భర్తల ఆదాయం.. కుటుంబానికి అందడం లేదా? భారతీయ సంస్కృతిని మార్చుకోలేమా?
కుటుంబ సభ్యులు క్లెయిమ్ చెయ్యకపో వడం వల్ల కోట్ల కొలది ప్రజాధనం ఆర్థిక సంస్థల్లో పడి ఉందని ఇటీవల ఒక జాతీయ పత్రికలో

కుటుంబ సభ్యులు క్లెయిమ్ చెయ్యకపో వడం వల్ల కోట్ల కొలది ప్రజాధనం ఆర్థిక సంస్థల్లో పడి ఉందని ఇటీవల ఒక జాతీయ పత్రికలో ఒక రచయిత రచన చదివి ఆశ్చర్యం వేసింది. ఇది వందలూ, వేలూ కాదు. లక్ష కోట్లకు పైగా ఉంది. సేవింగ్స్ మధ్య తరగతికి తప్పదు. కానీ సేవింగ్స్ చేస్తేనే చాలదు. సేవింగ్స్ కుటుంబానికి అందేలా సరైన ప్రణాళిక కూడా వేసుకోవలసిన అవసరం అందరికీ ఉంటుంది. కానీ, ఆదాయ పరుడైన పురుషుడు ఆ ఆదాయం, ఆ సేవింగ్స్ కుటుంబానికి అందడం విషయంలో మాత్రం సరిగా ఆలోచించరు.
భర్త ఆదాయం సంపాదిస్తూ ఆ ఆదాయాన్ని వివిధ రకాల డిపాజిట్లలో, మ్యూచువల్ ఫండ్లలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో, ఇంకా ఇతర సంస్థల్లో పెడుతుంటారు. భారతదేశ మధ్య తరగతి ఈ రకంగానే ఉంటుంది. భవిష్యత్తులో ఏవైనా కష్టాలు వస్తే, ఆపదలు వస్తే ఈ సేవింగ్స్ ఆదుకుంటాయని వివిధ రకాల స్కీంలలో ఉంచుతారు.
భార్యతో పంచుకోని వారే ఎక్కువ
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆదాయం సంపాదించే పురుషుడు ఆ ఆదాయం, ఆ సేవింగ్స్ కుటుంబానికి అందడం విషయంలో సరిగా ఆలోచించరు. కొన్నిసార్లు ఏ ఏ డిపాజిట్లు ఏ ఏ బ్యాంకుల్లో ఉంచారు.. ఎంత జీతం వస్తుంది ఆ జీతాన్ని ఏ బ్యాంకులలో ఏ విధంగా డిపాజిట్ చేస్తున్నారు.. రికరింగ్ డిపాజిట్లు ఏ బ్యాంకుల్లో కడుతున్నారు వాటి అకౌంట్ వివరాలు ఏమిటి అందులో కుటుంబ సభ్యుల పేర్లు ఏవైనా నామినీగా ఉన్నాయా? లేదా ఈ వివరాలు ఏవీ కూడా చాలాసార్లు భర్తలు భార్యలకు చెప్పరు. చెప్పకూడదు అని వారు అనుకోరు. చెప్పాలని వారికి అనిపించకపోవచ్చు. తర్వాత చెబుదాంలే ఇప్పుడు తొందరెందుకు అనే ధీమా కావచ్చు. కొన్నిసార్లు, తరతరాలుగా నరాల్లో ఇంకిపోయిన భావజాలం అసంకల్పితంగా పనిచేస్తుంది.
నేను చూసుకుంటాను కదా...
భారతదేశంలో కొన్ని తరాలుగా పితృస్వామ్య భావజాలం ఉంది. భర్త డెసిషన్ మేకర్‌గా ఉండే కుటుంబాలు ఎక్కువ. భార్య జీ హుజుర్ అని చేతులు కట్టుకుని విద్యార్థిలా నిల్చుం టుంది. అంతకు ఎక్కువ అయితే భర్తకు నచ్చదు. నేను అంతా చూసుకుంటాను కదా. మధ్యలో నీకెందుకు టెన్షన్ వెళ్ళు. టీ పట్టుకు రా. ఇలా ఉంటాయి పితృస్వామ్య వ్యవస్థ అవశేషాలు. సరిగా తర్వాత రోజే ఆయన హార్ట్ ఎటాక్‌కి గురైతే డబ్బు ఎలా అరేంజ్ చెయ్యాలో ఆమెకు తెలీదు. ఎందుకంటే ఆమె ఇన్నాళ్ళూ క్రియా రహిత పాత్రలోనే గడిపింది.
