ఏఎస్సైనంటూ… పెళ్లాం నుంచి 15 లక్షలు దోచేశాడు

దిశ, ఏపీ బ్యూరో: నకిలీ గుర్తింపు కార్డుతో ఎస్సైనని చెప్పి యువతిని వివాహం చేసుకుని, ఆమె కుటుంబ సభ్యుల నుంచి సుమారు 15 లక్షల రూపాయలు దోచేసిన ఘరానా మోసగాడి ఘనకార్యం వైజాగ్‌లో వెలుగు చూసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావు పోలీసు యూనిఫాంలో ఫొటో తీసుకున్నాడు. ఎఎస్సైగా పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డు సృష్టించి విశాఖపట్టణంలోని గవర కంచరపాలెంకు చెందిన యువతికి వల […]

Update: 2020-06-22 01:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: నకిలీ గుర్తింపు కార్డుతో ఎస్సైనని చెప్పి యువతిని వివాహం చేసుకుని, ఆమె కుటుంబ సభ్యుల నుంచి సుమారు 15 లక్షల రూపాయలు దోచేసిన ఘరానా మోసగాడి ఘనకార్యం వైజాగ్‌లో వెలుగు చూసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావు పోలీసు యూనిఫాంలో ఫొటో తీసుకున్నాడు. ఎఎస్సైగా పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డు సృష్టించి విశాఖపట్టణంలోని గవర కంచరపాలెంకు చెందిన యువతికి వల వేశాడు. నెమ్మదిగా ఆమెను ప్రేమలోకి దింపాడు. కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు అంగీకరించరని, పెళ్లి చేసుకున్న తరువాత పెద్దలకు చెబుదామంటూ.. 2019 జూన్ 19న వైజాగ్‌లోని వన్ టౌన్‌లోని ఒక గుడిలో కులాంతర వివాహం చేసుకున్నాడు.

ఆ తరువాత పెళ్లయిన కొత్తలో సెలవు పెడుతున్నానని చెప్పి ఇంట్లో ఉండేవాడు. రోజుల తరబడి ఇంటి పట్టునే ఉంటున్న భర్తను ఉద్యోగానికి ఎందుకు వెళ్లడం లేదని భార్య ప్రశ్నించడంతో…తాను సస్పెండ్ అయ్యానని ఒకసారి, ఆరోగ్యం బాగాలేదని మరోసారి రకరకాల సాకులు చెప్పసాగాడు. ఇంకోసారి గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్నాని చెప్పి భార్య తండ్రి నుంచి ఏకంగా 12.80 లక్షల రూపాయలు కాజేశాడు. అది చాలక భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి మరో లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఆమె సోదరి వద్ద నుంచి మరికొంత బంగారం తీసుకున్నాడు. ఇంత చేస్తూ తన పెళ్లి విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అతని తల్లిదండ్రులకు విషయం తెలియడంతో తనను వేధించడం మొదలుపెట్టాడని, కులం పేరుతో దూషిస్తున్నాడంటూ బాధితురాలు గత నెల 29న గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు ఎస్సైగా చెప్పుకుంటూ మోసం చేస్తున్న అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతనిపై ఫిర్యాదు చేసినా సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని బాధితురాలు వాపోయింది. దీంతో ఉన్నతాధికారులను కలిసి, తనకు న్యాయం చేసి, తన అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని కోరుతోంది.

Tags:    

Similar News