దళితులే టీఆర్ఎస్‌ను బొందపెడతారు : వివేక్
దిశ, హుజురాబాద్ రూరల్ : దళితులపై సీఎం కేసీఆర్.. కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. మంగళవారం మధువని గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక దళితులను మోసం చేశాడని అన్నారు. కొడుకు కేటీఆర్‌ను సీఎంను చేయాలనే కుట్రలో భాగంగా ఈటల రాజేందర్‌పై తప్పుడు అభియోగం మోపి టీఆర్ఎస్ నుంచి […]
దిశ, హుజురాబాద్ రూరల్ : దళితులపై సీఎం కేసీఆర్.. కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. మంగళవారం మధువని గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక దళితులను మోసం చేశాడని అన్నారు. కొడుకు కేటీఆర్‌ను సీఎంను చేయాలనే కుట్రలో భాగంగా ఈటల రాజేందర్‌పై తప్పుడు అభియోగం మోపి టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.
సీఎం కార్యాలయంలో ఒక్క దళిత అధికారికి కూడా అవకాశం ఇవ్వలేదని ఈటల నిలదీయడంతోనే రాహుల్ బొజ్జాను దళిత బంధు ప్రత్యేక అధికారిగా సీఎంఓలో నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ఒక వ్యక్తితో ఎన్నికల కమిషన్‌కి లేఖ రాయించి దళిత బంధు నిలిపివేసేందుకు కుట్ర చేసి దళితులను మరోసారి మోసం చేశారని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా దళితుల ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపి.. ఆ నెపాన్ని బీజేపీపై మోపేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. దళిత బంధు పథకం అమలు చేయాలనే చిత్త శుద్ధి ఉన్నట్లయితే ఇప్పటివరకే దళితులకు యూనిట్లు అందజేసేవారని అన్నారు.
దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించగానే మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించి 60 రోజులు గడిచినా లబ్ధిదారులకు యూనిట్లు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. దళిత కాలనీలో ప్రచారానికి వెళ్తే బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, భవిష్యత్తులో దళితులే టీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యే రమేష్, తదితరులు పాల్గొన్నారు.