మలేషియా ఓపెన్‌లో గాయత్రి జోడీ శుభారంభం.. లక్ష్యసేన్‌కు షాక్
మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ శుభారంభం చేశారు.
దిశ, స్పోర్ట్స్ : మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో విజయం సాధించిన ఈ జోడీ ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో గాయత్రి జోడీ 21-10, 21-10 తేడాతో థాయిలాండ్‌కు చెందిన జోంగ్‌సతపోర్న్‌పార్న్-సుకిట్టా సువాచాయ్ ద్వయాన్ని చిత్తు చేసింది. భారత షట్లర్లు దూకుడుగా ఆడటంతో మ్యాచ్ కేవలం 30 నిమిషాల్లోనే ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ చైనాకు చెందిన జాంగ్ షుక్సియాన్-జియా ఇఫాన్ జంటతో తలపడనుంది.
మరోవైపు, మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్‌కు షాక్ తగిలింది. తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారిపట్టాడు. చైనీస్ తైపీ ఆటగాడు చెన్ యు జెన్ 21-14, 21-7 తేడాతో సేన్‌ను ఓడించాడు. తొలి గేమ్‌లో కాస్త పోరాడిన లక్ష్యసేన్..రెండో గేమ్‌లో పూర్తి తేలిపోయాడు. ఇక, మరో భారత స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్, బ్రియాన్ యాంగ్(కెనడా) మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. కోర్టులో వాటర్ లీకేజ్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఆ మ్యాచ్‌ను బుధవారం నిర్వహించనున్నారు. అలాగే, భారత పురుషుల డబుల్స్ స్టార్ జంట సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం సహా సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ, ప్రియాన్షు రజావత్, ఆకర్షి కశ్యప్ నేడు తొలి రౌండ్ ఆడనున్నారు.