స్త్రీ ఆస్తి హక్కు... నేటికీ అడ్డంకులేనా?

స్త్రీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడంలో ప్రధాన అంశం వారి ఆస్తి హక్కుని దెబ్బతీయటం. ఆలోచిస్తే ఎన్ని చట్టాలు వచ్చినా వారి ఆస్తి హక్కుకు మాత్రం

Update: 2024-12-01 01:15 GMT

స్త్రీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడంలో ప్రధాన అంశం వారి ఆస్తి హక్కుని దెబ్బతీయటం. ఆలోచిస్తే ఎన్ని చట్టాలు వచ్చినా వారి ఆస్తి హక్కుకు మాత్రం కుటుంబం పాలకులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు. ‘చట్టం దృష్టిలో అందరూ సమానులే’ అన్న ప్రాథమిక రాజ్యాంగ న్యాయ సూత్రానికి వ్యతిరేకంగా ఆడపిల్ల ఏ హక్కులు లేకుండా పరాధీనగా బతుకుతోంది. ఈ వివక్ష 2005 సవరణ చట్టం పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. 

వందల సంవత్సరాలుగా సాంప్రదాయ వాదులు, సంఘసంస్కర్తల మధ్య జరిగిన సంఘర్షణల అనం తరం ఆడపిల్లలకు ఆస్తి హక్కులు కల్పించ బడ్డాయి. విభిన్న మతాలు, సంస్కృతులు ఉన్న మనదేశంలో ఈ ఆస్తి హక్కులన్నవి కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికపై వేరువేరుగా ఉన్నాయి. అదేకాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆస్తికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు ఉండడం వల్ల కూడా తేడాలు ఉన్నాయి..

2005 సవరణ చట్టం..

హిందూ న్యాయ నిబంధన గ్రంథం (హిందూ కోడ్‌) క్రోడీకరించిన తరుణంలో 1956, హిందూ వారసత్వ చట్టం ఒక సమగ్రమైన, సమాన వారసత్వపు హక్కులు కల్పించిన మొదటి చట్టం. 2005 హిందూ వారసత్వ చట్టం, 1956 చట్టంలోని కొన్ని లొసుగులను తొలగిస్తూ, స్త్రీ సర్వతోముఖాభివృద్ధికి, సాధికారతకు సంపూర్ణ ఆస్తి హక్కు కలిగి వుండాలని గుర్తించి, సవరణలు చేసిన సం స్కరణ చట్టం. ఈ సవరణ చట్టం దేశానికంతటికీ వర్తించేలా చేయబడిన ఒక చట్టం, దీనిప్రకారం హిందూ ఉమ్మడికుటుంబంలో మితాక్షర సహదాయాదిత్వం (mitakshara Coparcenary) లో వున్న పూర్వీకుల ఆస్తి (ancestral property) లో ఆడపిల్లకి కూడా కుమారునితో సమా నంగా ఆస్తి హక్కు ‘జన్మహక్కు’గా ఇవ్వబడింది.

పూర్వీకుల ఆస్తిలో స్త్రీకి భాగం లేదా?

మితాక్షర హిందూ చట్టం ఆస్తిని, పూర్వీకుల ఆస్తి గా గుర్తించింది. హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవ స్థ అనూచానంగా కొనసాగుతున్న ఒక వ్యవస్థ. అందులో సహదాయాదిత్వం లేక సహభాగస్వామిత్వం అన్నది ఒక పరిమిత భాగం. ప్రతి హిందూ కుటుంబ పురుషుడు, పుట్టుకతోనే, మూ డు తరాల మగ సంతానంతోసహా ఈ‘‘సహదాయా దిత్వం’’లో సభ్యుడు అవుతాడు. ఈ హక్కు పుట్టుకతో వచ్చి, సమిష్టిగా కొనసాగుతూ, జీవించి ఉన్నంతకాలం ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చిన వాటా నిర్దిష్టంగా వుండక, చావు పుట్టుకలతో పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. విభజన జరిగిన తర్వాత కూడా సదరు వ్యక్తితో అతని మూడు తరాల మగసంతానంలో ఇంకొక ‘‘సహదాయాదిత్వం’’ ఏర్పడుతుంది. ఈ రకమైన ఆస్తిహక్కులో స్త్రీ సంతానానికి ఏ హక్కులు లేవు. ఆడపిల్లల పోషణ, పెళ్లి ఖర్చులు మట్టుకి ఉమ్మడి కుటుంబ బాధ్యతగా వుండేవి.

