కామ్రేడ్లు కగార్‌పై మాట్లాడరా?

నిన్న ఒకే సమయంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు వరంగల్‌లో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కగార్ పట్ల స్పందించిన తీరుతో ప్రజాస్వామిక

Update: 2025-04-29 01:15 GMT
కామ్రేడ్లు కగార్‌పై మాట్లాడరా?
  • whatsapp icon

నిన్న ఒకే సమయంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు వరంగల్‌లో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కగార్ పట్ల స్పందించిన తీరుతో ప్రజాస్వామిక వాదుల కళ్ళల్లో ఆనందం కనిపి స్తోంది. అమాయక ఆది వాసీల హత్యలు ఆపం డి అంటూ రెండు నెలల కాలంగా తెలంగాణలో మేధావులు చేస్తున్న ప్రయత్నం ఒక మెట్టు పైకె క్కి ఒకింత విజయం సాధించారని చెప్పవ చ్చు. రెండు ప్రధాన పక్షాలను కదిలించిన శక్తి మేధా వులకు దక్కిందని ఇటు రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో వినిపించిన మాటలే ఉదాహరణ. 

 స్వయంగా రేవంత్ రెడ్డి నక్సలైట్ల సమస్యను సామాజిక ఆర్ధిక కోణంలో చూస్తామని, దీనికోసం చర్చల విషయమై సీనియర్ మంత్రి జానారెడ్డి అభిప్రాయాన్ని తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కాకుండా త్వరలోనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మావోయిస్టులపై చర్చిస్తామని కూడా రేవంత్ రెడ్డి తనను కలిసిన రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ సహా రిటైర్డ్ ప్రొఫెసర్లకు హామీ ఇవ్వడంతో ప్రజాస్వామిక వాతావరణం పట్ల మేధావులకు విశ్వాసం పెరిగింది. ఇక బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడిన నాలుగు ముచ్చట్లతో పిడుగులనే కురిపించారు. ‘ఏంది, అధికారం ఉందని అడ్డగోలుగా చంపుకుంటూ పోతే ఏం పద్ధతి? కగార్‌ను ఆపాలి అమాయకుల హత్యను ఆపాలి’ అంటూ తమ పార్టీకి చెందిన కార్యకర్తలచే. నాయకులచే తీర్మానం చేయించి లక్షలాది మందితో కేసీఆర్ చప్పట్లు కొట్టించారు.

ఊపిరి పీల్చుకున్న చర్చల కమిటీ!

నిజానికి ఈ మధ్యకాలంలో ఎన్‌కౌంటర్లలో మరణించిన 458 మందిలో 12 మంది మాత్రమే తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు, పది మంది తెలంగాణకు చెందినవారు. శాంతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వృద్ధ తరానికి, యువతరానికి రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి ప్రధాన నాయకులు ముందుకొచ్చి కగార్‌ని వ్యతిరేకించడంతో ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ పట్ల, ఈ చర్య కింద చంపబడుతున్న వారి పట్ల దేశంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఎం) స్పందిస్తున్న తీరును పరిశీలిస్తే ఆ పార్టీ నాయకులు మోస్తున్న ఎర్ర జెండాకు, కాషాయ జెండాకు పెద్ద తేడా కనిపించడం లేదు. కమ్యూనిస్టులుగా చెప్పకుంటున్నవారికి దండకారణ్యంలో జరుగుతున్న నరమేధం గురించి స్పందించే కనీస మానవత్వం కూడా లేదా? అంటూ ప్రజాసంఘాల వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

మాట్లాడటానికి సమయం లేదా?

ఆదివాసులపై ఫాసిస్టు యుద్ధం కొనసాగుతుంటే పేరుకే వర్గ పోరాటం, మార్క్సిజం, లెనినిజంని వల్లె వేస్తూ, సీపీఎం, సీపీఐ జాతీయ నాయకత్వం కగార్‌ను వ్యతిరేకించడం కాదు కదా.. కనీస నిరసనకు కూడా ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే వీరికంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూరుపాళ్ళు నయమంటున్నారు. కేవలం నగరాల్లోని అసంఘటిత కార్మికులతో జెండా మోయించి చిన్నచిన్న ర్యాలీలకు పరిమితమైపోయిన ఈ పార్టీలకు ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడే సమయం లేదా అన్నది ప్రజాసంఘాల విమర్శ. కగార్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్‌లో తలపెట్టిన ఒక సభలో ఒక పెద్ద కామ్రేడ్ హాజరై మావోయిస్టులు చేస్తున్న త్యాగాలు వ్యర్థమని చెప్పారు. దీంతో సదస్సులో ఉన్న అందరూ నోరెళ్ళ పెట్టారు. కేసీఆర్ మాదిరిగా ఒక్క సభలో కూడా ఆదివాసీల పక్షాన ఊచపోతకు వ్యతిరేకంగా మాట్లాడని కామ్రేడ్స్‌కు ఎర్ర జెండా పట్టుకునే అర్హత కూడా లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ప్రజాపంథా పార్టీలు వివిధ కుల సంఘాలు, ఆపరేషన్ కగార్‌కి వ్యతిరేకంగా మాట్లాడి, పోరాడే సంస్థలకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. తెలంగాణలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సైతం కగార్ పేరిట ఆదివాసీ హత్యలను వెంటనే ఆపివేయాని ప్రకటన చేశారు.

నక్సలైట్ల పేరు లేకుండా చేస్తారా?

సాధారణంగా రాజకీయ పార్టీలు నక్సలైట్లను దేశభక్తులుగా పొగడడం, ఆ తర్వాత ఆ బాధ్యత పోలీసులకు అప్పగించడం 1983 నుండి అదే కథ నడుస్తుంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నక్సలైట్ల పేరు లేకుండా చేస్తామని బహిరంగంగా ప్రకటించి ఆ మేరకు దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపుతూనే ఉన్నారు. పదుల సంఖ్యలో దాదాపు ఒక్కసారి గుంపుగా కాల్చివేతకు గురైన సందర్భం ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారీ ఒక మేజిస్ట్రియల్ విచారణ ఉండేది. ఇప్పుడు ఆదివాసీ రాష్ట్రాల్లో అది కూడా లేదు.

పేదరికాన్ని నిర్మూలిస్తే సంతోషిస్తాం!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో 11 నెలలలోగా దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని అనేకసార్లు ప్రకటించారు. అయితే ఇదే 11 నెలల కాలంలో పేదరికం లేకుండా చేస్తామని, కార్పొరేట్ దోపిడీ లేకుండా చేస్తామని ప్రకటిస్తే అందరూ హర్షిస్తారని మేధావులు అంటున్నారు. కాల్పుల్లో 458 మంది చనిపోయిన తర్వాత నైనా రెండు ప్రధాన పార్టీల ముందుకు రావడం హర్షనీయం. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ప్రకటించిన మావోయిస్టు పార్టీ ఆ మాటకు కట్టుబడి ఉన్నట్టు నెల రోజులుగా నిర్ధారణ అవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వానిదే ఆలస్యం. మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని, ఆదివాసీలను టార్గెట్ చేసి కనిపిస్తే కాల్చివేత పద్ధతులు అడవుల్లో అమలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్న వారిలో కోట్లాది మంది ఉన్నారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరడం ఏ విధంగా చూసినా అభినందనీయమే.

 కట్టా నరేంద్ర చారి,

63030 73400

Tags:    

Similar News