దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లోని స్థానికులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించేందుకు టీటీడీ(TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దర్శనానికి సంబంధించిన టోకెన్లను జనవరి 5న జారీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. టీటీడీ బోర్డు సమావేశం(TTD Board Meeting)లో తిరుపతి స్థానిక ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నెలకు సంబంధించి జనవరి 7న దర్శనం కల్పించాల్సి ఉండగా.. అందుకుగాను.. టోకెన్లను జనవరి 5న జారీ చేయనున్నారు. తిరపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డులు చూపించి టోకెన్లు పొందవచ్చు. తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటనలో పేర్కొంది.