బలవంతంగా అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు
దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వం చెప్పిన పంటలు మాత్రమే వేయాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకు సరిపడా ఎరువులు, విత్తనాలు సమకూర్చామని చెప్తున్నారు. కానీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని అనుకుంటున్నా విత్తనాలు దొరకక తిప్పలు పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామాల్లో నకిలీ విత్తనాల అమ్మకాలు పెరిగాయి. రైతులకు బలవంతంగా అంటగట్టేందుకు వ్యాపారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాంటి రసీదులు లేకుండా రకరకాల కంపెనీల పేరుతో నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్నారు. […]
దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వం చెప్పిన పంటలు మాత్రమే వేయాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకు సరిపడా ఎరువులు, విత్తనాలు సమకూర్చామని చెప్తున్నారు. కానీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని అనుకుంటున్నా విత్తనాలు దొరకక తిప్పలు పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామాల్లో నకిలీ విత్తనాల అమ్మకాలు పెరిగాయి. రైతులకు బలవంతంగా అంటగట్టేందుకు వ్యాపారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాంటి రసీదులు లేకుండా రకరకాల కంపెనీల పేరుతో నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్నారు. పలుచోట్ల పట్టుబడుతున్నా.. అమ్మకాలు మాత్రం ఆగట్లేదని పలువురు పేర్కొంటున్నారు.
సందిగ్ధంలో రైతులు
రాష్ట్రంలో వానాకాలం సాగు రైతులను సందిగ్ధంలో పడేసింది. నియంత్రిత సాగు విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆదేశాలివ్వలేదు. తెలంగాణ సోన రకం వరి పండించే రైతులకు కూడా స్పష్టమైన సూచనలు అందలేదు. రుతుపవనాల రాకతో రైతులు గందరగోళ పరిస్థితుల్లోనే సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పంట పెట్టుబడి అవసరాల కోసం ఇచ్చే రైతుబంధు సాయం ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు. మరోవైపు విత్తన బాధలు కూడా తప్పట్లేదు. ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో పత్తి, కంది పంటల విస్తీర్ణాన్ని పెంచినా అందుకు సరిపడా విత్తనాలను మాత్రం అందుబాటులోకి తేలేదు.
విత్తనాలు అంతంతే
ప్రభుత్వం ఈసారి కూడా పత్తి విత్తనాల అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో గత వానాకాలం పత్తి సాగు 54.45 లక్షల ఎకరాల్లో ఉండగా ఈసారి 60.16 లక్షలకు పెంచింది. ఒక్కో ఎకరాకు సగటున రెండు విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయి. మొలకెత్తనివి, పోగుంటల రూపంలో రెండు ఎకరాలకు అర ప్యాకెట్ అవసరముంటుందని అంచనా. అయితే గతేడాది అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1.10 కోట్ల విత్త ప్యాకెట్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఈ వానాకాలం పత్తిసాగు లెక్కల ప్రకారం విత్తన ప్యాకెట్లు దాదాపు 1.50 కోట్లకుపైగా అవసరమని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ లెక్కన దాదాపు 40 లక్షల విత్తన ప్యాకెట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వరి సన్న రకాల విస్తీర్ణం పెరగడంతో వాటికి కూడా కొరత ఏర్పడింది. 25 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేయాలంటే ప్రస్తుత అంచనాల ప్రకారం 37 లక్షల విత్తన బ్యాగులు అవసరం. కానీ మన దగ్గర అందుబాటులో ఉన్నవి 20 లక్షలు మాత్రమే. సన్న రకాలు, దొడ్డు రకాల వరి విత్తనాలు వానాకాలం సాగు ప్రణాళిక ప్రకారం 1,38,148 క్వింటాళ్లు అవసరం. కానీ గతేడాది సాగు అంచనా ప్రకారం మన దగ్గర అందుబాటులో ఉన్నవి 58,553 క్వింటాళ్లు మాత్రమే. మిగతా విత్తనాలు ఎక్కడి నుంచి తేవాలన్నది ఇంకా తేలలేదు.
సాగు పెరిగింది..
గతేడాది 7.38 లక్షల ఎకరాల్లో కందిసాగయితే.. ఈ సారి 12.31 లక్షలకు పెరగనుంది. పెంచిన సాగుకు 30 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని లెక్క తేలింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి 3,352 క్వింటాళ్లు, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి 13,100 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రణాళికలో వెల్లడించింది. అయితే నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన 13 వేల క్వింటాళ్ల పత్తి విత్తనాలు ఇంకా రాష్ట్రానికి రాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రైవేట్ విత్తన వ్యాపారుల నుంచి కొనుగోలు చేసుకోవాలని రైతులకు స్పష్టం చేశారు. ఈ సారి కంది విత్తనాలు 30 వేల క్వింటాళ్ల వరకు అవసరం ఉండగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం 16 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు కూడా వాటిని జిల్లాలకు 3 వేల క్వింటాళ్లను విత్తనాభివృద్ధి సంస్థ పంపించింది. మరోవైపు సోయా విత్తనాలు కూడా ఈసారి 1.45 లక్షల క్వింటాళ్లు అవసరముంటాయని ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలకు మాత్రం 38 వేల క్వింటాళ్లను మాత్రమే పంపించారు. నియంత్రిత సాగు విధానంలో పేర్కొన్నట్లుగా పప్పు దినుసులు, ఇతర పంటలు ఎక్కువ వేయాలని సూచించారు. కానీ వాటికి సరిపడా విత్తనాలను అందుబాటులోకి తీసుకురాకపోవడం, ముందస్తు ప్లాన్ లేకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు కూడా గతేడాది విక్రయాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అదనంగా 0.5 శాతం అందుబాటులో పెట్టారు. కానీ ప్రభుత్వ ప్రణాళికలో మాత్రం ఆయా పంటల సాగు దాదాపు 12 నుంచి 28 శాతం వరకు పెరిగింది. దీంతో విత్తనాలకు తిప్పలు మొదలయ్యాయి.
విత్తనాలు అవసరం ఉన్న విత్తనాలు అందుబాటులో ఉన్నవి
పత్తి | 1.60 లక్షల ప్యాకెట్లు | 1.10 లక్షలు |
వరి | 1,38,148 క్వింటాళ్లు | 58,553 |
కంది | 30 వేల క్వింటాళ్లు | 16 వేల క్వింటాళ్లు |