వ్యవస్థను పట్టించుకోని వాదం దేనికి?

మనం కార్పొరేటుకి మానవవాదం నేర్పితే తన శ్రమ దోపిడీ సామ్రాజ్యాన్ని వదులుకోడు. కాబట్టి, మానవవాదం తీరిగ్గా ఉద్యోగాలు, పెన్షన్లు ఎత్తి నింపాదిగా జీవించే వర్గానికి బాగానే ఉంటుంది.

Update: 2024-10-16 00:30 GMT

మనం కార్పొరేటుకి మానవవాదం నేర్పితే తన శ్రమ దోపిడీ సామ్రాజ్యాన్ని వదులుకోడు. కాబట్టి, మానవవాదం తీరిగ్గా ఉద్యోగాలు, పెన్షన్లు ఎత్తి నింపాదిగా జీవించే వర్గానికి బాగానే ఉంటుంది. ఆలోచనలను సంస్కరిస్తుంది. ప్రకృతి గురించి శాస్త్రీయమైన అవగాహన అద్భుతంగా అందిస్తుంది. అంతమాత్రాన ఈ వాదం సమాజంలో సమానత్వం తీసుకొస్తుందని మనం ఆశించలేం. సామాజిక విశ్లేషణ మీద, ఆర్థిక విశ్లేషణల మీద మనిషి జీవితాన్ని, మనిషికున్న దృక్పథాన్ని కూడా ఈ వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తుందో మానవవాదం పరిశీలించే ప్రయత్నం చేసినట్లు కనిపించదు.

ప్రకృతి గురించి చైతన్యమై శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నంత మాత్రాన ఆయా వ్యక్తులు ఒక పెద్ద వ్యవస్థాగతమైన జీవితాలను సమూహాలను ప్రభావితం చేయలేరు. పర్మనెంట్ ఉద్యోగులు విపరీతంగా తగ్గిపోయి, కాంట్రాక్టు ఉద్యోగులు విపరీతంగా పెరిగిపోయేటప్పుడు మానవవాదాలు ఈ దోపిడీకి పరిష్కారం ఇవ్వలేవు. ఈ విధానం వెనుక పొంచివున్న ప్రపంచీకరణ సామ్రాజ్యాన్ని, సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వాదం చెయ్యదు. ఎందుకంటే ఈ వాదం ఎప్పుడు కూడా ప్రకృతి దగ్గర ఆరంభమవుతుంది. ప్రకృతి దగ్గర ఆగిపోతుంది. అసాధారణమైన ప్రతిభను చూపిస్తుంది. ఈ వాదాన్ని అలవర్చుకున్న కార్యకర్తలకు ప్రకృతి విషయంలో అసాధారణమైన విజ్ఞానం, చైతన్యం ఉంటుంది.

చైతన్యం వస్తే ప్రపంచం మారిపోతుందా?

ప్రకృతికి సంబంధించిన విషయంలో, దేవుడికి సంబంధించిన విషయంలో హేతువాదం, మానవవాదం అద్భుతమైన అవగాహన అందిస్తుంది. సమాజానికి అశాస్త్రీయత నుంచి, శాస్త్రీయత వైపుగా తీసుకొనిపోవడానికి ప్రయత్నిస్తుంది. అందులో సందేహం లేదు. అయితే, మనిషి అజ్ఞానంలో ఉండడానికి మనిషి మాత్రమే కారణం కాదు. ప్రకృతి గురించి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నంత మాత్రాన ఆయా వ్యక్తులు సమాజాన్ని అన్ని విధాలా ఆరోగ్యకరంగా మార్చలేరు. వ్యవస్థాగత కారణాలు అనేకం ఉంటాయి. మెడికల్ శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందని మనం గర్వపడినా, పెద్ద వైద్యులంతా పట్టణాలు, నగరాల్లోనే ఉంటారు. అక్కడే వీరి వ్యాపారం నడుస్తుంది. వైద్య విద్యలో లక్షలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వైద్యుల నుంచి ఈ స్పందన తప్పదు. మరి గ్రామస్తులు రోగాలు వస్తే మూఢ నమ్మకాలు సహజమే కదా.. వారు షార్ట్ కట్ బాబాలనే ఆశ్రయిస్తారు కదా..! వ్యవస్థాగత విషయాల మీద హేతువాదం, మానవవాదం ధ్యానం ఇవ్వదు. మనుషులంతా మూఢ నమ్మకాలను విడనాడితే, ప్రకృతి మీద సరైన చైతన్యం సంపాదిస్తే వ్యవస్థ దానికదే బాగుపడుతుందని భావిస్తుంది. వీరే ఆ వ్యవస్థను బాగు చేసేస్తారు అని నమ్ముతుంది.

