సాయి అమరత్వం ఏం చెబుతోంది?

ప్రొఫెసర్ సాయిబాబా మరణం ప్రస్తుత వ్యవస్థలలో సాధారణ ప్రజలు ఉద్యమకారులు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎత్తి చూపింది.

Update: 2024-10-14 23:00 GMT

ప్రొఫెసర్ సాయిబాబా మరణం ప్రస్తుత వ్యవస్థలలో సాధారణ ప్రజలు ఉద్యమకారులు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎత్తి చూపింది. పౌర ప్రజాస్వామిక వాదులు నిర్వహించాల్సిన సామాజిక బాధ్యతలపై పలు ప్రశ్నలను సంధించింది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తలెత్తబోయే ఆందోళనకర పరిణామాలకు అద్దం పట్టింది. పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రజలందరిదని గుర్తు చేసింది. సంఘటిత ఉద్యమాల అవసరాన్ని, వాటి అనివార్యతను ఎత్తి పట్టింది. కలసికట్టుగా హక్కుల రక్షణకై నడుం బిగించి కదలాలని పిలుపునిచ్చింది.

ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అమరుడయ్యాడు. వైద్యం అందించే క్రమంలో ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా శరీరం సహకరించని బలహీనతతో అనివార్యంగా అసువులు బాసాడు. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గాని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న ప్రాథమిక న్యాయ సూత్రం సాయిబాబు విషయంలో అభాసుపాలయ్యింది. అక్రమ కేసులో చిక్కుకుని సుమారు తొమ్మిదేళ్లకు మానవతా మూర్తులు, న్యాయవాదుల కృషి, సహకారంతో నిర్దోషులుగా సాయిబాబాతోపాటు మరో నలుగురు విడుదలయ్యారు. విచారణ సమయంలోనే ఒకరు కరోనాకు బలయ్యారు. నిర్దోషులుగా బయటపడ్డ వీరు కోల్పోయిన జీవిత కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు..?

తప్పుడు శిక్షలకు చర్యలుండవా?

కోర్టు కేసులో సాయిబాబాకు యావత్ జీవశిక్ష విధించగానే ఉద్యోగం నుండి తొలగించారు. కోర్టు నిరపరాధిగా ప్రకటించి విడుదల చేసి నెలలు గడుస్తున్నా యూనివర్సిటీ పాలకులు తిరిగి ఆయనను ఉద్యోగంలో ఎందుకు నియమించలేదు? ఈ విషయమై ఆయన కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొద్దిమందికే ఎందుకు ఇలా జరుగుతుంది? పౌర సమాజం సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. ఇది కేవలం సాయిబాబుకి పరిమితం కాదు. అభాగ్యులు ఎందరికో వెలుగులోకి రాని ఇలాంటి శిక్షలు అనుభవంలోకి వస్తున్నాయన్నది నిజం.

ప్రజాజీవితంతో ముడిపడిన కుటుంబం

ప్రజాస్వామిక తెలంగాణ సాప్నికుడు, మానహక్కుల కార్యకర్త, రచయిత, కవి. ఒక్క మాటలో బహుముఖ ప్రజ్ఞాశాలి. 90% వికలాంగుడై ఉండి ఐదు సంవత్సరాల వయస్సు నుండే వీల్ చైర్‌కు పరిమితమైనా, దృఢదీక్షతో ఎదిగిన మనిషి. పీడిత ప్రజల హక్కుల కోసం మానసిక స్థైర్యంతో పోరాడిన వ్యక్తి. సాయిబాబు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణమూర్తి, తల్లి సూర్యావతమ్మ సంతానాల్లో పెద్దవాడు సాయిబాబు. ఆయన సహచరి వసంత కుమారి, కూతురు మంజీరా. తమ్ముడు రాందేవ్ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్. చెల్లెలు భవాని విప్లవ ఉద్యమంలో పని చేస్తూ నల్లగొండ జిల్లా కనగల్ మండలం నామనాయక్ తండాలో జరిగిన ఎన్ కౌంటర్లో అమరురాలయ్యింది. కుటుంబమంతా ఏదో ఒక విధంగా ప్రజాజీవితంతో ముడిపడిన వారే. అందుకు అంకితమైన వారే.

వరంగల్ డిక్లరేషన్‌‌లో ప్రధానపాత్ర

మొదటినుండి చైతన్యం గల సాయిబాబు సామాజిక అధ్యయనంలో భాగంగా విపరీతంగా పుస్తకాలను అధ్యయనం చేసేవాడు. అమలాపురం ఎస్.కె.బి.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో పీజీ పూర్తి చేశాడు. ఇఫ్లూలో ఎంఫిల్ చేశాడు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 'ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నేషన్ మేకింగ్: రీడింగ్ ది డిసిప్లిన్' అంశంపై 2013లో పీహెచ్‌డి పూర్తి చేశాడు. ఆయన పరిశోధనలు, రచనలు ప్రధానంగా దళితులు, ఆదివాసీల జీవితాలపై, సమస్యలపై ఉండేవి. హైదరాబాదులో చదువుతున్న కాలంలో రిజర్వేషన్ల అమలు కోసం ఐక్య సంఘటన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. 1994 నాటికి రాజకీయ ఖైదీల, హక్కుల కోసం, విడుదల కోసం జరిగిన పోరాటంలో ప్రధాన భూమిక వహించాడు. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ప్రధాన నాయకుడిగా ఎదిగాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దశా-దిశా నిర్దేశించిన వరంగల్ డిక్లరేషన్ సభా నిర్వహణకు పూర్తి బాధ్యుడిగా పనిచేశాడు. కాళోజీ నారాయణరావు, భూపతి కృష్ణమూర్తి, వరవరరావు, గద్దర్, బియ్యాల జనార్దన్ రావు వంటి ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. ఈ సభలోనే ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర సాధన యావత్ తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం అని డిక్లరేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఎన్నో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, చిత్రహింసలు, భౌతిక దాడులు, ఎన్‌కౌంటర్లు, హత్యా యత్నాలు.. ప్రాణ త్యాగాల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కావడం, దశాబ్దకాలంగా దాని పరిణామాలు, విపరిణామాలు మనందరికీ తెలిసిన చరిత్రే

