ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలను పట్టించుకోరా?

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రగతిభవన్ సమావేశం చిచ్చు పెట్టింది. ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న పలు యూనియన్లు ఒక్కసారిగా ఆరోపణలకు దిగుతున్నాయి. ఉద్యోగ సంఘాలంటే కేవలం టీఎన్జీఓ, టీజీఓ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో అనుకూలంగా ఉండే యూనియన్ల నేతలను పట్టుకుని ప్రగతిభవన్‌కు వెళ్లారని, అక్కడ ఏం సాధించారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా టీఎన్జీఓ, టీజీఓ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇంకెన్నాళ్లు ఈ మమతానురాగం” […]

Update: 2021-01-01 22:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రగతిభవన్ సమావేశం చిచ్చు పెట్టింది. ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న పలు యూనియన్లు ఒక్కసారిగా ఆరోపణలకు దిగుతున్నాయి. ఉద్యోగ సంఘాలంటే కేవలం టీఎన్జీఓ, టీజీఓ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో అనుకూలంగా ఉండే యూనియన్ల నేతలను పట్టుకుని ప్రగతిభవన్‌కు వెళ్లారని, అక్కడ ఏం సాధించారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా టీఎన్జీఓ, టీజీఓ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇంకెన్నాళ్లు ఈ మమతానురాగం” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల బంధువర్గానికి గతంలో సర్వీసు పొడిగింపు అంశాలను ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారు. టీజీఓ అధ్యక్షురాలు మమత భర్తకు రెండేండ్లు సర్వీసు పొడిగింపు అంశాన్ని చూపిస్తున్నారు. ఇలా ఉద్యోగ నేతలు ప్రభుత్వానికి తొత్తుగా ఉండటంతో తప్పు లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంఘాలు ఏమయ్యాయి?

తెలంగాణ ఉద్యోగ జేఏసీలో దాదాపు120 సంఘాలు భాగస్వామ్యంగా ఉన్నాయి. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ జేఏసీగానే సమావేశమయ్యారని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత జేఏసీలన్నీ ఎత్తివేసినట్లే చేశారు. కానీ ఉద్యోగుల జేఏసీ మాత్రమే అనధికారికంగానే కొనసాగుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సందర్భాల్లో మాత్రం ఉద్యోగ జేఏసీగా ప్రకటనలు చేసుకుంటున్నారని, కానీ పీఆర్సీ వంటి అంశాలపై మాత్రం ఉద్యోగ సంఘాలుగానే వెళ్లి వస్తున్నాయనే విమర్శలున్నాయి. తాజా సమావేశంలో జేఏసీ ప్రతినిధులుగా వెళ్లడం, కేవలం ఐదు సంఘాలనే పరిమితం చేశారు. దీనిలో ఉపాధ్యాయ సంఘాలకు అసలే ఆహ్వానం లేదు. పెన్షనర్లు, ఇంటర్ విద్య జేఏసీ, కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వంటి వాటికి ప్రాధాన్యత లేదు. దీంతో కొన్ని సందర్భాల్లోనే గుర్తుకు వచ్చే పలు సంఘాలు సీఎంతో భేటీ సమయంలో ఎందుకు గుర్తుకు రావడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగ జేఏసీ వైఖరి చాలా అనుమానాలకు తావిచ్చింది. 52 రోజులు సమ్మె చేసినా.. ఉద్యోగ జేఏసీ ఎలాంటి సహకారం చేయలేదు. ముందుగా ఉద్యోగ జేఏసీలో ఆర్టీసీ జేఏసీ భాగస్వామ్యంగానే వ్యవహరించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ జేఏసీకి దూరంగానే వ్యవహరిస్తున్నారు.

డైరీ కోసమే అయితే ఇంత షో ఎందుకు?

ఉద్యోగ సంఘాల సమావేశం తర్వాత జేఏసీ నేతల వ్యాఖ్యలతో ఉద్యోగవర్గాల్లోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని అంశాలు చర్చించామని జేఏసీ అధ్యక్షుడు రాజేందర్ ​చెబితే.. అలాంటి చర్చే జరగలేదని సెక్రెటరీ జనరల్ ​మమత పేర్కొన్నారు. దీంతో అసలు ప్రగతిభవన్‌లో ఏం జరిగిందనేది ఉద్యోగుల్లో ఆసక్తిగా మారింది. కేవలం ఉద్యోగ సంఘాల నేతలు డైరీ ఆవిష్కరణ, సీఎంతో మధ్యాహ్న భోజనం కోసమే వెళ్లారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మమత ఈ వ్యాఖ్యలు చెబుతున్న నేపథ్యంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు వారించే ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే పీఆర్సీపై ఎలాంటి చర్చ జరగలేదంటూ మమత ప్రకటించారు. “ సీఎం కేసీఆర్​ టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ ఉద్యోగుల డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ కమిషన్​ రిపోర్టును తీసుకుని జనవరి రెండో వారం వరకు ఫైనల్​ చేయాలని ఆదేశించారు. మిగిలిన బదిలీలు, పదోన్నతుల తర్వాత భర్తీ చేయాల్సిన ఖాళీలను టీఎస్‌పీఎస్సీ, ఇతర ఏజెన్సీల ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. ‘‘గురువారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీగానీ, అటువంటి అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలను పిలువలేదు. కేవలం టీఎన్జీఓ, టీజీఓ డైరీ ఆవిష్కరణ కోసం మాత్రమే పిలిచారు.” అని మమత ప్రకటించారు. దీంతో ఉద్యో గ సంఘాల నేతలు ఇంకా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. డైరీ ఆవిష్కరణ కోసం వెళ్తే ఇంత ప్రచారం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.

వ్యతిరేకత వస్తుందనే..

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సమావేశంపై ముందు నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఐదు సంఘాలనే ప్రగతిభవన్‌కు ఆహ్వానించారు. వాస్తవంగా జేఏసీ పేరుతోనే సీఎంను కలిశారు. కానీ జేఏసీలో మొత్తం 120కిపైగా ఉద్యోగ సంఘాలు భాగస్వాములుగా ఉండగా… ప్రధానంగా కనిపించే టీఎన్జీఓ, టీజీఓలకే ఆహ్వానం అందించారు. కానీ ఇతర బలమైన సంఘాలుగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల సంఘం, ఇంటర్ విద్య జేఏసీ, వీఆర్వోల అసోసియేషన్, గ్రూపు‌‌–1 అధికారుల సంఘంతో పాటు మరెలాంటి సంఘాలను పిలువలేదు. అటు టీజీఓలో కూడా అంతే. మరోవైపు అసలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కొన్ని జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్నా.. ఆ సంఘాలకు పిలుపే రాలేదు. దీంతో ఉపాధ్యాయులంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీలోని ఇతర సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత పెరుగుతుందనే భయం జేఏసీ నేతల్లో కూడా ఉంది. అందుకే ఉపాధ్యాయులను మళ్లీ పిలుస్తారని, పీఆర్సీ చర్చ లేదంటూ జేఏసీ సెక్రెటరీ జనరల్ దాటవేసేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై ఉద్యోగవర్గాలు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నాయి. ఇప్పటికే పీఆర్సీ అంశంలో చాలా ఆలస్యం జరుగుతోందని, తీపి కబురు విని వినీ షుగర్ జబ్బులు వస్తున్నాయని, ఉద్యోగులను మోసం చేసే కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంఘాలను పిలిపించుకుని భోజనానికి కూర్చుండబెట్టుకుని సమావేశం చేశారంటూ చెప్పుకోవడంపై విస్తృతంగా ట్రోల్​చేస్తున్నారు.

Tags:    

Similar News