ప్రజాపాలనకు ఏడాది!

ప్రజల యొక్క, ప్రజలచే, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటారని అబ్రహాం లింకన్ పేర్కొన్నారు. ఇది నేటి తెలంగాణ

Update: 2024-12-03 01:15 GMT

ప్రజల యొక్క, ప్రజలచే, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటారని అబ్రహాం లింకన్ పేర్కొన్నారు. ఇది నేటి తెలంగాణ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. పాలకమండలి నుండి పాలన దాకా ప్రతిచోట సామాజిక న్యాయం, సంఘటిత బాధ్యతను మనం గమనించవచ్చు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో కనీసం ఒక్క మహిళ కూడా మంత్రి పదవి చేపట్టకపోవడం లింగ సమానత్వంపై వారి విధానాన్ని స్పష్టం చేస్తుంది. నాటి మంత్రులు నామమాత్రంగా ఉండి నిర్ణయాధికారం కేవలం ముగ్గురు మంత్రుల చెప్పు చేతల్లో ఉండేది. నేడు మంత్రులకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. పాలక మంత్రి మండలిలో అన్ని వర్గాలతో కూడిన సామాజిక కూర్పు ఉంది.

బంగారు గని లాంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం పదేళ్లలో పాతర పెట్టింది. 7 లక్షల కోట్ల అప్పుచేసి ఆర్థిక అంధకారంలోకి నెట్టేసింది. సహజ వనరులను కొల్లగొట్టి, కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా పలురకాల స్కామ్‌లతో తెలంగాణ కు దేశస్థాయిలో పరువునష్టం జరిగింది. ఆ అవినీతి సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా తరలించారనే అపవాదు లేకపోలేదు.

మహిళా సాధికారత..

మహిళా సాధికారతే లక్ష్యంగా, ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తూ వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ మీరంటే మీరు తగ్గించండని పోట్లాడగా, నేడు కాంగ్రెస్ రూ.‌500కే సిలిండర్‌ను అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కుటుంబ డిజిటల్ కార్డులో మహిళను యజమానిగా పేర్కొనడం మహిళల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న గౌరవానికి సంకేతం. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో అడుగు ముందుకేసి మహిళా& శిశు సంక్షేమశాఖతో కలిసి మహిళా సంఘాలతో బస్సులను కొనుగోలు చేయించి, ఆర్టీసీ ద్వారా అద్దెలకు తీసుకొని ఉపాధి కల్పించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ వాలంటీర్ల ప్రక్రియను ప్రకటించారు. ఈ చర్య ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, లింగ వివక్షలేని సమాజ నిర్మాణానికి ఇది నాంది పలకనుంది.

ఐదు లక్షల ఉద్యోగాల కల్పన

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఖచ్చితమైన ప్రణాళికతో ఉంది. మాట ఇచ్చినట్లుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. గత ప్రభుత్వం మాదిరి నోటిఫికేషన్ ఇచ్చి కేసులు వేయిస్తూ, కాలయాపన చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయకుండా.. వచ్చి రాగానే నర్సింగ్, కానిస్టేబుల్ నియామక పత్రాలను అందజేసి నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు ముందుకేసింది. ప్రతిష్టాత్మక గ్రూప్ 1,3,4 పరీక్షలను నిర్వహించి, గ్రూప్- 2 పరీక్ష నిర్వహించబోతుంది. ఎస్‌జీటీ, జేఎల్ ఇవే కాక ఇతర ఉద్యోగాలు కలిపి, సంవత్సరం తిరగకుండానే 60వేల ఉద్యోగాల నియామకాల మారథాన్ చేపట్టి కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చాటింది. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కొలువుల జాతరను మరల గుర్తు చేసింది. వీటికి అదనంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో టాటాగ్రూప్, సర్జికల్ హెల్త్ కేర్ కంపెనీలతో పాటు , డేటా సెంటర్ల ఏర్పాటుకు వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వచ్చాయి. గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు, కాగ్నిజెంట్ కార్యాలయం ఏర్పాటు ద్వారా మొత్తంగా మరో ఐదు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కనిపిస్తుంది.