వీలునామా రాయకపోతే..

రెండో ఆస్తి స్వార్జితపు ఆస్తి 1930లో వచ్చిన Gains of Leaming చట్టం తర్వాత ఈ హక్కు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ స్వార్జితపు ఆస్తిని, ఆ వ్యక్తి, తన ఇష్టానుసారం ఆస్తిని అనుభవించవచ్చు లేదా అమ్ముకోవచ్చు. లేదా వీలు నామా ద్వారా తనకిష్టమైన వారికి, తన మరణానంతరం అనుభవించేలా ఇవ్వవచ్చు. ఉమ్మడి ఆస్తిలో కూడా తన వాటాని కూడా, వీలునామా ద్వారా ఇవ్వవచ్చును. ఒకవేళ వీలునామా రాయ కుండా సదరు వ్యక్తి మరణించినట్లయితే ఆ ఆస్తిని అతని న్యాయమైన వారసులందరూ సమానంగా పొందగలరన్నది ‘మితాక్షర’ సిద్ధాంతం అంగీకరించింది. ఈ వారసత్వపు హక్కుని ‘ఇంటెస్టేట్ సక్సెషన్' అంటారు. వీలునామా ద్వారా వచ్చే వారసత్వపు హక్కుని ‘టెస్టిమెంటరీ సక్సెషన్’ అంటారు. వీలూనామా రాయనియెడల వచ్చే ఆస్తి లో కుమారులు, కుమార్తెలు, తల్లి, భార్య తదితర స్త్రీ సంబంధీకులతో కలిసి సమాన హక్కు ఉంది. ఈ విధంగా వచ్చిన ఆస్తి అబ్బాయిలకి వచ్చిన ఆస్తితో చూస్తే చాలా తక్కువగా ఉండేది. ఎందు కంటే ఆడపిల్లకి పూర్వీకుల ఆస్తిలో ఏ భాగం ఉండకపోవడం, వీలునామా ద్వారా సాధారణం గా పితృకర్మలు చేసే కుమారులకే తను భాగాలు రాయడం వలన ఈ తారతమ్యం ఉండేది.

తిరుగులేని హిందూ వారసత్వ చట్టం

1985లో మన రాష్ట్రంలో ఎన్‌.టి. రామారావుచే తేబడిన హిందూ వారసత్వ చట్టం అవివాహిత కుమార్తెలకు, కుమారులతో సమానంగా పూర్వీ కుల ఆస్తిలో హక్కు కల్పించింది. ఆ చట్టం వచ్చేనాటికి వివాహమైన వారికి హక్కు ఇవ్వలేదు. 1985 తర్వాత వివాహం అయిన కూతుళ్లకు కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. అలాగే వ్యవసాయ భూములలో కానీ, పుట్టింటి తరుపు నివాస గృహంలో కానీ తన వాటా తన యిష్ట ప్రకారం అడిగే హక్కు, ఇవ్వబడలేదు. సోదరులు విభజన చేసినప్పుడే తన వాటా అడగగలిగేలా చేశారు. ఈ 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం‘56 చట్టంలోని లొసుగులు తొలగించి, పూర్వీకుల ఆస్తిలో కూడా మగవారితో సమానంగా, పుట్టుకతోనే ‘‘సహదాయాదిత్వం’’ హక్కుకల్పించింది. ఈ విధంగా కుమారునికి హక్కులు వస్తాయో. అదే విధంగా ఆడపిల్లలకి కూడా హక్కులు వస్తా యని విస్పష్టంగా పేర్కొంది. హక్కులతో పాటు బాధ్య తలు కూడా ఉంటాయని చెప్పింది. అలాగే వ్యవ సాయ భూములలోకూడా హక్కులుయిచ్చిం ది. పుట్టినింటి నివాసగృహంలో తనవాటా తన ఇష్ట ప్రకారం తీసుకోవచ్చని కూడా హక్కు యిచ్చింది.

