ఉద్యోగులు.. వివిధ రకాల సెలవులు

Government Employees.. various types of leaves

Update: 2024-10-05 01:30 GMT

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రూపొందించిన సెలవు నిబంధనలే కొద్దిపాటి మార్పులు సవరణలతో ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు 1933గా అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనల్లో మూడు రకాల సెలవు నిబంధనలు మాత్రమే.. పేర్కొన్నారు. అవి సంపాదిత సెలవు, అర్ధ జీతం సెలవు, జీత నష్టపు సెలవులు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించే సెలవుల గురించి ప్రాథమిక నిబంధనలో పొందుపరిచారు. ఈ ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవే సెలవులు కనుక ఉద్యోగులకు అనుమతించిన వివిధ రకాల సెలవుల గురించి తెలుసుకుందాం.

ఆకస్మిక సెలవు: ప్రతి ఉద్యోగి దీన్ని ఒక సంవత్సరంలో 15 రోజులు వినియోగించుకోవచ్చు. ఆదివారాలు ఇతర సెలవు దినాలతో కలుపుకొని 10 రోజులకు మించకుండా తీసుకోవచ్చని అనుమతించారు.

ఐచ్ఛిక సెలవులు: ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి ఐదు రోజులు ఐచ్ఛిక సెలవులు లభిస్తాయి. ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మిక, ఐచ్చిక సెలవులు ఆ సంవత్సరంలోనే వినియోగించుకోవాలి. ఐచ్ఛిక సెలవు మరుసటి సంవత్సరానికి నిల్వ ఉండదు.

ప్రత్యేక ఆకస్మిక సెలవులు: వెకేషన్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం 7 రోజుల వరకు వీటిని అనుమతిస్తారు. ఉద్యోగులైన స్త్రీలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు 14 రోజులు, గర్భవిచ్ఛిత్తి,(MTP)కి 14 రోజులు, రీకానలైజేషన్ కోసం గరిష్టంగా 21 రోజులు, అలాగే గర్భనిరోధక సాధనం లూప్ అమర్చుకున్న, తీసివేసిన రోజు మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా ఒకరోజు మంజూరు చేస్తారు. ఉద్యోగులకు వేసక్టమీకి ఆరు రోజులు, భార్య ట్యూబెక్టమీ చేయించుకున్న సందర్భంలో ఏడు రోజులు అనుమతిస్తారు. పై సెలవులన్నీ ఇద్దరి కంటే తక్కువ సంతానం కలిగి ఉన్న పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తాయి. రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు ప్రత్యేక సెలవు ఇవ్వబడుతుంది.

అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో ఎన్నికై పాల్గొనడానికి 30 రోజులు, ప్రభుత్వ గుర్తింపు కలిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన వివిధ శాఖల ఆఫీస్ బేరర్స్‌కు సంఘ కార్యకలాపాలకు హాజరయ్యే నిమిత్తం 21 రోజుల వరకు అనుమతిస్తారు.

సంపాదిత సెలవు: నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ పర్మినెంట్ ఉద్యోగులకు ఒక సంవత్సరంలో 30 రోజులకు మించకుండా జనవరి ఒకటిన 15 రోజులు, జులై 1న 15 రోజులు వారి ఖాతాకు జమ చేస్తారు. వెకేషన్ డిపార్ట్మెంట్ పర్మినెంట్ ఉద్యోగులకు సంవత్సరంలో ఆరు రోజులు అనగా జనవరి 1న 3 రోజులు, జూలై 1న 3 రోజులు అడ్వాన్స్‌గా జమ చేయబడతాయి. ఈ సెలవును గరిష్టంగా 300 రోజుల వరకు ఖాతాలో నిలువ ఉంచుకోవచ్చు. ఈ సెలవును 120 రోజులకు మించకుండా ఒకేసారి వాడుకోరాదు. ఉద్యోగి జీత నష్టపు సెలవులో ఉన్నట్లయితే సదరు కాలానికి సంపాదిత సెలవు జమ చేయరు.