అడగడానికి సెంటిమెంట్ అడ్డు
కొన్నిసార్లు ఎలా అవుతుందీ అంటే ఈ వివరాలన్నీ ఇప్పుడు భార్యకూ, పిల్లలకూ చెప్తే వారు ఇప్పటి నుండే విలాసాల్లో పడి విపరీతంగా ఖర్చు పెడతారు అనుకుంటారు. 'నా డిపాజిట్ వివరాలు నీకు చెప్పాలి. నేను సడెన్‌గా చనిపోతే నీకు అవసరం అవుతాయి. రాసుకో' అని భర్త అంటే, 'ఊరుకోండి. మీరు ఇలాంటి మాటలు అనకండి. మీరే లేకపోతే ఈ ఆస్తులు ఎందుకండీ' అని భార్య అంటుంది. సెంటిమెంట్ కోసం ఇది బాగానే ఉంటుంది. కానీ, నిజంగా అలా జరిగితే, డబ్బు చాలా అవసరం అవుతుంది.
సడన్‌గా మనిషి పోతే
కానీ, భర్త ఎక్కడ ఎంత డిపాజిట్ చేశారో తెలీదు. అప్పులు ఎన్నో తెలీదు. ఒరిజినల్ కాగితాలు ఏ ఫైల్స్‌లో ఉన్నాయో తెలీదు. ఇదీ పరిస్థితి. ఒరిజినల్ ఎఫ్‌డీలు తనఖా పెట్టి ఎక్క డైనా రుణాలు తీసుకున్నారా తెలీదు. అయితే సమస్య ఎక్కడ వస్తుందీ అంటే ప్రమాదాలు ఎప్పుడు కూడా చెప్పి రావు. ఆకస్మాత్తుగా ప్రమాదం సంభవించి ఆ వ్యక్తి ప్రపంచంలో మిస్ అయ్యేటప్పుడు ఆ కుటుంబానికి షాక్ తగులుతుంది. మొత్తం ఆర్థిక భారాన్ని మోస్తున్న ఒక వ్యక్తి ఇంట్లో మిస్ అయినప్పుడు ఆ కుటుంబం అతలాకుతలమవుతోంది. విషాదంలోకి వెళ్ళిపోతుంది.
కష్టార్జితం కనుమరుగైనప్పుడు!
కానీ, భర్త సేవింగ్స్ వివరాలు ఏవి కూడా చాలా ఇళ్లల్లో చాలామంది భార్యలకూ, పిల్లలకూ తెలీవు. విషాదంలో వారు అవి వెతకాలని కూడా అనుకోరు. భారతీయ సంస్కృతిలో అలా ఆ సమయంలో వెతకడం మంచి ప్రవర్తనగా తీసుకోరు. కొన్ని డాక్యుమెంట్లు దొరుకుతాయి. కొన్ని మిస్ అయిపోతాయి. ఇలా తమ కుటుంబం కష్టార్జితం తమకు తెలియకుండానే ఆర్థిక సంస్థల్లో క్లెయిమ్ లేకుండా ఉండిపోతుంది. ఇటీవల, ఒక లెక్క ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఇలా క్లెయిమ్ చెయ్యని డబ్బులు దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిసింది. అలానే, బ్యాంకుల్లో ఎఫ్‌డీలు 78,213 కోట్ల రూపాయలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో 35 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బు ఎవరిదో ఆ ఆఫీస్‌కి తెలియదు. ఆ డబ్బు క్లెయిమ్ చేయడానికి ఇంతవరకు ఎవరూ కూడా రాలేదు.
లక్ష కోట్లకు పైగా క్లెయిమ్ కాలే...
దీనికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, సేవింగ్స్ చేస్తున్న వ్యక్తి తను బతికి ఉండగానే ఆ సేవింగ్స్ గురించి మర్చిపోయి ఉండొచ్చు. రెండు సేవింగ్స్ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా మిస్ అయినప్పుడు ఆ డబ్బు రెండు లక్షలు కావచ్చు. 30 లక్షలు కావచ్చు. కుటుంబ సభ్యులకు ఆ వివరాలు చెప్పకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వాటి గురించి ఎక్కడా ఏ ప్రయత్నం చేయరు. ఒకవేళ చేయాలనుకున్నా వారికి ఆ ఒరిజినల్ కాగితాలు సమయానికి దొరకవు. ఇలా కోట్ల కొలది డబ్బు ఈ సంస్థల్లో అలా వృధాగా పడి ఉంది. లేదా, అకౌంట్‌లో ఏయే పేర్లు ఉన్నాయో వారంతా లేకపోయి ఉండొచ్చు. వీటిలో పది శాతం అయినా దొరికితే ఆ కుటుంబాలు వెలుగును చూస్తాయి. విషాదంలో కాస్తంత ఊరట అందుకుంటాయి. కాబట్టి, మీ సేవింగ్స్, మీ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ వివరాలు మీ కుటుంబానికి ఈ రోజే తెలియజేయండి.
-కేశవ్,
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213