ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల స్కిల్‌ యూనివర్సిటీని పెట్టి, ఐటిఐలకు అనుసంధానం చేసి, కార్పొరేట్‌ కంపెనీలకు ఎటాచ్‌ చేసి ఉద్యోగాలను కల్పించాలనే భావన హర్షణీయం.

Update: 2024-10-14 23:30 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల స్కిల్‌ యూనివర్సిటీని పెట్టి, ఐటిఐలకు అనుసంధానం చేసి, కార్పొరేట్‌ కంపెనీలకు ఎటాచ్‌ చేసి ఉద్యోగాలను కల్పించాలనే భావన హర్షణీయం. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక, సంస్థల పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్‌సీ ద్వారా భర్తీ చేయాలనుకోవడం, కార్యరూపం దాల్చడం శుభపరిణామం. భారత ప్రభుత్వం జాతీయ విద్యా పాలసీ 2020 (ఎన్‌ఇపి 2020)లో మన దేశానికి ఒక మిలియన్‌ పైగా ఉపాధ్యాయుల అవసరం ఉన్నట్లు అంచనా వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో గణాంకాల ప్రకారం 2.5 లక్షల పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు నిర్దారించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, కేవలం ప్రభుత్వానిదే బాధ్యత కాదు, ప్రజలందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ విద్యార్థి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యా రంగాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. “మీ పైన ఉన్న బల్బును చూస్తే, మీకు థామస్ అల్వా ఎడిసన్ గుర్తుకు వస్తారు. టెలిఫోన్‌ బెల్‌ మోగినప్పుడు మీకు అలెగ్జాండర్‌ గ్రాహం బెల్‌ గుర్తుకు వస్తారు. నోబెల్‌ బహుమతి పొందిన మొదటి మహిళా వ్యక్తి మేరీక్యూరీ. మీరు నీలాకాశాన్ని చూసినప్పుడు, మీకు గుర్తుకు వచ్చేది సర్‌.సి.వి. రామన్‌’’. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మాట్లాడిన మాటలివి.

ఉపాధి అవకాశాలు ఎలా?

ప్రతి విద్యార్థి పరిశోధనలపై, తన సొంత ఆలోచనలను పదును పెట్టి, మన దేశ ఖ్యాతిని నిలబెట్టాలి. ప్రతి ఉన్నత పాఠశాలలో, ప్రతి జూనియర్‌ కాలేజీలో ప్రభుత్వం ఒకేషనల్‌ కోర్సులను ప్రవేశపెట్టాలి. ఐ.టి.ఐ.లకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రభుత్వం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పరిశోధనా రంగంలో ప్రాముఖ్యతనిస్తే, తయారీ, నిర్మాణం, పునరద్పాదకత, ఇంధన వనరులు, రవాణా తదితర రంగాల్లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. స్వర్గీయ డా. అబ్దుల్‌ కలాం మాజీ రాష్ట్రపతి ఎక్కడో రామేశ్వరంలో డైలీపేపర్లు వేసుకుంటూ జీవించిన ఓ పిల్లాడు, రోజు రోజుకు ఎదుగుతూ, దేశం గర్వించదగ్గ సైంటిస్ట్‌గా మారడం, తదనంతరం దేశ రాష్ట్రపతిగా ఎదగడం, పద్మభూషన్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న మొదలగు అతి గొప్ప అవార్డులు పొందడం, దేశం గర్వించదగ్గ విషయం. ఆయన నేటి విద్యార్థులకు ఆదర్శం, విద్యార్థులలో విజ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నం చేశాడనీ, భారత రాష్ట్రపతిగా ప్రపంచ శాంతి కోసం పరితపించాడనీ కొనియాడుతూ.. ఐక్యరాజ్య సమితి ఆయన జయంతి రోజైన 15 అక్టోబర్‌ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా నిర్ణయించింది. ఆయన భారతదేశానికి 11వ రాష్ట్రపతి(2002-2007) రాజకీయ నాయకుడిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా ఉండి, 27 జులై 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూనే తన 83వ ఏట గుండెపోటుతో మరణించాడు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలుగా ఉండి, విద్యార్థుల్లో జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందిస్తేనే మంచి సమాజం నిర్మితమవుతుందని డా. అబ్దుల్‌ కలామ్‌ అన్నారు.

సంఖ్య కాదు విద్యా నాణ్యత పెంచాలి

ప్రభుత్వాలు, విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకుని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు వేయాలి. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం తన ఇమేజ్‌ కొరకు కొత్త తరహా పాఠశాలలను, కళాశాలలను నెలకొల్పడం, పాఠశాలల విద్యా నాణ్యతను పట్టించుకోకుండా కేవలం పాఠశాలలు, కళాశాలల సంఖ్యను పెంచడం పైనే దృష్టి పెట్టింది. కనీసం ఇప్పుడైనా విద్యా నాణ్యతను పెంచడంపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆశిద్దాం. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి కేవలం 7.3% మాత్రమే నిధులు కేటాయించింది. 2022-23 సంవత్సరంలో  దాదాపు 8500 ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులున్నారు. 1864 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే లేరు. పాఠశాలల, కళాశాలల పర్యవేక్షణాధికరులు సరిపోయినంత మంది లేరు. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో టీచర్‌ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి.

కనీస వసతులు లేని స్కూళ్లు ఎందుకు?

ప్రభుత్వ యూనివర్సిటీలలో 2వేలకు పైగా ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని సెకండరీ విద్యాశాఖలో 64 డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారుల పోస్టులు, 8 జిల్లా విద్యాశాఖాధికారుల పోస్టులు ఉపాధ్యాయులను తయారు చేసే డైట్‌ కళాశాలల్లో 189 లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, కెజిబివి పాఠశాలల నాణ్యతపైన ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సరిపడా తరగతి గదులు ఉన్నాయా? లేదా? సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడా, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఉందా? ఇటువంటి విషయాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న 17 ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు, 4036 కాలేజీలను సమగ్రంగా అభివృద్ధి చేసినప్పుడే విద్యలో నాణ్యతను సాధించగలం. కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటూ, బోధనా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంది.

ప్రభుత్వ విద్య బలోపేతం అందరి బాధ్యత

ఆధునిక ఉపాధ్యాయుడు విద్యార్థికి `ఒక స్నేహితుడుగా, ఒక తత్త్వవేత్తగా, ఒక మార్గదర్శకుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు ఉన్నత ప్రమాణాలను పాటించి మంచి పౌరులను అందించాల్సిన బాధ్యత ఉంది. ఉపాధ్యాయులు తమ అలవాట్లలో, ఆలోచనలలో, జీవిత విధానాలలో విద్యార్థికి ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, కేవలం ప్రభుత్వానిదే బాధ్యత కాదు, ప్రజలందరి బాధ్యత. ప్రజల పన్నుల ద్వారా ప్రజాప్రభుత్వాలు, ప్రభుత్వ బడ్జెట్‌ ఏర్పడుతుంది. ప్రజలకు, అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు, అందరిది సమిష్టి బాధ్యత. ప్రతి ఒక్కరూ విద్యార్థి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యా రంగాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది.



(నేడు ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా)

సి.వి.వి. ప్రసాద్‌

విశ్రాంత ప్రధానాచార్యులు

80196 08475


Similar News