మావోయిస్టులతో సంబంధాలపై ఆరోపణ

ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆంగ్ల భాష ప్రొఫెసర్ గా వెళ్లిన సాయిబాబా జాతుల విముక్తి పోరాటాలు, ఆదివాసి హక్కుల ఉద్యమాలు, మైనారిటీల స్థితిగతులు తదితర అంశాలపై జరిగిన సదస్సులో పాల్గొన్నాడు. పరిష్కారానికి అనేక సూచనలు చేశాడు. వారు నిర్వహించిన ఉద్యమాలలో వీలైనంతగా పాల్గొన్నాడు. దేశ పరిస్థితులపై సంపూర్ణ అవగాహనతో వివిధ అంశాలపై రచనలు చేశాడు. పాలకులకు కంటగింపుగా మారడంతో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణం చూపుతూ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి పోలీస్ స్టేషన్‌లో ఉపా కేసు నమోదుచేసి, 2012లో అరెస్టు చేశారు. కొంతకాలానికి బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణ ఎదుర్కొన్నారు. విచారణ అంతా సజావుగా జరిగినట్టు కనిపించినా తీర్పు మాత్రం ఎవరో రాసిస్తే చదివినట్టు ఉందని ప్రచారం జరిగింది. ఫలితంగా 2014లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించారు.

అండా సెల్‌లోనే సగం చంపేశారు

ఇందులో సాయిబాబాను నాగపూర్ జైలు అండాసెల్‌లో బందీని చేశారు. తోటి ఖైదీలతో సంబంధం లేకుండా, విద్యుత్ వెలుగులు లేకుండా ఎండ, వాన, చలి పూర్తిగా తాకేలా ఉండే జైలు అది. జైలు నుండి తప్పించుకుంటారేమోనన్న తీవ్ర నేర ప్రవృత్తి గల వ్యక్తులను మాత్రమే ఈ జైల్లో ఉంచడం జరుగుతుంది. కానీ, సాయిబాబా ను ఇలాంటి జైల్లో నిర్బంధించడం అంటే మానసికంగా కృంగదీసి, అనారోగ్యం పాలు చేసి చనిపోయేందుకు అవసరమైన వాతావరణం కల్పించడమేనని ఎన్నోసార్లు సాయిబాబా న్యాయస్థానానికి నివేదించారు. పోలీస్ అధికారులకు, కోర్టులకు, జైలు అధికారులకు కుటుంబ సభ్యులు ఎన్నో మార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఒక దశలో చావును నిరాకరిస్తున్నాను అని సాయిబాబా స్వయంగా కవితా సంకలనాన్ని విడుదల చేశారు. అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సకాలంలో వైద్య సౌకర్యం అందక, సహాయం చేసే వారు కరువై, సరైన గాలి, వెలుతురు, తాగు నీరు దొరకక, పలకరించడానికి మనుషులు కానరాక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ఆయన ఆర్గాన్స్ ఒక్కటొకటిగా ఫెయిల్ అవుతూ వచ్చాయి. సుమారు తొమ్మిది ఏళ్ల పాటు జైలు జీవితం వల్ల కలిగిన అనారోగ్యంతో అకాల మరణం సంభవించింది.

జీవించే హక్కుకు తావులేని దేశం

సాయిబాబా అమరత్వం పౌర సమాజానికి, మానవతావాదులకు సవాలుగా నిలిచింది. మానవ హక్కుల ఊల్లoఘనను ఎత్తిచూపుతున్నది. జీవించే హక్కు మృగ్యమవుతున్న భయానక స్థితిని తేటతెల్లంచేస్తున్నది. పీడిత ప్రజల (ప్రధానంగా దళిత, ఆదివాసి, మైనారిటీ మరియు బహుజనులు)హక్కుల కోసం నిర్మించాల్సిన ఉద్యమాలను తెరపైకి తెస్తున్నది. రాజ్యాంగ అమలు, పరిరక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నది. జరుగుతున్న మానవహననాన్ని నిలువరించేందుకు బలమైన ఐక్య సంఘటనతో ఉద్యమాల ఏర్పాటు అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ప్రజాస్వామిక వాదులు మౌనం వీడి, భావితరాల కోసమైనా ఉద్యమించి కదిలితేనే రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల మనుగడ సాధ్యమవుతుంది. 


- రమణా చారి

99898 63039


Similar News