ఉద్యోగ సంఘాల నేతలకు ‘పదవి’ గండం
దిశ, న్యూస్ బ్యూరో: పదవీ విరమణ వయస్సు పెంపుపై ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. గతంలో ప్రభుత్వాలను పిడికిలి బిగించి శాసించిన, రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి. సంఘాల నేతలు స్వార్థ ప్రయోజనాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేతలు వారి బంధువర్గానికి సర్వీసును పొడిగించుకోవడం, ఉద్యోగ సంఘాల సిఫారసు లేఖలను వాడుకోవడం, ఉద్యోగుల ప్రతినిధిగా చెప్పుకునే మంత్రి పైరవీలు చేయడంపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. దీన్ని గమనించిన ఉద్యోగ సంఘాల నేతలు […]
దిశ, న్యూస్ బ్యూరో: పదవీ విరమణ వయస్సు పెంపుపై ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. గతంలో ప్రభుత్వాలను పిడికిలి బిగించి శాసించిన, రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి. సంఘాల నేతలు స్వార్థ ప్రయోజనాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేతలు వారి బంధువర్గానికి సర్వీసును పొడిగించుకోవడం, ఉద్యోగ సంఘాల సిఫారసు లేఖలను వాడుకోవడం, ఉద్యోగుల ప్రతినిధిగా చెప్పుకునే మంత్రి పైరవీలు చేయడంపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. దీన్ని గమనించిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎంత మొత్తుకున్నా చిన్న, చిన్న సమస్యలు పరిష్కరించకపోవడం, ఇచ్చిన హామీలపై మళ్లీ మాట్లాడకపోవడంతో కిందిస్థాయి నుంచి వచ్చే విమర్శలు, వ్యతిరేకతలను తట్టుకోవడం వారికి తలనొప్పిగా తయారైంది. జేఏసీ నేతల్లో ఒకరి రిటైర్మెంట్ మరో రెండు నెలల్లో ఉన్న నేపథ్యంలో పదవీ విరమణ పెంపుపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సడెన్‌గా పదవీ విరమణ వయస్సును పెంచితే సదరు నేత కోసమే పెంచారా అనే ప్రచారం జరుగుతుందనే అనుమానమూ లేకపోలేదు. 61 ఏండ్లకు పెంచుతూ జీవో వస్తుందా లేదా అనేది కూడా అనుమానంగా మారింది. పదవీ విరమణ వయస్సు పెంచకుంటే కేవలం ఎక్స్‌టెన్సన్ తెచ్చుకుందామంటే సర్వీసు పొడిగింపుతో ఉద్యోగ సంఘం కుర్చీలో కూర్చునే అవకాశం లేదు. తెలంగాణ ఉద్యమం నుంచి ముందుండి నడిచినందుకు ఇప్పుడు ఏదైనా కార్పొరేషన్, ఇతర పదవి తీసుకుందామా అనే ఆలోచనలున్నా ఇప్పటికే స్వామిగౌడ్, దేవీ ప్రసాద్‌తో పాటు ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ వంటి వారు పడుతున్న కష్టాలు చూస్తే అలాంటి సాహసం చేసేందుకు ఆ నేతకు ధైర్యం చాలడం లేదు. ఈ పరిణామాలన్నీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
జీతం కూడా సగమే
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్యోగ సంఘాల నేతలది కూడా ముందు నుయ్యి.. వెనక గొయ్యి అనే చందంగా మారింది. పీఆర్సీ గురించిన మాటే మర్చిపోయారు. ఐఆర్ అనే పదమే సోదిలో లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితులు, కరోనా సాకుతో జీతాలు ఇవ్వడమే చాలు అన్నట్టుగా మారింది. ప్రస్తుతం ఇస్తున్నదీ సగం వేతనాలే. పక్క రాష్ట్రం పూర్తి వేతనాలు ఇచ్చినా మన దగ్గర మాత్రం సగంతోనే సరి పెడుతున్నారు. పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ప్రభుత్వాలతో కొట్లాడిన చరిత్ర
ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలతో ఎదురేగి కొట్లాడిన సందర్భాలున్నాయి. చరిత్ర పుటల్లో ఉద్యోగ సంఘాలకు ప్రత్యేక పేజీలున్నాయి. ఎన్టీ రామారావు రెండోసారి అధికారం కోల్పోయేందుకు ప్రధాన కారణం ఉద్యోగులతో వైరమేనని ఎన్నోసందర్భాల్లో స్పష్టమైంది. అంతకు ముందు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 55 ఏండ్లు చేసేందుకు ఎన్టీఆర్ ప్రభుత్వం 1983లో నిర్ణయం తీసుకుంది. దాదాపు నెలకు పైగా సమ్మె చేశారు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు జరిపి నిర్ణయాలను మార్చింది. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఉద్యోగులు లంచావతారులు, పని చేయరు అంటూ విమర్శలు చేయడంతో 1986లో సైతం 55 రోజులు సమ్మెకు దిగారు. అప్పుడు కూడా పలు బెనిఫిట్స్ తగ్గించడంతో ఎన్టీఆర్ ప్రభుత్వంతో ఉద్యోగులు యుద్ధానికే దిగారు. మళ్లీ హైకోర్టు జోక్యంతో చివరకు ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగులతో చర్చించింది. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి పదవీచ్యుతుడయ్యేందుకు ఉద్యోగులతో సయోధ్య లేకపోవడం కూడా కారణమని అప్పటి ప్రభుత్వమే చెప్పింది. ఆ తర్వాత 2004కు ముందు చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించిన ఘనత ఉద్యోగ సంఘాలది. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్ర పోనీయను అంటూ అర్ధరాత్రి వరకు సమీక్షలు, కిందిస్థాయి ఉద్యోగుల వరకు వేధింపులతో ఉద్యోగులంతా ఒక్కటై చంద్రబాబును గద్దె దింపిన చరిత్ర కూడా ఉంది.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి..
తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి స్నేహ పూర్వకంగానే కొనసాగింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు హామీలిచ్చినా నెరవేర్చడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆర్టీసీతో పాటు రెవెన్యూ ఉద్యోగుల అంశాల్లో ఉద్యోగ సంఘాలు కొంత అపవాదు మూటగట్టుకున్నాయి. ఇలాంటి సమయాల్లో ఉద్యోగ సంఘాల పాత్ర చాలా కీలకం. కానీ, కారణాలేమైనా ఉద్యోగ సంఘాలు మాత్రం ఈసారి నిస్సహాయ స్థితిలోనే ఉన్నాయి. పదవీ విరమణ వయస్సు పెంపు అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. గతంలో ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఉద్యమించేవారని, ఇప్పుడు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారని, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం సాధించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీజీవో అధ్యక్షురాలు మమత భర్తకు రెండేండ్లు సర్వీసు పొడిగింపుతో నేతలపై విమర్శలు తారస్థాయికి చేరాయి. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. సర్వీసు పొడిగింపునకు టీజీవో లేఖ పెట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఉద్యోగుల మంత్రిగా చెప్పుకునే మంత్రిపై అసంతృప్తి మొదలైంది. ఉద్యోగుల అంశాలను పట్టించుకోకుండా కేవలం నేతల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు. మమత భర్త సర్వీసు పొడిగింపులో సదరు మంత్రి కీలకపాత్ర పోషించారనే ప్రచారం జరుగుతోంది.
నేతలకు ప్రాధాన్యం కరువు
ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలకు ప్రాధాన్యం లేదని తేటతెల్లమైంది. స్వామిగౌడ్‌కు ప్రాధాన్యత పోయింది. దాదాపు ఏడాదిగా దేవీ ప్రసాద్ ఏ పోస్టు లేక ఖాళీగా ఉంటున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రెన్యూవల్ చేస్తారని లేకుంటే ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా… ప్రచారానికే పరిమితమవుతున్నాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి ఓటమిపాలైన చంద్రశేఖర్ గౌడ్‌కు ఇప్పటిదాకా నిరాశే ఎదురైంది. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విన్నవించుకున్నా విన్నపాలకే పరిమితమయ్యాయి. ఏడాది దాటినా అడుగు ముందుకు పడలేదు. హామీలకే పరిమితమయ్యాయి. ఈ సమయంలో మరో జేఏసీ నేత కూడా పదవీ విరమణకు దగ్గరవుతున్నారు. ఈ సమయంలో 61 ఏండ్లకు పెంచుతారా అనేది అయోమయంగా మారింది. అయితే ఈ నెలాఖరు వరకు పదవీ విరమణపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.