TPCC chief: అల్లు అర్జున్ మామ గాంధీ భవన్ కు రావడంపై మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అల్లు అర్జున్ మామ గాంధీ భవన్ కు రావడంపై మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrasekhar Reddy) గాంధీ భవన్ (Gandhi Bhavan) రావడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) స్పందించారు. చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన విషయం మాకు తెలియదని చెప్పారు. ఆయన ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాక నాతో ఫోన్ లో మాట్లాడి మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారన్నారు. అల్లు అర్జున్ పై మాకు ఎలాంటి కక్ష లేదన్నారు. అంతకు ముందు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. దీపాదాస్ మున్షీతో (Deepadas Munshi) భేటీ కోసం కూర్చున్నారు. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండానే బన్నీ మామను అక్కడి నుంచి పంపిచేశారు. ఆ తర్వాత ఆమె కూడా వెళ్లిపోయారు. అయితే ఈ భేటీ ప్రయత్నాలపై మీడియా ప్రశ్నించినా చంద్రశేఖర్ రెడ్డి ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, ఆయన నాకు పాత మిత్రుడు. మేము తప్పకుండా కలుసుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటామన్నారు. అల్లుఅర్జున్ విషయంలో చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
ప్రతిపక్షాలకు కౌంటర్:
చిత్రసీమ చరిత్ర తెలియని వ్యక్తులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బాధ్యతగల పదవిలో ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi sanjay) లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం గురించి బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)కి తెలుసా అని ప్రశ్నించారు. మద్రాస్ లో ఉన్న సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కు రప్పించిందే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అని చెప్పారు. ఇవేవి తెలియకుండా జరిగిన సంఘటన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రోత్సహించిందో ప్రజలకు, సినిమా ప్రేక్షకులకు తెలుసన్నారు. పుష్ప-2 సినిమాకు కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్నారు. రాజకీయాలు మాట్లాడుతున్న వారి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు.
Read More..
Congress: అల్లు అర్జున్ మామను కలిసేందుకు ఇష్టపడని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్