు మోకాళ్లపై కూర్చొని దానిని నాలుకతో స్వీకరిస్తారు. అలా చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని వాళ్ల నమ్మకం. తమకు పంటలు పండాలంటే వర్షమే ఆధారమని, వర్షాలు లేకపోతే పంటలు పండవని, అందుకే పూర్వీకుల నుండి ఇదే విధంగా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ఈ వినూత్న పూజలకు కూర్మరాజుపేటతోపాటు చిన్న వలస, పెద్ద వలస తదితర గ్రామాల ప్రజలు కూడా భారీగా తరలివచ్చి పూజల్లో పాల్గొంటారు. సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుతూ వరుణ దేవుని కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో వారు చేసిన పూజలు ఫలించి మరుసటి దినమే వర్షాలు కురుస్తాయని ఆ గ్రామస్తులు భావిస్తున్నారు.