యాక్సిడెంట్ చేసినా శిక్ష విధించకుండా.. మొక్కలు నాటమన్న ప్రకృతి ప్రేమికుడు
తన జీవితకాలంలో కోటి మొక్కలకు పైగా నాటిన చరిత్రకు ఆద్యుడు వనజీవి రామయ్య. మొక్కలు నాటుతూనే జీవితం పండించుకున్న

తన జీవితకాలంలో కోటి మొక్కలకు పైగా నాటిన చరిత్రకు ఆద్యుడు వనజీవి రామయ్య. మొక్కలు నాటుతూనే జీవితం పండించుకున్న ప్రకృతి ప్రేమికుడాయన. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. వనజీవి రామయ్యగా స్థిరపడి జన్మ సార్థకం చేసుకున్న ధన్యజీవి ఆయన.
వృక్షో రక్షతి రక్షితః
మొక్కలపై ఆయనకు ఎంత ప్రేమ అంటే.. 2022 లో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. రామయ్య ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. కాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కులు వెంటనే ఆయనను ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌కు అరుదైన శిక్ష విధించారు రామయ్య. పోలీస్ స్టేషన్‌లో కేసు వద్దని.. బదులుగా అతడిచే 100 మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు. అలా తనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని క్షమించడంతో పాటు మొక్కలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.
కోటి మొక్కలు నాటి...
సమాజ హితం కోసం, భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న సద్భావన కలిగిన గొప్ప వ్యక్తి రామయ్య. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు మొక్కలు నాటుతూనే ఉన్నారు... జీవిత చరమాంకంలో ఆరోగ్యం సహకరించకున్నా వెనకడుగు వేయలేదు. ఒక్కడే కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించాడు.. తన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నాడు. ఆయన యవ్వనదశలో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీద పడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్లలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు.
జీవితాంతం మొక్కలు నాటేందుకే..
పర్యావరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం అంకితమయ్యారు. ఖాళీ భూములు, రోడ్ల పక్కన, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా ఆయన జీవిత కథను పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠశాల పాఠ్యాంశాల్లోనూ చేర్చారు. ప్రస్తుతం అభివృద్ధి పేరిట నగరాలు కాంక్రీట్ జంగల్ గా మారుతున్నాయి. తమ అవసరాల కోసం పచ్చని చెట్లను నరికేసి పెద్దపెద్ద భవంతులు నిర్మిస్తున్నారు. అందరూ చెట్లను నరికి ప్రకృతి నాశనం చేసేవారే. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలనుకునేవారు చాలా తక్కువమంది. ఇలాంటివారిలో మన తెలం గాణ బిడ్డ వనజీవి రామయ్య ముందు వరుసలో ఉంటారు. తన జీవితాంతం మొక్కలు నాటేందుకే దారపోసిన ప్రకృతి ప్రేమికుడు రామయ్య.
- జాజుల దినేష్,
96662 38266