పరీక్ష ఫెయిలైతే జీవితంలో ఫెయిలైనట్టేనా.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలేంటి?

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వెలువడ్డాయో లేదో.. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్థాపంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు

Update: 2025-04-25 01:15 GMT
పరీక్ష ఫెయిలైతే జీవితంలో ఫెయిలైనట్టేనా.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలేంటి?
  • whatsapp icon

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వెలువడ్డాయో లేదో.. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్థాపంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలుగురైదుగురు విద్యార్థులు బలవన్మరణం చేసుకున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా భిక్కనూరులో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన పూజ అనే విద్యార్థిని మార్కులు తక్కువగా వచ్చాయనే బాధతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. ఇలాంటి మరణాలు ప్రతియేటా జరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉంది. 

ప్రతియేటా పదోతరగతి పరీక్షా ఫలితాలు, ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడినప్పుడు మాత్రమే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయెందుకు? మనస్థాపంతో ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు. తాత్కాలికమైన ఫెయిల్యూర్‌ను తట్టుకోకుండా విద్యార్థులు ఎందుకింతగా మనస్తాపానికి గురవుతున్నారు?

మానసిక స్థితిని అంచనా వేయలేరా?

విద్యార్థులు వెనకా ముందూ ఆలోచించకుండా ఎందుకింతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారు? ఈ సారి ఫెయిలైతే మరో సారి పరీక్ష రాస్తే పాసవుతామని, ఉన్నత చదువులకు, బంగారు భవిష్యత్తుకు ఎంతో అవకాశముందనే విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? పరీక్షలో ఫెయిలైతే కలిగే మానసిక క్షోభను తట్టుకునేలా వారిని మానసికంగా బలోపేతం చేయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు తమ వంతుగా చూపాల్సినంత శ్రద్ధ చూపడం లేదా? పదేళ్ల పాటు అదే స్కూల్లో అదే టీచర్ల సమక్షంలో చదువుకునే పిల్లల మానసిక పరిస్థితులను అంచనా వేయడంలో స్కూల్ స్టాఫ్, యాజమాన్యం ఫెయిలవుతున్నారా? మానసికంగా బలహీనంగా ఉండి, ఫెయిల్యూర్స్‌ను తట్టుకునే సామర్థ్యం లేని వారిని గుర్తించి వారికి స్పెషలిస్టులతో పరీక్షలకు ముందే కౌన్సిలింగ్ ఇప్పించే కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదు? ఈ పాపం ఎవరిది? శిక్ష అనుభవిస్తున్న వారెవరు? ఈ అమాయక విద్యార్థుల ఆత్మహత్యలకు కారణభూతులు ఎవరు? ఆలోచించాల్సిన అవసరమెంతైనా ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

కడుపు కోతకు కారణమెవరు?

అమ్మ చాటు కొడుకుగా, తండ్రి చాటు బిడ్డగా.. ఈ బిడ్డలు.. ఏం చేయాలన్నా, ఎటు వెళ్లాలన్నా ఇంట్లో పేరెంట్స్‌ను అడిగే కదా వెళతారు.. వద్దని వారిస్తే బుంగమూతి పెట్టి ఊరుకుంటారు.. సరే జాగ్రత్తగా వెళ్లిరండని పర్మిషన్ ఇస్తే సంతోషంతో కళ్లు పెద్దవి చేసి లవ్ యూ మామ్.. లవ్ యూ డాడ్ అంటూ బుగ్గన ముద్దెట్టి మరీ బయటకు పరుగులు తీస్తారు. అలాంటి పిల్లలకు.. ఒక్కసారి పరీక్షల్లో ఫెయిలైతే జీవితాన్నే ముగించాలనుకునేంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు తల్లిదండ్రులు ఎందుకు గుర్తుకు రావడం లేదు? తిరిగి రాని లోకాలకు వెళ్లడానికి ముందు అడగాలని, తాము పడుతున్న బాధను పంచుకోవాలని పిల్లలకు ఎందుకు కనిపించడం లేదు. చిన్ననాటి నుండి ఎత్తుకుని, ముద్దాడి, అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు మా కోసమే బతుకుతున్నారని, వారి జీవితాల్ని మాకోసమే, మా భవిష్యత్ కోసమే త్యాగం చేస్తున్నారనే ఆలోచన ఎందుకు రావడం లేదు. తల్లిదండ్రులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారనే ఆలోచన ఎందుకు ఆ క్షణంలో గుర్తుకు రావడం లేదో.. ఇప్పటికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. తాత్కాలిక ఫెయిల్యూర్‌కి శాశ్వత పరిష్కారం బలవన్మరణమే అనే తప్పుడు అభిప్రాయానికి బానిసలెందుకవుతున్నారు. తాము చనిపోతే పేరెంట్స్ పరిస్థితి ఏంటనే ఆలోచన ఎందుకు చేయడం లేదు. ఆ క్షణంలో ఆలోచన చే(వ)స్తే పరిస్థితి వేరేలా ఉండేదేమోననే అభిప్రాయాలు అందరినీ కలచివేస్తున్నాయి.

మాటపడని తత్వం ప్రమాదకరం!

ఈ రోజుల్లో పిల్లలు చిన్న చిన్న విషయాలకే సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. వారిలో డామినేషన్ నేచర్ బాగా డెవలప్ అవుతోంది. సినిమాల ప్రభావమో మరేం ప్రభావమో తెలియదు కానీ, కన్నవారు కోపంగా రెండు మాటలు అన్నా భరించలేకపోతున్నారు. అలాంటి వారు ఇతరుల ఎదుట ఏ విషయంలోనూ తక్కువగా కనిపించేందుకు ఇష్టపడరు. ఎవరితో మాటపడరు. తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే సహించరు. ఇలాంటి వారిలో కొందరు మానసికంగా బలంగా ఉంటారు. కొందరు చాలా బలహీనంగా సెన్సిటివ్‌గా ఉంటారు. బలంగా ఉన్న వారు ఫెయిల్యూర్‌ను కూడా తట్టుకుంటారు. కానీ, బలహీనంగా ఉన్నవారు తట్టుకోవడం కష్టమని, దాదాపు ఇలాంటి మనస్తత్వం ఉన్నవారే ఆత్మహత్యలకు పాల్పడతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారితో ప్రేమగా ఉంటూనే వారిలోని ఆలోచనలను వాస్తవ ప్రపంచానికి అనుగుణంగా మార్చే ప్రయత్నం చేయాలంటున్నారు.

విద్యాసంస్థల బాధ్యత లేదా?

విద్యార్థుల విషయంలో విద్యాసంస్థలు బాధ్యతగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పొద్దస్తమానం వారు వారి స్కూల్ సాధించే రిజల్ట్స్‌పై తప్ప పిల్లల మీద వారి ప్రభావం ఏ విధంగా పడుతుందో, ఎలాంటి ఒత్తిళ్లకు పిల్లలు లోనవుతున్నారో, మానసికంగా వారిని ఏ విధంగా దృఢంగా మార్చాలనే విషయమై విద్యాసంస్థలు ఆలోచించడం లేదు. మోటివేషన్ క్లాసెస్‌పై సరైన దృష్టి పెట్టడం లేదు. ఫెయిల్యూర్స్‌ను కూడా తట్టుకునేలా వాస్తవ ధృక్పథాన్ని అలవరిచే విధంగా పిల్లలను మాన సికంగా సిద్ధం చేసే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ఆడెపు శ్రీనివాస్

98482 92739

Tags:    

Similar News