చిన్న కథ కాదు! '35' సినిమా రివ్యూ
ఆ బాబు చదివేది ఆరో తరగతి. మిగతా సబ్జెక్టులన్నీ ఓకే కానీ ఎందుకనో మ్యాథ్స్ దగ్గరకొచ్చేసరికి అతనికి వచ్చేది మాత్రం సున్నానే.
ఆ బాబు చదివేది ఆరో తరగతి. మిగతా సబ్జెక్టులన్నీ ఓకే కానీ ఎందుకనో మ్యాథ్స్ దగ్గరకొచ్చేసరికి అతనికి వచ్చేది మాత్రం సున్నానే. అందుకనో ఏమో ఎవరైనా సున్నా పేరెత్తితే చాలు మండిపడి పోతుంటాడు. అలాంటిది కొత్తగా వచ్చిన మ్యాథ్స్ సార్ ఆ పిల్లాడి పేరే జీరో అని మార్చేస్తాడు. ఇలా లాభం లేదు. వీణ్ణి వేద పాఠశాలలో చేర్చేస్తానంటాడు తండ్రి. కానీ తల్లి అడ్డు పడుతుంది. టెన్త్ ఫెయిలైన తను కొడుకు కోసం టీచర్‌గా మారుతుంది. తను మ్యాథ్స్ నేర్చుకొని కొడుక్కి నేర్పుతుంది. వాణ్ణి పాస్ చేస్తుంది, తనూ టెన్త్ పాసవుతుంది. చిన్న కథ కాదు కదా! అందుకే పెద్ద విజయం సాధించేసింది.
తెలుగులో విభిన్న కథాంశాలతో సినిమాలు వచ్చేదే అంతంతమాత్రం. అందునా పిల్లల కాన్సెప్టులు ఇంకా అరుదు. “35- చిన్న కథ కాదు” అలాంటి అరుదైన కాన్సెప్ట్ తోనే వచ్చిన చిన్న సినిమా. పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తున్న నేటి విద్యా వ్యవస్థను వేలెత్తి చూపుతుందీ సినిమా. గొర్రెల్లా నోళ్ళు మూసుకున్న పిల్లలు ఎలా బుద్ధిమంతులుగా పేరు తెచ్చుకుంటారో, ప్రశ్నించడం మానని పిల్లలు టీచర్లకు శత్రువులుగా మారి క్లాసులోను, స్కూలులోను ఎలా జీరోలుగా మిగిలిపోతారో చూపిస్తుంది. ఇదంతా పడలేని తల్లిదండ్రులు వ్యవస్థకు తలొగ్గి తమ పిల్లల మీద ఎలా ఒత్తిడి తెస్తారో కూడా ఈ సినిమాలో చూడొచ్చు. స్కూళ్ళ విషయంలో నాకు బోలెడు కంప్లెయింట్లు ఉండడం వల్ల ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నా. కానీ చాలా వరకు నిరాశే మిగిలింది.
కథనంలో మెలోడ్రామా పాలు ఎక్కువైందా?
దర్శకుడు నంద కిశోర్ ఈమని ఇలాంటి ఒక కథతో తన తొలి సినిమా తీయడం అభినందించదగ్గ విషయం. మంచి కథే రాసుకున్నా కథనంలో తడబడ్డాడు. వ్యవస్థలో లోపాలను మొదట సమర్థంగానే లేవనెత్తాడు కానీ పోను పోను మెలోడ్రామాలోకి జారిపోయాడు. ప్రశ్నించే తత్వమున్న పిల్లవాణ్ణి సున్నా గురించిన ఒకే ఒక్క ప్రశ్నకు కట్టిపడేసి ఒక మెలోడ్రమటిక్ సీన్ ద్వారా పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాడు (సినిమా చూసినవాళ్ళకు ఆ సీన్ ఏంటో అర్థమవుతుంది). ప్రశ్నించినందుకే ఓ పసివాణ్ణి రకరకాలుగా శిక్షించిన మాస్టారును చివరలో అంత తేలిగ్గా క్షమించేయడాన్ని నేనైతే జీర్ణించుకోలేకపోయాను (ప్రపంచం నిండా అలాంటి వాళ్ళే ఉన్నప్పుడు అందరినీ విలన్లు చేయలేం కదా అనుకున్నాడేమో డైరెక్టర్! Majority is always right అనే ఒరవడిలో తనూ కొట్టుకుపోయి ఉంటాడు పాపం)! దర్శకుడు ఏ వ్యవస్థపైనైతే మొదట్లో ప్రశ్నలు సంధించాడో చివరికి ఆ వ్యవస్థతోనే చాలా కన్వీనియెంట్‌గా సర్దుకుపోయినట్లు కనిపించింది.
పెద్దల సినిమాగా మారిన పిల్లల సినిమా
ఇది పిల్లల సినిమా మాత్రమే అనుకున్న నాకు కాసేపటికే ఇదో కుటుంబ కథా చిత్రమని అర్థమైంది. అది కూడా నిరాశకు కొంత కారణం కావచ్చు. భార్యాభర్తల మధ్య బాపు గారి రాధాగోపాళం మార్కు రొమాన్స్, అక్కడక్కడ తొణికిసలాడే కళాతపస్వి మార్కు కళాత్మకత సినిమా ఒరిజినాలిటీని దెబ్బతీశాయి. Narrativeని తిప్పి తిప్పి హింస పెట్టకుండా ప్లెయిన్‌గా ఉంచితే సినిమా ఇంకా బాగా అర్థమై ఉండేదేమో! పిల్లల సినిమాను పిల్లల సినిమాలాగే స్వచ్ఛంగా ఉంచాల్సింది. వాళ్ళ వయసుకు మించిన ఆలోచనలు ఆపాదించడం సహజంగా అనిపించలేదు.