నేను బాగుంటే ప్రపంచమే బాగున్నట్లా?

అయితే, నేను బాగా ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది అనే తాత్విక సిద్ధాంతం ఎల్లవేళలా విజయం పొందదు. నేను టీచర్‌గా బాగా ఉద్యోగం చేసినా, నేను నా క్లాసులో బోధన బాగా చేసినంత మాత్రాన నా విద్యాసంస్థలో తగ్గిపోతున్న ఉపాధ్యాయులను నేను తీసుకొని రాలేను. ఆయా ఉపాధ్యాయుల పాఠ్యాంశాల బోధనలను నేను బోధించలేను. అలాంటప్పుడు నేను బాగా ఉన్నంత మాత్రాన నా ఆఫీసు, నేను పనిచేసే సంస్థ బాగయిపోదు. సామూహిక కృషి జరగాలి. అందుకు వ్యవస్థాగతమైన పరిష్కారాలు రావాలి. ఇలానే ప్రతి చోట జరగాలి. ఇక్కడ మానవవాదం పనిచేయదు. ఆర్థిక, సామాజిక, సోషలిస్టు చైతన్యం మాత్రమే ఒక విద్యా సంస్థను అయినా, ఒక దేశాన్ని అయినా సరైన దారికి తీసుకొస్తుంది.

మూలాల్లోకి వెళ్లని మానవవాదం..

గనుల పేర్ల మీద అడవులకు అడవులు నరికేసి వేల కొలది ఆదివాసీలను తమ స్థావరాల నుంచి తరిమేసే ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి మానవ వాదాలు ఆయా ప్రజానీకానికి ఏ రకమైన ప్రయోజనాన్ని కూడా, ఏ రకమైన న్యాయాన్ని కూడా ఇవ్వవు. మానవ వాదాలు మరో వెయ్యి సంవత్సరాలు దేశాల్లో ఉన్నా సరే అవి సగటు మనిషికి న్యాయమైన జీవితాన్ని అందించడంలో సఫలం ఎప్పుడూ కావు. ఎందుకంటే అవి మూలం లోకి వెళ్లే ప్రయత్నం చేయవు. మానవ వాదుల మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ మానవవాదం ప్రపంచం సమస్యలకు పెనాసియా కాదు. ఇది ప్రకృతి దగ్గర మాత్రమే ఆగిపోతుంది.

యజమాని ఎప్పటికీ యజమానే..!

ఒక పెద్ద పరిశ్రమ లోపల యజమాని, కార్మికుడికి మధ్య ఏ రకమైన సంబంధం ఉంటుంది అనే విషయం విశ్లేషించడానికి ప్రయత్నించదు. జీవితాంతం యంత్రం దగ్గర పనిచేసినా కార్మికులు ఎందుకు కష్టల్లోనే ఉంటారో ఈ హేతువాదం, మానవవాదం అర్థం చెయ్యదు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు ఎందుకు నలిగిపోయారో, కార్పొరేట్లు ఎందుకు మరింత పోగేసుకున్నారో ఈ వాదం పరిశీలించదు. ఈ యజమాని, ఆ కార్మికుడు మానవవాదం నేర్చుకుంటే, ప్రకృతి మీద సరైన చైతన్యం సంపాదించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని మానవవాదం అంటుంది. నమ్ముతుంది. కానీ, అలా సమస్య పరిష్కారం ఎప్పుడూ కాదు. యజమాని యజమానిలానే ఉంటాడు. కార్మికుడిని దోచుకు తినడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు.

