కొర్రీలు పెడుతున్నారు..!

దిశ‌, ఖ‌మ్మం: ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ అన్నట్టుగా ఉంది ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. వాణిజ్య పంటలను కాదని ఇతర పంటలు సాగు చేసినా కూడా అదే తంతు కొనసాగుతోంది. దీంతో లబోదిబోమంటూ తమ గోస వెల్లబోస్తున్నారు. అవి కాదని ఇవే చేస్తే.. జిల్లా రైతులు సార‌వంత‌మైన భూముల్లో వాణిజ్య పంట‌ల‌ను కాద‌ని మ‌రీ సుబాబుల్‌, జామాయిల్ పంట‌లను సాగు చేశారు. కానీ, ఆ పంటల […]

Update: 2020-03-09 05:47 GMT

దిశ‌, ఖ‌మ్మం: ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ అన్నట్టుగా ఉంది ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. వాణిజ్య పంటలను కాదని ఇతర పంటలు సాగు చేసినా కూడా అదే తంతు కొనసాగుతోంది. దీంతో లబోదిబోమంటూ తమ గోస వెల్లబోస్తున్నారు.

అవి కాదని ఇవే చేస్తే..

జిల్లా రైతులు సార‌వంత‌మైన భూముల్లో వాణిజ్య పంట‌ల‌ను కాద‌ని మ‌రీ సుబాబుల్‌, జామాయిల్ పంట‌లను సాగు చేశారు. కానీ, ఆ పంటల గిట్టుబాటు ధర విషయంలో రైతులను వ్యాపార సంస్థ‌లు, ద‌ళారీ వ్య‌వ్య‌స్థ దారుణంగా దెబ్బ‌కొడుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం ట‌న్ను సుబాబుల్ ధ‌ర రూ.4,500 ఉంటే మూడేళ్ల క్రితం రూ.4,000 ఉండేది. రెండున్న‌రేళ్ల క్రితం వ‌ర‌కు కూడా రూ. 3,800 లకు సంస్థ‌లు కొనుగోలు చేశాయి. ఆరు నెల‌ల క్రితం రూ.3,300 ల‌కు ధ‌ర‌కు త‌గ్గించేశాయి. ప్ర‌స్తుతమైతే రూ.2,800 కొనుగోలు చేస్తామ‌ని, అదికూడా క‌ర్ర తొక్క తీసేసి తీసుకురావాల‌ని కొర్రీలు పెడుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ లో ప‌రిస్థితులు బాగులేక‌పోవ‌డంతోనే ధ‌ర‌లు త‌గ్గించేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి. వాస్త‌వానికి అది మాత్రం నిజం కాద‌ని రైతులు ఆరోపిస్తున్నారు.

ఖ‌మ్మం జిల్లాలో 3 ల‌క్ష‌ల్లో ఎక‌రాల్లో సాగు

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో దాదాపు 3 ల‌క్ష‌ల ఎక‌రాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 3 సంవ‌త్స‌రాల క్రితం సుబాబుల్‌, జామాయిల్ క‌ర్ర‌ల‌కు ట‌న్నుకు రూ. 4000 నుంచి రూ. 4200 వ‌ర‌కు మద్ధతు ధ‌ర ఉండేది. దానికితోడు ఐటీసీ సార‌పాక బీపీఎల్ సంస్థ కూడా అనేక ప్రొత్సాహ‌కాలు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో న‌మ్మిన రైతులు వేలాదిగా ముందుకు వచ్చి సాగుచేశారు. కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు కూడా చేసుకుంది. అయితే ప్ర‌స్తుతం కొనుగోలుకు సిద్ధంగానే ఉన్నామ‌ని పేర్కొంటూనే ధ‌ర‌ను దారుణంగా 2700ల‌కు త‌గ్గించేసింది. అది కూడా క‌ర్ర తొక్క‌తీసి తీసుకురావాల‌ని ష‌ర‌తులు విధిస్తోంది. ఇక పంట కోత చేప‌ట్టి మార్కెట్‌కు త‌ర‌లించే క్ర‌మంలో ఒక్కో ట‌న్ను కర్ర‌కు దాదాపు రూ.800 వ‌ర‌కు ఖర్చవుతోందని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్కో ట‌న్ను కేవ‌లం రూ. 2 వేలకు మాత్ర‌మే కొనుగోలు చేస్తున్న‌ట్లు లెక్క వేసుకోవాల‌ని వాపోతున్నారు. ఎక‌రాకు రూ.50 వేల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టి పంట‌ కాలానికి మూడేళ్లు వేచి చూసి చివరకు న‌ష్టాల‌తో క‌ర్ర‌ల‌ను అమ్ముకోవాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు స‌న్నక‌ర్ర ఉంద‌నే పేరుతో చాలావరకు క‌ర్ర‌ను తీసుకోవ‌డానికి అధికారులు ఇష్ట‌ప‌డ‌టంలేదంటూ దిగులుతో చెబుతున్నారు.

