ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్ రెడీ?

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లను ఎలాగైనా నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నది. ఐపీఎల్ రద్దయితే రూ. 2500 కోట్ల వరకు నష్టం వస్తుందని ఇటీవలే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఎలాగైనా ఈ సీజన్ పూర్తి చేసి నష్టాల నుంచి తప్పించుకోవాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. సీజన్ రద్దయితే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుందని.. అది వచ్చే ఏడాది నిర్వహించనున్న మెగా ఆక్షన్‌పై ప్రభావం చూపే అవకాశాలు […]

Update: 2021-05-09 08:34 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లను ఎలాగైనా నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నది. ఐపీఎల్ రద్దయితే రూ. 2500 కోట్ల వరకు నష్టం వస్తుందని ఇటీవలే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఎలాగైనా ఈ సీజన్ పూర్తి చేసి నష్టాల నుంచి తప్పించుకోవాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. సీజన్ రద్దయితే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుందని.. అది వచ్చే ఏడాది నిర్వహించనున్న మెగా ఆక్షన్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో బీసీసీఐ మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకే మొగ్గు చూపుతున్నాయి. కాగా, ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తామంటూ ఇప్పటికే పలు దేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ యూఏఈ నిర్వహించే ఉద్దేశం ఉన్నందున.. ఇంగ్లాండ్‌లో అయితే మెగా లీగ్ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని నాలుగు కౌంటీలు తాము ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తామని ముందుకు వచ్చాయి. ఈసీబీకి ఇప్పటికే లేఖ కూడా రాశాయి. దీంతో ఈసీబీ, బీసీసీఐ ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.

ఇంగ్లాండ్ బెస్ట్ చాయిస్..

డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీస్ కోసం టీమ్ ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్ చేరుకోనున్నది. సెప్టెంబర్ 14తో ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసే వరకు టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లోనే ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత అక్కడే ఐపీఎల్ కొనసాగిస్తే బాగుంటుందని బీసీసీఐ భావిస్తున్నది. ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ఇంగ్లాండ్ రావడానికి అభ్యంతర పెట్టరని.. అక్కడ 10 రోజుల క్వారంటైన్ ఉన్న తర్వాత ప్రభుత్వ ఆంక్షలు కూడా పెద్దగా ఉండవని ఈసీబీ చెబుతున్నది. ఇప్పటికే కౌంటీలు కూడా ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తి చూపిస్తుండటంతో ఇంగ్లాండ్ మంచి చాయిస్ అని భావిస్తున్నారు. యూఏఈ కంటే ఇంగ్లాండ్‌లో మరిన్ని అంతర్జాతీయ స్టేడియంలు అందుబాటులో ఉండటం.. స్టార్ హోటల్స్ కూడా మైదానాలకు దగ్గరగా ఉండటం కలసి వచ్చే అంశం. కెవిన్ పీటర్సన్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ నిర్వహించడం ద్వారా ఆ మెగా లీగ్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. ఐపీఎల్ ప్రసార హక్కుల విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కాబట్టి ఇంగ్లాండ్ కచ్చితంగా మంచి చాయిన్ అని అంటున్నారు.

లాభాల వాటా?

ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ నిర్వహిస్తే లాభాల్లో కొంచెం వాటా ఇస్తామని బీసీసీఐ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తున్నది. బ్రిటన్‌లో స్టేడియంలలోకి ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉన్నందున గేటు ఆదాయం కూడా భారీగానే వచ్చే అవకాశం ఉన్నది. ఇండియన్ స్టేడియంలో పెద్దగా ఉన్నా.. ఇక్కడి టికెట్ల రేటుతో పోల్చుకుంటే ఇంగ్లాండ్‌లో ఎక్కువ ఆదాయం వస్తుంది. మరోవైపు ఐపీఎల్ నిర్వహించకుండా నష్టాల పాలు అయ్యే బదులు.. లాభాల్లో కొంచెం వాటా పంచి ఈ ఏడాదికి గట్టెక్కడమే మంచిదని బీసీసీఐ కూడా బావిస్తున్నట్లు తెలుస్తున్నది. గత సీజన్‌ ఐపీఎల్ నిర్వహించినందుకు గాను ఎమిరెట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ రూ. 100 కోట్ల ఫీజు చెల్లించింది. అయితే ఈసీబీ మాత్రం వాటా కావాలని కోరుతున్నది. ఈ విషయంలోనే బీసీసీఐ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతున్నది. అన్ని అవాంతరాలు ముగిసిపోతే ఇంగ్లాండ్‌లో ఈ ఏడాది ఐపీఎల్ రెండో భాగం చూసే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News