ఈ పోరులో అవమానమెవరికి!?

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ కేటీఆర్‌ని టార్గెట్ చేస్తూ సినీనటి గురించి చేసిన వ్యాఖ్యలు పేర్కొనడానికి కూడా వీలులేనంత

Update: 2024-10-05 01:00 GMT

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ కేటీఆర్‌ని టార్గెట్ చేస్తూ సినీనటి గురించి చేసిన వ్యాఖ్యలు పేర్కొనడానికి కూడా వీలులేనంత జుగుప్సాకరంగా ఉన్నాయి. దీనిపై రాజకీయ, సినీ రంగం నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె స్పందించి. నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే సమయంలో దర్శకుడు రాం గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచనలో పడేసింది. 

‘కొండా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పడమేమిటి? ఆమె అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జున, నాగచైతన్యని. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిమ్ ఇండస్ట్రీ‌లో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగ చైతన్య చాలా సీరియస్‌గా తీసుకొని మరిచిపోలేని గుణపాఠం చెప్పాలి’ అని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్‌తో ఇక్కడ అవమానం జరిగింది ఆడవారికా? మగవారికా? అనే చర్చ జరుగుతున్నది.

‘గాసిప్స్’ను బేస్‌గా చేసుకొని..

సినీ రంగంలో ‘గాసిప్స్’ కామన్. వీటిని కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, మరికొన్ని పత్రికలు ప్రచారం కల్పించి తమ వ్యూస్‌ను పెంచుకుంటాయి. అయితే బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ నిజానిజాలను నిర్ధారించుకోకుండా.. కేవలం రాజకీయ ప్రత్యర్థిని చిక్కుల్లో నెట్టేయాలనే ఆలోచనతో ‘గాసిప్స్’ను బేస్‌గా చేసుకొని విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అవి మరింత జుగుప్సాకరంగా ఉండడంతో సినీరంగమంతా ఒక్కటై స్పందించింది. తామంతా ఏకమై నిలబడతామని మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ప్రకటించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యల కోసం నాగార్జున కోర్టును సైతం ఆశ్రయించారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ సైతం దీనిపై స్పందించి మంత్రి వ్యాఖ్యలను ఖండించారు.

జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే..!

ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ సినీ హీరోయిన్ల సంభాషణలను రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేశారనేది కొండా సురేఖ మరో ఆరోపణ. అంతేకాకుండా హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారని, కేటీఆర్ ఒత్తిడి భరించలేకనే రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు మరికొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. కామన్‌గా ఇతర రంగాలతో పోల్చుకుంటే సినీరంగంలో పని చేసే మహిళలకు ధైర్యం ఎక్కువే అని చెప్పొచ్చు. ఎంతటి తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, గాసిప్స్ ద్వారా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా వాటన్నింటిని తట్టుకొని నిలబడతారు. సినీ రంగంలో కొనసాగుతారు. అయితే హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసి ఉంటే, వారిని డ్రగ్స్‌కు అలవాటు చేసి ఉంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేదు ఎందుకు? కనీసం మాట్లాడలేదు ఎందుకు?

అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉందనే అనుకున్నా.. విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌పై వారికి నమ్మకం లేకుండా పోయిందా? కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండగా ఉంటుందని అనుకోలేదా? బీఆర్ఎస్ అధికారం కోల్పోయి పది నెలలకు పైగా గడుస్తున్నా.. ఇప్పటికీ ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు? అసలు కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని, డ్రగ్స్ అలవాటు చేశారని కాంగ్రెస్ నేతలు భావిస్తుంటే.. పది నెలలుగా అధికారంలో ఉన్నవారు అలాంటి వాటిపై ఎందుకు ఎంక్వయిరీ చేయించడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరమున్నది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక విషయాల్లో విచారణలు జరుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం... సినీ హీరోయిన్లు ముఖ్యంగా ఆడవాళ్లకు అన్యాయం జరిగి ఉంటే ఎందుకు స్పందించడం లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. అప్పటి డ్రగ్స్ ఎంక్వయిరీ బయటకొచ్చిన విషయాలనే చెబుతున్నానని ఒక మంత్రిగా ఉన్న కొండా సురేఖ బహిరంగంగానే మాట్లాడినా... ఆ ఎంక్వయిరీ రిపోర్టును ప్రజల ముందుకు ఎందుకు తేవడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి.

అసభ్యతకు అసభ్యతేనా జవాబు!

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. ఆంధ్రాలోని నాయకులు వాడే భాషపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. అయితే మహిళల పట్ల ఒక నాయకుడు అసభ్యకరంగా మాట్లాడారనుకుంటే.. జవాబు సైతం అసభ్యకరంగా రావడం ఎలా ఆమోదయోగ్యమవుతుంది? అధికారంలో ఉన్నవారు అలాంటి వాటికి జవాబు చెప్పడానికి అనేక మార్గాలు ఉంటాయి. చర్యలు తీసుకునేందుకూ అవకాశముంటుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు మాట్లాడే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి మాట్లాడాలి. నోరు జారితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో గత చరిత్రను పరిశీలించి జాగ్రత్తగా మసలుకోవాలి.

ఫిరోజ్ ఖాన్,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464

Tags:    

Similar News