ఓటీటీలో సౌండ్ ఎఫెక్ట్ లోపం
ఇక నాకు ఈ సినిమా ఆడియో విషయంలో పెద్ద అసంతృప్తే ఉంది. Sync sound ఎంచుకుని మూవీ టీం పెద్ద రిస్కు చేసిందేమో అనిపించింది. చాలా చోట్ల డైలాగ్స్ అర్థం కాలేదు. థియేటర్లలో అంత పెద్ద ప్రాబ్లమ్ కాలేదట కానీ OTTలో చూసేవాళ్ళకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. తెలుగు సినిమాని sub-titles సాయంతో చూడాల్సి వచ్చిందంటే పరిస్థితేంటో మీరే అర్థం చేసుకోండి. Sync sound ఒక్కటే ప్రాబ్లమ్ కాదు. లీడ్ క్యారెక్టర్ల డైలాగ్ డెలివరీ కూడా సినిమాకి చాలా పెద్ద మైనస్.
తెలుగు డబ్బింగ్ పంటికింద రాయి
నివేదా థామస్ మలయాళీ. అలాంటి అమ్మాయి తెలుగులో అందునా చిత్తూరు యాసలో మాట్లాడాలి. సినిమా కో-రైటర్ అయిన ప్రశాంత్ విఘ్నేశ్ ఆవిడకి భాషలోను, యాసలోను ట్రెయినింగ్ ఇచ్చారట. ఒక మలయాళీ అయి ఉండి తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పడానికి ఆవిడ పడ్డ శ్రమ అభినందించదగ్గదే. కానీ ఆ శ్రమ పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోయింది. ఆవిడ డైలాగులు చాలా చోట్ల అర్థమే కాలేదు. అసందర్భమైనా ఇక్కడ “మహానటి” విషయం ప్రస్తావించాలి. దృశ్యకావ్యం లాంటి ఈ సినిమాలో కీర్తి సురేశ్ డబ్బింగ్ నాకు పంటి కింద రాయిలా తగిలింది. తేట తెలుగు మాట్లాడే సావిత్రి పాత్ర వచ్చీరాని తెలుగులో డైలాగులు చెప్పడం నాకస్సలు నచ్చలేదు. ఇప్పుడు నివేద విషయంలోనూ అదే జరిగింది. పరభాషా హీరోయిన్లు మన భాష నేర్చుకుని డైలాగులు చెప్పడం గొప్ప విషయమే కానీ అది సినిమా ఒరిజినాలిటీని దెబ్బ తీయకూడదు కదా (లక్కీగా సాయి పల్లవి
ఇందుకు మినహాయింపు!
పిల్లాడి తండ్రిగా నటించిన విశ్వ దేవ్ రాచకొండ కూడా డైలాగ్ డెలివరీలోను, యాస విషయంలోను మరికాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. చిత్రంగా గౌతమి భాష కూడా అర్థం కాలేదు. సింపుల్ స్టోరీకి సింపుల్ డైలాగులు రాసుకోవాల్సింది. గ్రాంథికం జోలి మనకెందుకు?
అందరి నటనా అద్భుతం
ఇక పర్ఫార్మెన్స్ పరంగా అందరూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు. నివేదా థామస్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆవిడ గురించి కొత్తగా చెప్పేదేముంది? విశ్వ దేవ్, ప్రియదర్శి, హీరోయిన్ అన్నగా నటించిన కృష్ణ తేజ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే నివేదా expressions అక్కడక్కడా over గా అనిపించాయి. అది డైరెక్టర్ టేక్ అయి ఉంటుంది తప్ప ఆవిడ ప్రాబ్లమ్ కాదని నాకనిపించింది. అరుణ్ ఉరఫ్ జీరోగా చేసిన అరుణ్ దేవ్, వరుణ్‌గా చేసిన అభయ్ శంకర్ బాగా నటించారు.
తిరుపతిలో రియల్ లొకేషన్స్
నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ కళ్ళకు విందు చేసింది. లైటింగ్ చక్కగా ఉంది. తిరుపతిలోని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేయడం సినిమాకి మంచి authentic feel ఇచ్చింది. ఆ ఫీల్‌ని narrativeలోకి translate చేయగలిగి ఉంటే ఇంకా బావుండేదనుకోండి. వివేక్ సాగర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హాయిగా ఉన్నాయి.
దర్శకుడిని అభినందించాల్సిందే
లోపాల మాట ఎలా ఉన్నా ఈ సినిమా చిన్న కథ మాత్రం కాదు. కొత్త డైరెక్టర్లకు మంచి స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేసిన నంద కిశోర్ ఈమనిని మెచ్చుకోవాల్సిందే! తడబాట్లను దిద్దుకుంటే మనకో మంచి డైరెక్టర్ దొరికినట్లే! చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో ముందుండే సురేశ్ ప్రొడక్షన్స్‌కి, ప్రత్యేకంగా రానాకి ఇలాంటి విభిన్నమైన సినిమాను మన ముందుకు తీసుకొచ్చినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
శాంతి ఇషాన్
సినీ సమీక్షకురాలు