విదేశీ విద్యార్థులపై.. ట్రంప్‌కు ఎందుకీ కక్ష?
విదేశీ విద్యార్థుల గెంటివేత విషయంలో ట్రంప్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం. వందలాది

విదేశీ విద్యార్థుల గెంటివేత విషయంలో ట్రంప్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం. వందలాది మంది విదేశీ విద్యార్థులపై కఠిన నియ మాలను విధించి, వారిని దేశం విడిచి తమ తమ స్వదేశాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం ఎంత మాత్రం న్యాయం కాదు. విద్యార్థులు చేసిన తప్పేంటి?
ఏడాదిన్నరకు పైగా వారు గాజా, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న ఒక భయానక యుద్ధాన్ని ఆపమని కోరటం తప్పా? మానవ మారణ కాండకు శాంతియుతంగా నిరసన తెలపడం నేరమా?
ఇది దేశద్రోహమా?
అన్యాయాన్ని ఎదిరించటం ప్రజాస్వామిక హక్కు కాదా యుద్ధం వద్దు.. పిల్లలను, మహిళలను, వృద్ధులను కాపాడండి అని వేడుకోవడం ట్రంప్ దృష్టిలో దేశద్రోహం అయింది. స్వేచ్ఛాయుత భావ ప్రకటనకు పుట్టినిల్లని ఘనంగా చాటుకున్న అమెరికాలో విద్యార్థులను ఉగ్రవాదులకు మద్దతుదారులుగా ముద్ర వేసి అమెరికా నుండి బహిష్కరించడం అమానుషం. అమెరికాలో రాజ్యాంగ చట్టం ఏం చెబుతుందో ట్రంప్‌కు అనవసరం. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆయనకు గౌరవం లేదు. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన తన అప్రజాస్వామిక నిజ స్వరూపాన్ని చూపించాడు. గత ఎన్నికల్లో ఓటమి తప్పదు అని తెలియగానే అధికారం కోసం తన పార్టీ కార్యకర్తలను, తన అభిమానులను అధ్యక్ష భవనం పైకి ఉసిగొల్పాడు. రెండోసారి అధ్యక్షుడిగా అధికారంలోకి రావడంతో ఇప్పుడు తన నియంతృత్వ విశ్వరూపాన్ని తిరిగి ప్రదర్శిస్తున్నాడు.
ఉన్న ఫలాన వెళ్లిపోమంటే ఎలా?
వందలాదిమంది విదేశీ విద్యార్థులను తెల్లవారుజామునే నిద్ర లేపి వారిని తట్టాబుట్టా సర్దుకుని అమెరికాను విడిచిపెట్టి స్వదేశాలకు పోవాలంటూ ఆజ్ఞలు జారీ చేయడం మూర్ఖత్వం. ఈ విద్యార్థులు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేదు. విధ్వంసాలు సృష్టించింది లేదు. వారు తోటి ప్రజలు జీవించే హక్కు గురించి శాంతియుతంగా గుమిగూడి నినాదాలు మాత్రమే చేశారు. అది కూడా నేరమా? విద్యార్థులుగా వారు గాజా ఘోరాకలిని ప్రశ్నించడం, ఆకలి దప్పికలతో అల్లాడుతున్న లక్షలాది మంది ప్రజలను రక్షించమంటూ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లో నినాదాలు చేశారు. అది ప్రభుత్వంపై, రాజ్యంపై తిరుగుబాటు ఎలా అవుతుందో... ఊహకు కూడా అందదు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులను గురించి మాట్లాడటమే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంగా, విద్యార్థుల నిరసనలను హమాస్ అనుకూల వాదంగా చిత్రించి అమాయకపు విద్యార్థులను దేశద్రోహులుగా ముద్ర వేసి శిక్షించడం అన్యాయం, అక్రమం.
విద్యార్థుల శక్తి తెలుసు కాబట్టే!
అమెరికా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేసిన శాంతి యుత ఉద్యమాలు, ఇజ్రాయెల్‌కు మొదటి నుండి కొమ్ము కాస్తున్న అమెరికా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేశాయి. ఇజ్రాయిల్‌కు శక్తి మంతమైన ఆయుధాలను సమకూరుస్తూ, దారుణ మారణకాండకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న అమెరికా పాలకులు ఈ విద్యార్థుల ఉద్యమం కారణంగా ఇజ్రాయెల్‌ను ఆక్షేపించవలసి వచ్చింది. మానవతా సాయం కొంత చేయాల్సి వచ్చింది. యూనివర్సిటీలు సైతం తమ నడవడికను, గత కాలపు విలువలను తడిమి చేసుకోవాల్సి వచ్చింది. యుద్ధాలు ఆపిన చరిత్ర విద్యార్థులకు ఉన్నదనీ, వియత్నాంపై యుద్ధ కాలంలో తమ ప్రభువులనే ప్రశ్నించిన శక్తి వారికి ఉన్నదన్న సంగతి ట్రంప్‌నకు తెలుసు. అందుకే కాల్పుల విరమణను నీరుగార్చి, గాజాను ఖాళీ చేయించే క్రమంలో నెతన్యాహూతో కలిసి అమెరికా తిరిగి మారణకాండను అమలు చేస్తున్న నేపథ్యంలో స్వదేశంలో ఒక్క అసమ్మతి స్వరం వినిపించినా మళ్లీ నిప్పురాజుకొనే ప్రమాదం ఉన్నదని ఆయనకు బాగా తెలుసు.
ఈమెయిల్‌తో దేశ బహిష్కరణ
అందుకే, ఈ విదేశీ విద్యార్థులను వెదికి వెదికి, మరీ దేశం నుంచి గెంటేస్తున్నారు. విద్యార్థులకు తమ వివరణలు ఇచ్చుకొనే అవకాశం కూడా ఇవ్వడం లేదు. సమాధానం చెప్పుకొనే వేదిక కూడా లేదు. కేవలం ఏదో ఒక నేరారోపణ మోపడం. ఒకే ఒక్క ఈమెయిల్ సందేశంతో దేశ బహిష్కరణ జరిగిపోతోందంటూ బెదిరించటం పరిపాటైపోయింది. వీసాలు రద్దయినంత మాత్రాన విద్యార్థులు భయపడి తమ స్వదేశాలకు పోనవసరం లేదని, యూనివర్సిటీల దయాదాక్షిణ్యాలున్నంత వరకూ విద్యార్థులు అక్కడ నిక్షేపంగా ఉండవచ్చునని మరికొందరు విద్యార్థులకు ధైర్యం చెబుతూ, సలహాలు ఇస్తున్నారు. కానీ, అమెరికా తన ఆదర్శాలకు, లక్షాలకు విలువలకు పాతర వేస్తూ, విజ్ఞానానికి నెల వుగా ఉండాల్సిన విశ్వ విద్యాలయాలను మిలటరీ క్యాంపులుగా మారుతున్న సమయంలో విద్యార్థులు అక్కడ ఉండి కూడా ప్రయోజనమేమిటన్నదే అసలు ప్రశ్న.
- డాక్టర్ శాంతి సాగర్
98493 28496