వెయ్యేళ్లు దోపిడీ కొనసాగుతుంది..

ఆ యజమానికి ప్రకృతి మీద ఎంత చైతన్యం అందించినా సరే తన ఆస్తులు, తన విలాసాలని వదులుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించడు. అలానే గనుల పేర్ల మీద పచ్చని ఆదివాసి ప్రాంతాల భూముల్లోకి యంత్రాలను తోసేసి పచ్చని భూముల్ని స్మశానవాటికలుగా మార్చేసి అక్కడి ప్రజలకు జీవించడమే కష్టం అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చే బడా కార్పొరేట్ల మెదడులలో మనం మానవవాదం, నాస్తిక వాదం, ప్రకృతి మీద గొప్ప పరిశీలన ఎంత వేసినా సరే ఆ కార్పొరేట్లు అవకాశాలని వదులుకొని యంత్రాలను విడిచి పెట్టేసి బయటకు రారు. ప్రకృతి మీద చైతన్యం మాత్రమే సంపాదించుకుంటారు. ఇంతకుముందు చేసే మూఢనమ్మకాలతో కూడిన పనులు ఈరోజు చేయరు.. అంతే! వ్యవస్థ అలానే ఉంటుంది. ఈ మానవ వాదాలతో మరో వెయ్యి సంవత్సరాలు కూడా ఆ దోపిడీ అలానే కొనసాగుతుంది.

ప్రకృతి జ్ఞానం సరే.. సమానత్వం మాటేంటి?

మానవవాదం ప్రకృతి పరిశీలనలో అద్భుతమైన చైతన్యం అందిస్తుంది. ప్రకృతి మీద అద్భుతమైన చైతన్యం సాధించుకున్నంత మాత్రాన యుద్ధాలు ఆగిపోవు. ఆయుధాల పరిశ్రమలు ఆగిపోవు. దోపిడీ ఆగిపోదు. ఒక వ్యక్తి మానవతావాది అయినంత మాత్రాన తనకు ఉన్న అదనపు సొమ్ము ఇతరులకు ఇచ్చెయ్యడు. తన ఆస్తులు పేదలకు పంచడు. ఆ స్థానంలో పెట్టుబడిదారుడు ఉంటే తన ఉద్యోగులకు రోజుకు అయిదు వందల జీతం స్థలంలో మూడు వేలు చెయ్యడు. లేదా వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యడు. వ్యవస్థాగత మార్పులు రావాలి. ప్రకృతి దగ్గర ఉండిపోయిన హేతువాదం, మానవవాదం ఈ మార్పులు తేలేదు. శ్రమ దగ్గర ఏం జరుగుతుంది అనే విషయంలో మానవవాదం సీరియస్‌గా ఆలోచించదు. సోషలిస్టు చైతన్యం మాత్రమే అది సాధ్యం చేస్తుంది. సోషలిజం కూడా మంచి ఉన్నతమైన మానవవాదం. కానీ, సాధారణ హేతువాదం, మానవ వివాదం లాగా ఇది ప్రకృతి శాస్త్రం మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని కూర్చోదు. ఆర్థిక పునాదుల్లోకి వెళ్లి పరిశీలిస్తుంది. పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. శ్రామికులకు అనుకూలంగా, రైతులకు అనుకూలంగా వ్యవస్థ మార్పుకి కృషి చేస్తుంది. వ్యక్తిగత విధానాలు కాకుండా, సామూహిక కార్యక్రమాల మీద ధ్యానమిస్తుంది. అవసరమైతే సమ్మెలను నిర్వహిస్తుంది. అందుకోసం ఆలోచిస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ ఇది గెలుస్తుంది. అప్పుడప్పుడు ఓడిపోతుంది. మరలా గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. ఆర్థిక దోపిడీని తాకని మానవ వాదాలు మనిషికి ప్రకృతి జ్ఞానాన్ని ఇస్తాయే తప్ప సామాజిక సమానత్వాన్ని అందించలేవు. శ్రామికుడికి దోపిడీ నుంచి విముక్తి చేయలేవు.


 



కేశవ్

ఆర్థిక, సామాజిక విశ్లేషకులు

98313 14213


Similar News