పర్మినెంట్ కానీ ఉద్యోగులకు సంవత్సరానికి 15 రోజులు అట్లే వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి మూడు రోజుల చొప్పున మాత్రమే సెలవు ఖాతాలో జమ చేయవలసి ఉంటుంది. పర్మినెంట్ అయిన తర్వాత సంపాదిత సెలవును రీకాస్ట్ చేసి అర్హత ప్రకారం జమ చేస్తారు. ఈ సంపాదిత సెలవునే ప్రతి ఉద్యోగి ఒక సంవత్సరంలో 15 రోజులు కానీ, రెండు సంవత్సరాల విరామంతో 30 రోజుల వరకు సరెండర్ చేసి వాటికి సరిపడు జీతభత్యాలను పొందవచ్చు. అలాగే 300 రోజుల గరిష్ట పరిమితికి లోబడి ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో నగదుగా మార్చుకోవచ్చు. ఉద్యోగి సర్వీసులో ఉండి మరణిస్తే గరిష్టంగా 300 రోజులు నగదుగా మార్చుకునే సదుపాయం ఉంది.

అర్ధ జీతపు సెలవు: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి సంవత్సర కాల సర్వీసుకు 20 రోజులు చొప్పున అర్ధ జీతపు సెలవు లభిస్తుంది. ఉద్యోగి జీతం నష్టపు సెలవుల్లో ఉన్నా ఈ సెలవును జమ చేస్తారు. సెలవు ఖాతాకు గరిష్ట పరిమితి లేదు. ఈ సెలవును వ్యక్తిగత కారణాలపై లేదా వైద్య కారణాలపై వినియోగించుకోవచ్చు. వైద్య కారణాలపై ఈ సెలవును వినియోగించుకుంటే కమ్ముటేడ్ సెలవు అంటారు. ఈ సెలవును సర్వీస్ మొత్తంలో ఉద్యోగి 240 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. అర్ద జీతపు సెలవుపై జీతభత్యాలు అలవెన్సులు సగం మాత్రమే లభిస్తాయి. వైద్య కారణాలపై తీసుకున్న సెలవుపై పూర్తి జీతభత్యాలు పొందవచ్చు.

లీవ్ నాట్ డ్యూ: సంపాదిత సెలవు కానీ, అర్థజీతపు సెలవు కానీ ఉద్యోగి లేనప్పుడు ఈ లీవ్‌ను మంజూరు చేసే అధికారి ఉద్యోగి మొత్తం సర్వీసులో 6 నెలలకు మించకుండా కొన్ని పరిమితులకు లోబడి లీవ్ నాట్ డ్యూ మంజూరు చేయవచ్చు. ఈ సెలవును భవిష్యత్తులో సంపాదిం చే అర్ధ జీతపు సెలవు నుంచి తీసివేస్తారు. ఇది మెడికల్ సర్టిఫికెట్ పైనే మంజూరు చేస్తారు.

ప్రసూతి సెలవు: ప్రతి మహిళా ఉద్యోగికి 180 రోజులు, అట్లే అబార్షన్ కోసం ఆరు వారాల సెలవును మంజూరు చేస్తారు. ఈ సెలవు కాలంలో పూర్తి జీతభత్యాలు చెల్లిస్తారు. ఈ ప్రసూతి సెలవుకు ఇద్దరి కంటే తక్కువ పిల్లలు ఉన్న వారే అర్హులు. ఇట్టి సెలవును మెడికల్ సర్టిఫికెట్‌పై మాత్రమే మంజూరు చేస్తారు.

పితృత్వ సెలవు: భార్య ప్రసవిస్తే భర్తకు 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేయవచ్చు. ఇద్దరు కంటే తక్కువ పిల్లలు కలిగిన వారికి అర్హత ఉంది. ఈ సెలవు 16 - 9 - 2005 నుంచి మాత్రమే అమలులో ఉంది. ఈ సెలవును ప్రసూతి అయిన తేదీ నుంచి మాత్రమే అనుమతిస్తారు.