అంత‌ర్జాతీయ మార్కెట్ బూచి…

బీపీఎల్ అధికారులు చెబుతున్న‌ట్లుగా అంత‌ర్జాతీయ మార్కెట్లో ధ‌ర‌ల్లో ఒడిదుడుకులు అంతగా లేవ‌ని సుబాబుల్ సాగు రైతులు చెబుతున్నారు. సంస్థ‌లోని కొంత‌మంది అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌ల‌సి ద‌ళారీల‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని వాపోతున్నారు. ద‌ళారీల వ‌ద్ద నుంచి నేరుగా కొనుగోళ్ల‌కు సిద్ధ‌ప‌డ‌టం వారి నిజ‌స్వ‌రూపానికి నిద‌ర్శ‌న‌మంటున్నారు.

చెక్కులు అంద‌జేసేవి..

2005 సంవత్సరానికి ముందు లాగే మార్కెట్ క‌మిటీల ద్వారా కొనుగోళ్లు చేప‌ట్టే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అప్పుడే గిట్టుబాటు ధ‌ర ల‌భ్య‌మ‌వుతుంద‌ని రైతులు కోరుతున్నారు. పాత విధానంలో రైతుల వ‌ద్ద నుంచి మార్కెట్ క‌మిటీలు నేరుగా కొనుగోలు చేసి రైతుల‌కు చెక్కులు అంద‌జేసేవని, ఆ త‌ర్వాత బీపీఎల్‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణ‌ా, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు క‌ర్ర‌ను త‌ర‌లించి విక్ర‌యించేవని వారు చెప్పారు. ఈ విధానంలో రైతుల‌కు స‌రుకును విక్ర‌యించుకునేందుకు, సొమ్ము తీసుకోవ‌డంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావని, మ‌ళ్లీ పాత విధానాన్ని అమ‌ల్లోకి తీసుకురావాల‌ని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతాంగం పోరుబాట‌…

ఇదే విషయమై ఏడాదిన్నర క్రితం జిల్లాకు చెందిన జామాయిల్‌, సుబాబుల్‌ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేప‌ట్టారు. ఐటీసీ, బీపీఎల్‌ పర్మిట్లు విడుదల చేసి కలప కొట్టించడానికి ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం అమ‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అంతర్జాతీయ మార్కెట్‌ పేరుతో బీపీఎల్‌ యాజమాన్యం ఇటీవల ధరను రూ. 2700ల‌కు తగ్గించ‌డంతో రైతులు భ‌గ్గుమ‌న్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉద్యమబాట పట్టారు. ఇందులో భాగంగా గ‌త శుక్ర‌వారం ఐటీసీ బీపీఎల్‌ ఎదుట మహాధర్నా నిర్వ‌హించారు. ద‌శ‌లవారీగా ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని జామాయిల్‌, సుబాబుల్‌ రైతు సంక్షేమ సంఘం తెలిపింది.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జామాయిల్, సుబాబుల్ రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: subabul, farmers, khammam, price

Tags:    

Similar News