వర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలకు అడ్డు తొలగినట్టేనా?

రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో అసిస్టెంట్, అసో సియేట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యగులకు అసిస్టెంట్

Update: 2025-04-16 01:15 GMT
వర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలకు అడ్డు తొలగినట్టేనా?
  • whatsapp icon

రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో అసిస్టెంట్, అసో సియేట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యగులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల నిబంధనలపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో కొంత ఊరట ఇచ్చింది. దశాబ్దకాలంగా రెగ్యులర్ టీచింగ్ పోస్టుల నియామకాలు లేక టీచర్ల కొరత ఉన్న పరిస్థితిలో, గత డిసెంబర్‌లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి నివేదికను అందించారు. 

ప్రభుత్వం దీనిపై జీవో విడుదల చేసినా, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలపై నిబంధనలు లేవు. దీంతో కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ అవుతాయని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే, పదేళ్లుగా నిలిచిపోయిన నియామకాలు మళ్లీ ప్రారంభమవడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధిగమించి నియామకాలను వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు.

గత ప్రభుత్వ నిర్వాకంతో..

విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రే ఛాన్సలర్‌గా ఉండాలని ప్రకటించింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకం కోసం ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అప్పటి వీసీలతో ఈ నిర్ణయంపై ఆమోదం కూడా తీసుకున్నారు. 2023 ఏప్రిల్ మాసంలో మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 3,500 బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో 1,551 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా, మొదటి విడతలో 1,061 పోస్టులకు అనుమతి కూడా ఇచ్చారు. అయితే ఉమ్మడి బోర్డు బిల్లు పట్ల అప్పట్లో వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింప చేసి గవర్నర్ ఆమోదం కోసం కూడా పంపించారు. దానిపై అధ్యయనం కోసం కొంత కాలం బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత గవర్నర్ బిల్లును రాజ్యాంగ పరమైన అంశంగా భావించి రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. అప్పటి నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మళ్ళీ నియామక విధానాల రూపకల్పన ప్రారంభించింది.

పారదర్శకతే ప్రధాన లోపం?

విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాల్లో ఆలస్యానికి ప్రధాన కారణం నియామక విధానాల్లో స్పష్టత లేకపోవడమే. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల ఎంపికకు నిర్దిష్ట అర్హతలు, పరీక్షలు ఉండగా, విశ్వవిద్యాలయాల్లో మాత్రం స్థిరమైన ప్రమాణాలు లేవు. పీజీ, నెట్/సెట్ లేదా పీహెచ్‌డీ ఉండటం, అకడమిక్ స్కోరు, ఆర్టికల్స్ వంటి అంశాల్లో నియంత్రణ లేమి వల్ల అవకతవకలు పెరిగాయి. డబ్బులతో ఆర్టికల్స్ ప్రచురించడం వంటి మార్గాలు నియామక విధానాన్ని నిర్వీర్యం చేశాయి. వర్సిటీ టీచర్లు పరీక్షలు లేకుండానే ఎంపిక కావడంపై వ్యతిరేకత పెరిగింది. స్పష్టమైన నిబంధనల లేకపోవడం వల్ల నియామకాలు కోర్టుల్లో చిక్కుకుని ఆలస్యం అవుతున్నాయి. యూజీసీ స్పందన లేమి వల్ల సమస్య మరింత తీవ్రమైంది. నియామక విధానాల మార్పులు, పెండింగ్ బిల్లులు, విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలు వంటివి విశ్వ విద్యాలయాల మౌలిక ధోరణిని ప్రభావితం చేస్తున్నాయి.

వేగంగా నియమించాలంటే..

నియామక ప్రక్రియలో అదే విభాగానికి చెందిన అధికారులు దరఖాస్తులను పరిశీలించడం, వారు అభ్యర్థులతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండడం వల్ల పాక్షికతకు అవకాశం పెరిగింది. ఎంపిక కమిటీల్లో వీసీ, రిజిస్ట్రార్, డీన్లు, హెడ్‌లు అధికంగా ఉండటంతో ఆశ్రిత పక్షపాతం సంభవిస్తోంది. ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం వల్ల ప్రక్రియ నెలల తరబడి సాగుతోంది. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను శ్రేణీ బద్ధం చేసి, కొద్ది మందిని ఇంటర్వ్యూకు పిలిపించడం ద్వారా ఇది వేగంగా, పారదర్శకంగా సాగించవచ్చు. గతంలో ఈ లోపాల కారణంగా కేసులు నమోదవడం, విచారణలు జరగడం సాధారణమైంది. గత రెండు దశాబ్దాల్లో అర్హుల సంఖ్య పెరగడం, పోటీ తీవ్రత పెరగడం వల్ల నియామకాల పారదర్శకతపై తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి.

ఒప్పంద అధ్యాపకులకు శాశ్వత పరిష్కారం!

తెలంగాణ ఉద్యమ సమయంలో గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రాజ్యాంగంలోని సమాన అవకాశాల హక్కు (ఆర్టికల్ 16) ప్రకారం ఇదైతే న్యాయ విరుద్ధమని కోర్టులు అభిప్రాయపడిన తీర్పులు ఈ ప్రక్రియకు బ్రేకులేశాయి. కోర్టు ఆదేశాలతో రెగ్యులరైజేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు పదహారు వందల మంది కాంట్రాక్టు అధ్యాపకులు, అలాగే డిగ్రీ కళాశాలల్లో ఐదువేల మందికి పైగా తాత్కాలిక అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు రెగ్యులర్ పోస్టుల్లో పని చేస్తుండగా, మరికొంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది గత పదేళ్లుగా కొనసాగుతుండడంతో, తమ విషయం తేలకుండా కొత్త నియామక ప్రక్రియ చేపట్టడం న్యాయమా అని వీరు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి కనీస వేతనం, కొన్ని అలవెన్సులు ఇస్తూ కొనసాగించినా, ఇది తాత్కాలిక పరిష్కారంగా మిగిలింది. శాశ్వత పరిష్కారం కావాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు. శాశ్వత పరిష్కారం లేకుండా కొత్త నియామకాలను ప్రారంభించడం సహజంగానే సవాళ్లను ఎదుర్కొంటోందని భావిస్తున్నారు. ఏది ఏమయినా దశాబ్ద కాలంగా వర్సిటీలలో నోచుకోని అసిస్టెంట్ పోస్టుల నియామకాలు అన్ని సవాళ్లను అధిగమించి వీలైనంత తొందరలో జరగాలని అందరూ కోరుకుంటున్నారు.

డా. మామిడాల ఇస్తారి

ప్రొఫెసర్, కేయూ

98483 09231

Tags:    

Similar News