Mumbai Indians : ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు మేనేజ్‌మెంట్ వార్నింగ్
ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు మంగళవారం వివరాలు వెల్లడించాయి. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్ధిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంతో జట్టులో వివాదాలు తలెత్తినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాల కారణంగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రోహిత్‌కు మద్ధతుగా కొందరు.. పాండ్యాకు సపోర్ట్‌గా మరికొందరు ఆటగాళ్లు విడిపోయినట్లు విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జట్టు ఓనర్ ప్రధాన ఆటగాళ్లతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ‘హార్ధిక్ పాండ్యా కెప్టెన్ సామర్థ్యాలను తక్కువ చేసి చూడొద్దు. ముంబైలాంటి హై ప్రొఫైల్ ఫ్రాంచైజీలో ఇలాంటి ఘటనలు దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయి. పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలకు న్యాయం చేయలేని పక్షంలో ఏం చేయాలనే విషయంపై ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంటుంది.’ అని బీసీసీఐ వర్గాలు క్రిక్ బ్లాగర్‌కు తెలిపాయి.