Rishabh Pant : టాప్-10లోకి రిషబ్ పంత్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లాడు. గత కొన్ని వారాలుగా పంత్ ర్యాంక్ డౌన్ కాగా.. ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌లో 33 బంతుల్లో 61 పరుగులు చేసి రాణించడంతో ర్యాంక్ మెరుగైంది. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 40 పరుగులు చేశాడు. దీంతో మూడు ర్యాంకులు మెరుగు పర్చుకున్నాడు. 739 రేటింగ్ పాయింట్స్‌తో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 847 పాయింట్లతో యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో నిలిచాడు. జోరూట్ 895 పాయింట్లతో టెస్ట్ బ్యాట్స్ మెన్ల జాబితాలో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలర్లలో నెం.1 బుమ్రా
టెస్ట్ బౌలర్ల జాబితాలో 908 పాయింట్లతో బుమ్రా నెంబర్.1 స్థానంలో నిలిచాడు. 841 పాయింట్లతో రెండో స్థానంలో ప్యాట్ కమ్మిన్స్ నిలిచాడు. సిడ్నీ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ స్కాట్ బోలాండ్ 29 స్థానాలు ఎగబాకి బౌలర్ల జాబితాలో టాప్-10లో చోటు సంపాదించాడు. బోలాండ్ తాజా ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా సైతం 745 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.