పూర్వీకుల ఆస్తిలోనూ సమాన వాటా

ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు అడపిల్లకి వచ్చేయో, ఆ హక్కులు ఆమెకి సంపూర్ణ హక్కు అని, వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి, లేక అమ్ముకోవడానికి గాని ఆమెకు పూర్తి హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించింది. ఇంతకు ముందు ఒక్క స్త్రీ ధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి, అత్తింటి వారు బహుమతిగా ఇచ్చే వస్తువులు, కొద్దిపాటి ఆస్తుల మీద మాత్రమే హక్కు కలిగిన ఆడపిల్ల, ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన ‘సహదాయాదిత్వం’ హక్కు ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో వీలునామా లేని ఎడల (ఇంటెస్టేట్ సక్సెషన్) కూడా సమాన వాటా పొందే హక్కు పొందింది.

స్త్రీ హక్కుకు ఇప్పటికీ అడ్డంకులే..!

ఆర్థికంగా ఆడపిల్లకు ఆస్తి ఇవ్వకూడదనే ఉద్దేశం అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక వారికోసం వారు వాదించుకునే చట్టాలు తేవడం కోసం ప్రయత్నిస్తే ఏ పార్టీ వారికి సముచితమైన సీట్లు ఇవ్వడం లేదు. అందుకే అసెంబ్లీలు పార్లమెంట్‌లో మహిళలు తక్కువగా ఉండీ అవి వెలవెల బోతున్నాయి. ఇకపోతే ఇటీవల తెలంగాణాలో గురుకుల పాఠశాలలో అస్వస్థత చూస్తే నన్నయ విశ్వవిద్యాలయాల్లో ఆడపిల్లల అన్నంలో పురు గుల విషయం చూస్తే దేశంలో అన్ని మహిళల హాస్టలలో అశుభ్రమైన అరుచికరమైన పౌష్టికాహార రహితమైన వాతావరణంలో విద్యార్థినులు వుండలేక భోజనం చేయలేక డస్ట్‌బిన్‌లో తమకు పెట్టిన ఆహారాన్ని విసిరెస్తున్న సందర్భాలు ఉన్నా యి. పాలక వర్గాల పితృస్వామిక పరిపాలనను విద్యార్థినిల అవస్థలు నిరంతరం మన కళ్ళకు కట్టి నట్టు కనిపింపజేస్తున్నాయి. ఇకపోతే బాలికల మీద యువతుల మీద నిరంతరం జరుగుతున్న అత్యాచారాలకు అర్థం లేదు.

స్త్రీ సాధికారత సాధిస్తేనే..

భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలకవర్గం, పితృస్వామ్య వ్యవస్థ, మతోన్మాదం విజృంభించి స్త్రీలకు రక్షణ లేకుండా చేస్తున్న ఈ సందర్భంగా స్త్రీలకు సంబంధించిన అన్ని దిశలలో అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, ఆర్థిక పరిరక్షణ కోసం, రాజ్యాధికారం కోసం, సామాజిక వ్యక్తిత్వం కోసం స్త్రీలు చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజాసామ్యవాదులు అందరు కలిసి ముక్తకంఠంగా ఆ పోరాటంలో పాల్గొని స్త్రీ సాధికారతను సాధించే దిశగా సాగినప్పుడే డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణకు బాటను వేసినవారమవుతాం. అంకిత భావంతో, ఆత్మ గౌరవంతో, ఆత్మస్థైర్యంతో ఆ దిశగా నడుద్దాం.

- డాక్టర్‌ కత్తి పద్మారావు

98497 41695

Tags:    

Similar News