జీత నష్టపు సెలవు: ఉద్యోగికి ఏ రకమైన సెలవు ఖాతాలో లేనప్పుడు ఈ సెలవును లేదా సెలవు ఉన్నప్పటికీ ఉద్యోగి తాను స్వయంగా ఈ సెలవును మంజూరు చేయమని కోరినప్పుడు అనుమతించవచ్చు. ఈ సెలవు కాలానికి జీతభత్యాలు సాధారణంగా చెల్లించరు. కానీ దీర్ఘకాల వ్యాధులైన టీబీ, కుష్టు, క్యాన్సర్, మానసిక, గుండె, మూత్రపిండాల జబ్బుల చికిత్స నిమిత్తం ఈ సెలవును వినియోగించుకుంటే వారికి ఎక్స్‌గ్రేషియా అలవెన్స్ చెల్లిస్తారు. సాధారణంగా జీత నష్టపు సెలవుకాలం ఇంక్రిమెం ట్ పొందేందుకు, పెన్షన్‌కు పరిగణించబడదు. కానీ ఈ సెలవు వైద్య కారణాలపై తీసుకున్నట్లయితే పరిమితి లేకుండా, అలాగే వ్యక్తిగత కారణాలపై వినియోగించుకున్నట్లయితే మూడేళ్ల వరకు పెన్షన్‌కి లెక్కిస్తారు. వైద్య కారణాలపై ఆరు నెలల జీతం నష్టం సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్‌కు పరిగణించేందుకు శాఖ అధికారి అనుమతించవచ్చు. ఆరు నెలలపై కాలానికి ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది. జీతం నష్టం సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్లకు పరిగణించేందుకు పై అధికారులకు ప్రతిపాదనలు పంపే బాధ్యత లీవు మంజూరు చేసే అధికారి పైనే ఉంటుంది.

ప్రత్యేక డిసేబిలిటీ లీవు : ప్రాథమిక నిబంధనలు 83ను అనుసరించి ఏదేని ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో ప్రమాదం సంభవించి అశక్తుడైన పక్షంలో 24 నెలలకు మించకుండా ఈ సెలవును పరిమితులకు లోబడి మంజూరు చేయవచ్చు. సెలవు మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఈ సెలవులో మొదటి నాలుగు నెలల కాలానికి పూర్తి జీతం తదుపరి కాలానికి సగం జీతం చెల్లిస్తారు. గెజిటెడ్ ఉద్యోగులు, మెడికల్ బోర్డు వారి, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సివిల్ సర్జన్ ధృవీకరించబడిన సర్టిఫికెట్ ఉంటేనే ఈ సెలవును మంజూరు చేస్తారు.

హాస్పిటల్ లీవ్: ప్రాథమిక నిబంధనలు 101బి ప్రకారం పర్మనెంట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఉద్యోగులకు కొన్ని వర్గాల వారికి, క్రింది శ్రేణి వారికి అంటే పోలీస్ కానిస్టేబుల్, జైల్ మెట్రిన్, ఫారెస్ట్ గార్డ్, పశుసంవర్ధక శాఖలో పనిచేసే కొన్ని వర్గాల ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవుకు అర్హత ఉంటుంది. ప్రతి మూడేళ్లకోసారి ఆరు నెలలకు మించకుండా సెలవు అర్హత కలదు. విధి నిర్వహణలో భాగంగా సంక్రమించిన వ్యాధులకు అలాగే విధినిర్వహణలో ప్రమాదం సంభవించిన కారణాలపై ఈ సెలవును మంజూరు చేస్తారు. ఈ సెలవు కాలానికి సగటు జీతం లభిస్తుంది.

స్టడీ లీవ్ : ప్రాథమిక నిబంధన 84 ప్రకారం 5 సంవత్సరాల కనీస సర్వీస్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు పరిమితులకు లోబడి రెండేళ్లకు మించకుండా సర్వీస్ నందు ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. ఈ సెలవు కాలంలో జీతాన్ని ప్రాథమిక నిబంధనలను అనుసరించి కనిష్ట గరిష్ట పరిమితులకు లోబడి పొందవచ్చు.

కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ : ప్రభుత్వ ఉద్యోగి సెలవు దినంలో పని చేసినట్లయితే ఈ సెలవుకు అర్హులు. పర్యవేక్షకుల కంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక సంవత్సరంలో పది రోజులకు మించకుండా వాడుకోవచ్చు. ఉద్యోగి పనిచేసిన దినం నుంచి ఆరు నెలలలోపు ఈ సెలవులు వినియోగించుకోవాలి.

చైల్డ్ కేర్ లీవ్: పిల్లల సంరక్షణ చూసుకోవడానికి 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను ప్రభుత్వం జీవో 209 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ 21 -11 -2016 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్టి సెలవును ఇద్దరు పిల్లల సంరక్షణ సందర్భంలో ఒకే దఫా 15 రోజులకు మించకుండా తీసుకోవచ్చును. పిల్లలు 18 సంవత్సరాల వయసు వచ్చు వరకు, అందవైకల్యం ఉన్న పిల్లల విషయంలో వారికి 22 సంవత్సరాల లోపల ఇట్టి సెలవును వినియోగించుకోవచ్చు.

సి. మనోహర్ రావు,

రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి,

96406 75288

Tags:    

Similar News