క్రాంతి ప్రదాతలు ఉపాధ్యాయులు

world teachers day significance and importance

Update: 2023-10-04 23:45 GMT

ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా అన్నారు. ఈ శక్తివంతమైన ఆయుధాన్ని ప్రజలకు అందించేవారు, మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రాంతి ప్రదాతలు ఉపాధ్యాయులు. అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు విశిష్ట స్థానం ఉంది. మన దేశంలో సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మాత్రం అక్టోబర్ 5న జరుపుకుంటారు.

ఉపాధ్యాయుల హక్కులు బాధ్యతలు, విద్య, నియామకం, ఉపాధి బోధనాభ్యసనాలకు సంబంధించి నిర్దేశించే ఉపాధ్యాయుల ప్రమాణాలను 1966లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్),ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ (EI) సిఫార్సులను పారిస్‌లో ఆమోదించారు. దీన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని1994 నుండి జరుపుకుంటున్నారు.

ఉపాధ్యాయుల కొరత అధిగమించాలి!

మనకు విద్యకు అందించేందుకు ఉపాధ్యాయులు కావాలి, ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం ప్రపంచ ఆవశ్యకత అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి 2030 యునెస్కో ఎజెండాలోని విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి సుశిక్షితులైన ఉపాధ్యాయులు అవసరం. ప్రపంచవ్యాప్తంగా 69 మిలియన్ల ఉపాధ్యాయుల కొరత ఉంది. మానవాళి గ్లోబల్ టీచర్ల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. మనదేశంలో 26.5 కోట్ల మంది విద్యార్థులు,14.9 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందింది.

మన దేశ విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో సఫలీకృతం కాలేకపోయాం. భారతదేశంలో ఉపాధ్యాయులకు అత్యధిక డిమాండ్ ఉంది. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రాథమిక విద్యలో 100% స్థూల నమోదుని(ఎన్రోల్మెంట్) లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఎక్కువ మంది ఉపాధ్యాయుల అవసరం ఉంది. ఆర్థిక సర్వే 2023 ప్రకారం విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని స్థాయిలలో స్థిరంగా పెరుగుతోంది. ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో దాదాపు 1.1 లక్షల ఏక ఉపాధ్యాయ పాఠశాలల్లో మొత్తం 19% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 69% వరకు ఉంది. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత ఏ విధంగా ఉందో ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతుంది.

టీచర్లలో సామాజిక సృహ తగ్గింది!

జ్ఞానంపై పెట్టుబడి ఉత్తమ వడ్డీని చెల్లిస్తుంది అంటాడు బెంజిమెన్ ఫ్రాంక్లిన్. అందుకే 21వ శతాబ్దంలో భారతీయ యువత ప్రపంచంతో పోటీ పడాలని, వారికి నాణ్యమైన విద్యను అందించాలని, వారిలో సృజనాత్మకతను పెంచాలని భారత ప్రభుత్వం ఎన్‌ఈపీ-2020 ను తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం ఆరు శాతం నిధులను కేటాయించాలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.9% నిధులు మాత్రమే కేటాయించింది. ప్రపంచంలో నాణ్యమైన విద్య కోసం ఇతర దేశాలు వాటి బడ్జెట్లో 6 % కన్నా ఎక్కువ నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.

అలాగే నాడు ఉపాధ్యాయులు ప్రజలతో మమేకం అయ్యేవారు. వారి కష్ట సుఖాల్లో భాగస్వాములై, అనేక సామాజిక ఉద్యమాలకు రూపకర్తలుగా మారారు. సామాజిక సమస్యలపై ముందుండేవారు. అందుకే ప్రజల్లో ఉపాధ్యాయులను గొప్ప వ్యక్తులుగా చూసేవారు. ఆనాడు రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో నాటి తరం ఉపాధ్యాయులు ఉండేవారు. నాటితో పోల్చుకుంటే నేటితరం ఉపాధ్యాయుల్లో సామాజిక స్పృహ తగ్గింది. ప్రజా ఉద్యమాల్లో వీరి భాగస్వామ్యం తగ్గింది. ప్రగతిశీల చైతన్యపూరిత భావజాలంకు బదులుగా కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, స్వచింతన విద్యా రంగంతో పాటు ఉపాధ్యాయుల్లో నెలకొన్నాయి. గతంతో పోలిస్తే నేటితరం ఉపాధ్యాయులపై ప్రజల్లో ప్రేమ అభిమానాలు, గౌరవం తగ్గాయి.

ప్రతి మనిషికి రెండు రకాలైన విద్య అవసరం ఒకటి ఎలా జీవించాలో నేర్పేది, మరొకటి జీవనోపాధి కల్పించేది. నాటి తరంలో ఇవి కనిపించేవి. నేటి తరంలో ఎక్కువగా జీవనోపాధి కల్పించడమే విద్య లక్ష్యంగా కనిపిస్తుంది. నేటి యువత ప్యాకేజీల(అత్యధిక వేతనాలు) మాయలో పడి నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. దీర్ఘకాలికంగా ఇది సమాజానికి చేటు చేస్తుంది. ఆరోగ్యవంతమైన, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం. భవిష్యత్ తరాలకు అవసరమయ్యే నూతన ఆవిష్కరణలు చేయడంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం చాలా ముఖ్యమైంది. అభివృద్ధి, ఆధునికీకరణలో భాగంగా మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో సూత్రధారులు ఉపాధ్యాయులు. పర్యావరణం పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిని పర్యావరణ రక్షకులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. దేశ ప్రజల్లో లౌకిక తత్వం, స్వేచ్చా సమానత్వం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా చేయడంలో గురువులే కీలకం. ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరి బాధ్యత. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శం కావాలి.

(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం)

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Tags:    

Similar News