విద్యా విప్లవం

విశ్వవిద్యాలయాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే దేశానికి ప్రజలకు మేలు జరుగుతుందని జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు. గత కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను స్థాపిస్తే... బీఆర్ఎస్ నిధులు కేటాయించక, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు ఉన్నత విద్య అందని ద్రాక్షలాగా చేసే కుట్ర చేసింది. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే విశ్వవిద్యాలయాల పునరుద్ధరణకు పాటుపడింది. కొత్త వీసీలను నియమించి, నిధులు అందించి విశ్వవిద్యాలయ వ్యవస్థకు ఆక్సిజన్‌ని అందిస్తుంది. భట్టి విక్రమార్క ఆర్థిక ప్రణాళికలో విద్యకు గత ప్రభుత్వం కంటే 11.50 శాతం అధికంగా బడ్జెట్‌ను కేటాయించారు. నియోజకవర్గానికొక ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాలను నిర్మించనున్నారు. నాణ్యమైన విద్య అందించుటకు కొత్తగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నైపుణ్యాలు పెంచి ఉద్యోగాల ఎంపికకు సన్నద్ధంగా ఉండేలా స్కిల్ యూనివర్సిటీని స్థాపించింది.

వైద్యం, ఆరోగ్యంలో

గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను విచ్చల విడిగా దుర్వినియోగం చేసిన నేప థ్యంలో, ఇకపై దరఖాస్తులు నేరుగా ఆన్‌ లైన్‌లోనే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదం నుండి కాపాడే 108 సర్వీసులను బలోపేతం చేయాలని వైద్యశాఖ మంత్రి పట్టుదలతో ఉన్నారు. జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పనున్నారు. నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టనున్నారు. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇస్తున్నారు.

రైతాంగంలో

రైతులే దేశానికి వెన్నుముక‌, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 24 గంటల ఉచిత కరెంటు పథకానికి శ్రీకారం చుట్టింది. దాన్ని కొనసాగిస్తూనే రైతుల రుణమాఫీ హామీని నిలబెట్టుకుంది. ఆ శాఖ మంత్రి ఇది మరింత మందికి లబ్ది చేకూరాలని నిబంధనలను సడలించి 2లక్షల వరకు రుణమాఫీ చేశారు. సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం ధరణి పేరిట భూములను కొట్టేస్తే పేదలకు న్యాయం చేసేందుకు ‘భూమాత’ ద్వారా ప్రక్షాళన చేయనున్నారు. గతంలో లాగా గుట్టలు, రహదారులు, వెంచర్లకు కాకుండా నికార్సైన రైతులకు రైతుభరోసా అందించి.. ప్రజాధనం వృధా కాకుండా చూడాలనే లక్ష్యంతో కొంత సమయం తీసుకుంటున్నప్పటికీ, రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇక నీటిపారుదల రంగాన్ని చక్కదిద్దేందుకు ఆ శాఖ మంత్రి నిరంతర కృషి చేస్తున్నారు.

అరకొర నిధులు ఉన్నప్పటికీ..

హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు మెట్రో ఫేజ్-2తో పాటు, RRRను నిర్మించనున్నారు. గాలి కాలుష్యం తగ్గించుటకు ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ & రోడ్ టాక్స్ నుండి మినహాయింపు ప్రకటించింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తూనే, సోలార్ విద్యుత్ శక్తి ఉత్పత్తిని పెంచడానికి చర్యలు చేపడుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి లాంచి ప్రయాణాలను ప్రారంభించింది. వేములవాడ దేవస్థానానికి అత్యధిక మొత్తంలో నిధులు కేటాయించి ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి పాటుపడుతుంది. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం పరికరం అందించి ఇచ్చి వారి ప్రాణాలు కాపాడడంతో పాటు కులవృత్తులను ప్రోత్సహిస్తుంది. ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే ప్రతిష్టాత్మకమైన మూసీ పునరుజ్జీవం, కుల‌గణన అనే రెండు అంశాల పైన సాహసోపేతమైన నిర్ణ యాలు తీసుకుని, జాతీయస్థాయిలో తమ సత్తాను చాటింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు రాష్ట్ర పీసీసీ, సీఎల్పీ, ప్రచారకమిటీ అధిపతులు నియంతృత్వ ప్రభుత్వంపై తమదైన శైలిలో నిరసనలు తెలుపుతూ దూకుడుగా వెళ్లారో.. అంతే దూకుడుగా ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తున్నారు. అరకొరగా నిధులు ఉన్నప్పటికీ, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అభి వృద్ధిని, సంక్షేమాన్ని రెండు రైలు పట్టాల్లాగా తీసుకెళ్లడంలో, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సఫలీకృతమయిందనే చెప్పాలి.

- బుర్ర రవితేజ గౌడ్

టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

94931 09462

Tags:    

Similar News