చండ్రుగొండలో ఉద్రిక్తత.. పురుగులమందు తాగిన పోడు రైతులు
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో పోడు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య జరిగిన వివాదంలో ఇద్దరు పోడు సాగుదారులు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీతాయిగూడెం గ్రామంతో పాటు సమీపంలోని రామవరం రేంజ్, దామరచర్ల సెక్షన్ అండ్ బీట్, పరిధి 34 కంపార్ట్‌మెంట్‌లలోని 15 హెక్టార్లలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు సుమారు […]
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో పోడు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య జరిగిన వివాదంలో ఇద్దరు పోడు సాగుదారులు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీతాయిగూడెం గ్రామంతో పాటు సమీపంలోని రామవరం రేంజ్, దామరచర్ల సెక్షన్ అండ్ బీట్, పరిధి 34 కంపార్ట్‌మెంట్‌లలోని 15 హెక్టార్లలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు సుమారు 100 మంది సిబ్బందితో వచ్చి భూమిని జేసీబీలతో చదును చేయిస్తున్నారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోడు రైతులు ట్రాక్టర్లను, జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య ఘర్ణణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలో గుర్రం రవి, బన్నె రాములు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన పోలీసులు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రికి తీసుకెళ్తోన్న క్రమంలో బన్నె రాములు వాహనం నుంచి తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు. దీనిని ఖండించిన పోడు సాగుదారులు రాములును అధికారులే ఎక్కడికో తీసుకెళ్లారని అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులతో తమకు ప్రాణాపాయం ఉందని, రాములును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన సీపీఎం నేతలు పోడు సాగుదారులను విడుదల చేయాలని విజయవాడ- జగదల్పూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ… రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని, రైతులపై దాడికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాస్తారోకో కారణంగా సుమారు రెండు గంటల పాటు రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సీఐ నాగరాజు ఆందోళన జరుగుతున్న స్థలానికి చేరుకొని పోడు సాగుదారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ.. ఈ భూములను గతేడాదే క్షుణ్ణంగా పరిశీలించి స్వాధీనం చేసుకున్నామని, గతంలో కూడా హద్దులు ఏర్పాటు చేస్తున్నప్పుడు గ్రామస్తులు సహకరించారని తెలిపారు. కానీ, కావాలనే ఈరోజు కొంతమంది రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమయానికి రాక కాస్త ఆలస్యమైందని, రెండ్రోజులుగా బాగా వర్షాలు పడుతుండటంతో నేడు హరితహారం కార్యక్రమం చేపట్టామని అన్నారు.