చేపలు ఇవ్వడం కాదు..చేపలు పట్టడం నేర్పండి!

పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు

Update: 2025-04-16 01:00 GMT
చేపలు ఇవ్వడం కాదు..చేపలు పట్టడం నేర్పండి!
  • whatsapp icon

పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఉచిత పథకాల కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు.. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే. కానీ, వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలి’ అని వ్యాఖ్యానించింది. ఇందుకు అనేక రాజమార్గాలు ఇప్పటికే ఉన్నాయి. 

కాలే కడుపులకి మూలకారణం తెలియని ఓటరు ఉచి తాల ఉట్టియే‌ జీవన స్వర్గానికి నిచ్చెనని భ్రమ పడుతుంటారు. ఈ మూర్ఖత్వం సొమ్ము చేసుకోవడం కోసం రాజ కీయ పక్షాలు ఉచితాలు ప్రకటిస్తూనే ఉంటాయి. అయితే, ఉచితాలకు బదులు పన్నులు కొంత మేర తగ్గిస్తే గ్రామీణ ఉపాధి పథకం కింద చెల్లించే దినసరి వేతనం పెంచవచ్చు. సమస్త ఉపాధులకు చట్టాలు నిర్దేశించిన కనీసం వేతనం పెంచ వచ్చు. ఇలా చేయడం ద్వారా ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంచవచ్చు.

తనిఖీలతో పనిలేదంటూ..

దేశంలో కనీస వేతన చట్టం పకడ్బందీగా అమలు పరచడానికి మనసుంటే మార్గం లేకపోలేదు. కార్మిక రాజ్య బీమా చట్టం, ఉద్యోగుల భవిష్య నిధి చట్టం ప్రకారం యాజమాన్యా లు ఆ రెండు సంస్థలకు నిర్ణీత కాల వ్యవధిలో పంపించే చందా చెల్లింపు నివేదికలు పరిశీలిస్తే, కనీస వేతన చట్టం అమలుకు నియమితులైన అధికారులు తమ, తమ కార్యాలయాల్లో కూర్చునే ఆ లక్ష్యం సాధించవచ్చు.‌ కా.రా.బి.‌ ఒడిషా ప్రాంతీయ నిర్దేశకుడిగా రవీంద్ర వర్మ అధ్యక్షతన ఏర్పడిన రెండవ జాతీయ లేబర్ కమిషన్ ముందు ఇదే సూచన చేసాను కానీ ఫలితం శూన్యం. అనేకసార్లు కర్మా గారాలలో పనిచేసే కార్మికుల పేర్లన్నీ హాజరు పట్టీలలో ఉండకపోవడం గమనించి, కర్మాగారాల ఉపముఖ్య ఇన్స్పెక్టర్ ముందు ప్రస్తావించాను. ఆయన నవ్వుతూ ‘తనిఖీల శ్రమతో పనిలేదు. రోజువారీ విద్యుత్ వినియోగం, వస్తూత్పత్తి చూస్తే మొత్తం కార్మికుల సంఖ్య చెప్పవచ్చు’ అన్నారు. ఇదీ పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులకు, కార్మికులకు సమన్యాయం నిరాకరించడానికి ప్రభు త్వాలు ఎంచుకున్న మార్గం ఔట్ సోర్సింగ్. దీంతో వారికి సమానమైన పనికి సమాన ప్రతిఫలమే కాదు ఇతర సదుపాయాలు కూడా లభించడం లేదు.

సమాన పనికి సమాన వేతనం ఇస్తే తప్పా..

కాంట్రాక్ట్ లేబర్‌ను నియమించడాన్ని నిషేధించడం, తప్పనిసరి అయినప్పుడు నియంత్రించడానికి ఉద్దేశించిన కాంట్రాక్టు కార్మిక (నియంత్రణ మరియు రద్దు) చట్టం, 1970లోనే ఒక వెసులుబాటు ఉంది. అందుకోసమే ఏర్పరిచిన సంస్థలు కాకపోతే, ప్రధాన యాజమాన్యానికి పారి శుధ్య, భద్రత, లోడింగ్, అన్‌లోడింగ్, క్యాంటీన్, క్యాటరింగ్ మొదలైన 11 సేవలందించే కార్మికులు ఈ చట్ట పరిధిలోకి రారు. అంతేకాదు, కొరియర్ సేవలు, సివిల్, ఇతర నిర్మాణ పనులు, తోటపని, హౌస్ కీపింగ్, లాండ్రీ, అంబులెన్స్ సేవ లతో సహా రవాణా సేవలు, అలాంటి ఇతర కార్యకలాపాల్లో నియమితులైన కార్మికులు కూడా ఈ చట్ట పరిధి నుండి మినహాయించబడ్డారు. ఇక ఈ చట్టం వర్తించే యాజమాన్యాలు నిర్వహించే ఆసుపత్రులు, విద్యా, శిక్షణా సంస్థలు, అతిథి గృహాలు, క్లబ్బులలో నియమితులైన కార్మికుల పరి స్థితి కూడా ఇదే. వీరికి ఈ మినహాయింపులు రద్దు చేస్తే, అసం ఖ్యాక బడుగుల బతుకులు మెరుగవుతాయి. అయితే ప్రభుత్వాలన్నీ సమాన పనికి సమాన వేతనం ఇస్తే.. పైన చెప్పిన మినహాయింపులున్నా వారందరికీ సమాన ప్రతి ఫలం లభి స్తుంది. అయితే ఇది జరిగే పని కాదు. ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు నింపడానికి, పెద్ద పరిశ్రమల యాజమాన్యాలకి లాభాలు పెరగడానికి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ లేబర్ కామధేనువు, కల్పవృక్షంలాగా కనిపిస్తున్నాయా?

చట్టాలు పకడ్బందీగా అమలైతే..

ఈ.పీ.ఎఫ్. సంస్థ అమలు చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కనీస పింఛను రూ.7500కు పెంచ మని కోరితే.. ప్రభుత్వం కేవలం రూ.3,000 కు పెంచింది. అంటే, ఈ మొత్తం వృద్ధాప్య పింఛన్ రూ. 4,000/- కంటే తక్కువ. ఇక నెల జీతం రూ. 15,000/- దాటిన వారికి పి. ఎఫ్. చట్టమే వర్తించదు. ఈ వేతన పరిమితిని, కనీస పెన్షన్ను పెంచడం సమన్యాయం దిశగా ముందడుగవుతుంది. ఇక అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 ప్రకారం వలస కార్మికులకు.. స్థానిక కార్మికుల వలె సమానమైన వేతనం చెల్లించాలి. అదనంగా వలస భత్యం, ప్రయాణ భత్యం చెల్లించాలి కానీ ఇవి అమలు కావు. ఇవన్నీ పగడ్బదీగా అమలైతే ప్రజలు ఉచితాలపై ఎక్కువ ఆధారపడకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇది సాధ్యమేనా?

-మల్లాప్రగడ రామారావు

99898 63398

Tags:    

Similar News