బ్రిటిష్ వారిని తరిమికొట్టిన చెంచు నాయకులు ఎవరో తెలుసా?
ఈ దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న వీరుల చరిత్ర తవ్వే కొద్దీ బయటపడుతుంది. ఆదిమ గిరిజనులైన చెంచులు..

ఈ దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న వీరుల చరిత్ర తవ్వే కొద్దీ బయటపడుతుంది. ఆదిమ గిరిజనులైన చెంచులు.. బాహ్య సమాజానికి దూరమైనప్పటికీ తమ హక్కుల పోరాటంలో బ్రిటిష్ వారిని సైతం తరిమికొట్టారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ చెంచు జాతి నాయకులైన కుడుముల పెద్ద బాయన్న, హనుమంతప్పలు అల్లూరి మన్యం పోరాటం (1924) ముగిసిన తదుపరి 1930 - 1938 కాలంలోనే ఆదివాసుల జీవనాధారమైన అటవీ సంపదపై కన్నేసిన బ్రిటిష్ వారిపై పోరాటం చేయక తప్పలేదు. వీరిద్దరు చెంచులలో తొలి పోరాట వీరులుగా చిరస్మరణీయులు..
చెంచులలో తొలి పోరాట వీరుడైన పెద్ద బాయన్న ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని తుమ్మల బయలు అనే చెంచుపెంటలో జన్మించాడు. ఆయనను పెద్ద బాయిలోడుగా కూడా పిలుస్తుంటారు. వారు అనాది నుండి అటవీ జంతువులను వేటాడి జీవనం సాగిస్తూ వచ్చారు. నల్లమలలోకి ప్రవేశించిన బ్రిటిష్ వాళ్లు ఆదివాసులను అడవిలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అటవీ ఉత్పత్తులు తెచ్చుకున్నవారిపై పన్నులు వసూలు చేసేవాళ్ళు. నల్లమల ప్రాంతమంతటా బ్రిటిష్ వాళ్ళు వారి జెండా ఎత్తడానికి సహకరించమని కోరగా.. పెద్దబాయన్న వారి జెండాలను వ్యతిరేకించి నిరసన తెలిపాడు. ఇంకా ఆయన ఆదివాసీలందరిని తుమ్మల బయలు కేంద్రంగా సమావేశపరచి 'బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి తరిమివేయకపోతే మనకు జీవనం ఉండదు' అని విల్లులు, బాణాలతో చెంచు యువకులను తిరుగుబాటుకు సిద్ధం చేశాడు. బ్రిటిష్ సైన్యంలో కొందరు వీరి ధాటికి మరణించారు. దీనిని గమనించిన బ్రిటిష్ సైనికాధికారి పెద్ద బాయ న్నను పట్టించిన వారికి పదివేల రూపాయలు పారితోషికం ప్రకటించారు. కానీ ఎవరు బాయన్న ఆచూకీ చెప్పలేదు.
చెంచులలో మరో నాయకుడు హనుమంతప్ప బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన కర్నూల్ జిల్లా కొత్తపెల్లి అనే చెంచు పెంటలో జన్మించాడు. హనుమంతప్ప మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నాడు. బ్రిటిష్ వారు ఒక మహిళను అవమానించడం కళ్లారా చూసాడు. దీంతో బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి బాయన్న గురించి తెలుసుకుని ఆయనతో కలిసి పోరాటానికి చేతులు కలిపాడు. బ్రిటిష్ వారు వీళ్లిద్దరినీ పట్టుకోవడానికి పెద్ద చెరువు మీదుగా తుమ్మలబయలు చేరుకున్నారు. అకస్మాత్తుగా సైన్యానికి చిక్కిన బాయన్న లొంగిపోయాడు. ఆ తరువాత హనుమంతప్ప కూడా దొరికిపోయాడు. వీరిద్దరినీ బ్రిటిష్ సైనికులు చెట్టుకు కట్టేసి 1938, ఏప్రిల్ 25న కాల్చి చంపారు. దేశ స్వాతంత్య్రం కోసం, చెంచు తెగల హక్కుల కోసం కడదాకా పోరాడిన వీరి స్ఫూర్తి ఆదివాసీలందరికీ అనుసరణీయం. కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఏర్పాటు చేసిన చెంచుల సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో బాయన్న, హనుమంతప్పల విగ్రహాలను ప్రభుత్వం నెలకొల్పింది. చెంచు వీరులకు ఇవే మా అక్షర నివాళి.
(నేడు బాయన్న, హనుమంతప్పల వర్ధంతి)
గుమ్మడి లక్ష్మీనారాయణ,
94913 18409