నోబెల్ పురస్కారాల్లో మనమెక్కడ...?

ప్రపంచవ్యాప్తంగా భౌతిక, రసాయన, వైద్య, అర్థ శాస్త్రాలు, శాంతి, సాహిత్యం విభాగాల్లో

Update: 2025-01-03 01:00 GMT

ప్రపంచవ్యాప్తంగా భౌతిక, రసాయన, వైద్య, అర్థ శాస్త్రాలు, శాంతి, సాహిత్యం విభాగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు, నూతన ఆవిష్కర్తలకు నోబెల్ పురస్కారాలు అందజేస్తారు. ప్రపంచ రూపురేఖలను మార్చడంలో చేసిన కృషికి గుర్తింపుగా వీరికి నోబెల్ పురస్కారాలు అంతర్జాతీయ ప్రశంసలు అందుతాయి. నోబెల్ పురస్కారాలు 1901లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 992 మంది వ్యక్తులు, సంస్థలు 621 అవార్డులను అందుకొని నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 12 మంది భార తీయ సంతతి వ్యక్తులు నోబెల్ పురస్కారాలు పొందారు. వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే భారతీయ పౌరులు కావడం గమనార్హం. రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు డాక్టర్ సి.వి రామన్ రామన్ 1930లో భౌతిక శాస్త్రంలో సైన్స్ విభాగంలో నోబెల్ పురస్కారం పొందిన ఏకైక భారతీయుడిగా నిలిచారు.

1901 నుండి 1924 వరకు అత్యధిక నోబెల్ పురస్కారాలు పొందిన 10 దేశాల గణాంకాలను పరిశీలిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం అవుతుంది. అమెరికా(415), ఇంగ్లాండ్(138), జర్మనీ (115), ఫ్రాన్స్ (76) స్వీడన్ (34), రష్యా (30), జపాన్(30), కెనడా (27), ఆస్ట్రియా(25), స్విట్జర్లాండ్ (25) ఈ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక పరిశోధనలకి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా ఆయా దేశంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు వచ్చాయి. శాస్త్రీయ ఆవిష్కరణలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆయా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా ఎదిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాయి.

సైంటిస్టులతో 81వ ర్యాంకులో భారత్

ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే భారతదేశ శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక స్థాయి చాలా తక్కువగా ఉంది. ప్రతి పది లక్షల జనాభాకు 260 మంది శాస్త్రవేత్తలను కలిగి ఉండి భారతదేశం పరిశోధకుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 81వ ర్యాంకులో ఉంది. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో 10 లక్షలు జనాభాకు 4000 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినా భారతదేశ వైజ్ఞానిక స్థాయి ఏ స్థాయిలో ఉందో పై గణాంకాల ద్వారా మనకు అవగతం అవుతుంది.

మొబైల్ ఫోన్ ఆవిష్కరణలు..

ఈరోజు మనం అందరం ఉపయోగించే మొబైల్ ఫోన్ వెనుక కనీసం డజను మంది ఆవిష్కర్తలకు నోబెల్ పురస్కారాలు వచ్చాయి. ఆవిష్కరణలు ట్రాన్సిస్టర్ (1956, ఫిజిక్స్), లేజర్ టెక్నాలజీ (1964, ఫిజిక్స్), ఇన్ఫర్మేషన్ థియరీ (1965, ఫిజిక్స్), ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (2000, ఫిజిక్స్), కండక్టింగ్ పాలిమర్‌లు (2000, కెమిస్ట్రీ), సెమీకండక్టర్ హెటెరోస్ట్రక్చర్స్ (2000 ఫిజిక్స్), ఫైబర్ ఆప్టిక్స్ (2009, ఫిజిక్స్), LED టెక్నాలజీ (2014, ఫిజిక్స్), లిథియం-అయాన్ బ్యాటరీ (2019, కెమిస్ట్రీ) మొదలైనవి. వీటిలో ప్రతి ఆవిష్కరణ ప్రపంచ దశ దిశను మార్చుతూ, మానవాళి అభివృద్ధికి సౌలభ్యానికి ఎంతో దోహదపడతాయి. అమెరికా దేశం సైన్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి దానికి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడు పొందుతుంది. ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ నోబెల్‌లను పొందింది. జీడీపీలో భారతదేశం శాస్త్రీయ పరిశోధనలకు చేసే నిధుల కేటాయింపు ఇతర బ్రిక్స్(BRICS) దేశాల బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కంటే తక్కువగా ఉంది. నోబెల్-స్థాయి ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం నుండి పరిశోధన, అభివృద్ధి నిధులకు బలమైన నిబద్ధత అవసరం. భారతదేశం తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించాలి. భారతదేశంలో నోబెల్-స్థాయి పరిశోధనను ఉత్పత్తి చేయకపోవడానికి ముఖ్యమైన కారణం ఆవిష్కరణల సంస్కృతి లేకపోవడం. పరిశోధనలకు నిధులు పొందడంలో ఇబ్బందులు. పరిశోధనల్లో మితిమీరిన అధికారిక జోక్యం దేశంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, తక్కువ జీతాలు దీనికి తోడవుతున్నాయి.

నూతన ఆవిష్కరణలకు ఊతం

అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, సమాచార సాంకేతికతతో సహా సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో నూతన ఆవిష్కరణలు పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాలు రూపొందించింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM)- ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం. ఇన్నోవేటివ్ ఇండియా (i3)- బయోఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమం. ఇన్నోవేషన్ ఫర్ ఇండియా అవార్డులు-వ్యాపారం, సామాజిక, గ్లోబల్ గేమ్‌చేంజర్ కేటగిరీలలో ఆవిష్కరణలను గుర్తించిన మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా అవార్డు. ఈ అవార్డులు వినూత్న స్టార్టప్‌లకు అవకాశాలను కల్పించాయి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టెమిస్ అగ్రిమెంట్స్, ఆకాష్ క్షిపణి, ఐఎన్ఎస్ విక్రాంత్, భారతదేశంలో 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేటెంట్ ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ (PFP), పాలసీ రీసెర్చ్ ప్రోగ్రామ్ (PRP), సైంటిస్ట్ & టెక్నాలజిస్టుల శిక్షణ కోసం నేషనల్ ప్రోగ్రామ్ వంటి వినూత్న కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది.

పరిశోధనకు అధిక నిధులు..

కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో పరిశోధనా రంగానికి అత్యధిక నిధులు కేటాయించి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాలను అభివృద్ధికై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే దేశం నుండి ఎన్నో వినూత్న ఆవిష్కరణలు వస్తాయి. భారతదేశం నుండి సైన్స్ కేటగిరీలో నోబెల్ పురస్కారాలకు అందుకునే అవకాశాలు మెరుగవుతాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనల ద్వారా మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుంది.

- పాకాల శంకర్ గౌడ్

విద్యావేత్త

98483 77734

Tags:    

Similar News