దామగుండం.. అగ్నిగుండం కారాదు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని 'దామగుండం' అటవీ ప్రాంతంలో భారత నావికాదళం(ఇండియన్ నేవీ) నిర్మించ తలపెట్టిన వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి రూ.2,500 కోట్లతో వెచ్చించటానికి ముహూర్తం ఖరారైంది.

Update: 2024-10-14 22:30 GMT

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని 'దామగుండం' అటవీ ప్రాంతంలో భారత నావికాదళం(ఇండియన్ నేవీ) నిర్మించ తలపెట్టిన వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి రూ.2,500 కోట్లతో వెచ్చించటానికి ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా  హాజరవుతారని సమాచారం. వీఎల్ఎఫ్ స్టేషన్ కోసం 2,900 ఎకరాల అటవీ భూమి నేవీకి అధికారికంగా అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్థంచేశారు. దామగుండం పరిరక్షణకు స్థానిక ప్రజలు, యువతీ యువకులతోపాటు, పర్యావరణ వేత్తలు ఆందోళన బాట పట్టారు. విపక్షాలు గొంతువిప్పుతున్నాయి. ప్రజలతో సంఘర్షణ లేకుండా ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి.

వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ అంటే ఏమిటి ?

వీఎల్ఎఫ్ రాడార్ అంటే 'వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్' అని అర్థం. దీని ద్వారా సముద్రంలో దూర ప్రాంతంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో నావికా సిబ్బంది సమాచారాన్ని ఇచ్చి, పుచ్చుకో కోవచ్చు. ఈ వ్యవస్థ మూలంగా 3కేజీ హెచ్ జెడ్ రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తుంది. నీటిలోపల 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు చొచ్చుకెళ్తాయి. అలాగే, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సిగ్నల్స్ నిరాఘాటంగా అందించటానికి వీలవుతుంది. రక్షణ రంగం అవసరాలతో పాటు, రేడియో కమ్యూనికేషన్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందట. ఇలాంటిది ఇప్పటివరకు మన దేశంలో తమిళనాడులో 'తిరునెల్వేలి'లో ఉంది.

ఇక్కడే ఎందుకు.. ప్రత్యామ్నాయం లేదా?

తెలంగాణలో సముద్రం లేదు. అయినా ఈ నిర్మాణం ఇక్కడే ఎందుకు? అనేది పెద్ద ప్రశ్న. నేవీ అధికారులు చెప్పేదేమిటంటే తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాములోని సిబ్బందితో మాట్లాడటానికి వీలుగా ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో తెలంగాణలోని దామగుండం ప్రాంతం సాంకేతికంగా అనువుగా ఉంటుందట. దామగుండం సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తున ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.దూరంలో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నేవీ అధికారులు చెబుతున్నారు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లోని 2900 ఎకరాల అటవీ భూమిని జనవరి 24న నావికాదళ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా అప్పగించారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుంది కాబట్టి ప్రజల ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది.

అడవికి, పర్యవరణానికి నష్టం జరగదా?

మొత్తం 2900 ఎకరాలకు గాను 1500 ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు నేవీ చేపట్టదు. పర్యావరణానికి నష్టం లేకుండా మొక్కలు, చెట్లు లేని ప్రాంతంలో 350 ఎకరాల్లోనే సుమారు 3000 మందికి నివాసం ఉండే విధంగా ఓ టౌన్ షిప్‌ను నిర్మిస్తారు. ఇక్కడ 600 మంది సిబ్బంది తమ విధులు నిర్వహిస్తారు. వందల ఏళ్ళ నాటి వట వృక్షాలను తెగనరికి పర్యావరణ పరిరక్షణ కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలలో విరివిగా మొక్కలు నాటుతారు. అయితే ఈ రాడార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో వివిధ అవసరాల కోసం అడవిలో సుమారు 12 లక్షల చెట్లు నరికివేయాల్సి ఉంటుంది. మూసీ నది పరివాహక ప్రాంతం దెబ్బతింటుంది. అడవిలోని జీవవైవిధ్యం నాశనం అవుతుంది. అక్కడ ప్రసిద్ది చెందిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇకపై దేవాలయానికి రహదారిని నేవీ మూసివేస్తుంది. దీంతో  భక్తులు స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం ఉండదు.

రేడియేషన్‌తో ప్రమాదం లేదా?

ఈ అటవీ ప్రాంతాన్ని ఆవరించి ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవి పై ఆధారపడి జీవిస్తున్నారు. వారి పశువులకు మేతకు ఇకపై అవకాశం ఉండదని స్థానికులు బాధపడుతున్నారు. పైగా దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యభరితమైన చెట్లు,150 రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు నరికి వేస్తారు. వీటితో పాటు ఎంతో అరుదైన జింకలు, తోడేళ్లు, అడవి పందులు మొదలైన జంతువులతో పాటు వేలరకాల పక్షులు తమ గూడును కోల్పోతాయి. ఈ రాడార్ స్టేషన్ వల్ల ప్రాణాంతకమైన రేడియేషన్ వెలువడుతుంది. గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతుంది. చుట్టుప్రక్కల ప్రజలకు మానసిక ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతాన లేమి, వంధ్యత్వం, చర్మ రోగాలు మొదలైన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వమే స్వయంగా రాడార్ కేంద్రం శంకుస్థాపనకు పూనుకుంటే! ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి?

'సేవ్ దామగుండం' పేరిట ఆందోళనలు

రాడార్ స్టేషన్ ఏర్పాటు రద్దు కోరుతూ దామగుండం అటవీ సంరక్షణ జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, ప్రభుత్వ షరతులన్నింటినీ పాటించాలని హైకోర్ట్ నేవీకి ఆదేశించింది. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులను అనుమతిస్తామని నేవీ కోర్టుకు స్పష్టం చేసింది. కాగా రాడార్ స్టేషన్ ఏర్పాటయితే 12 లక్షల మొక్కలు నరికి వేతకు గురవుతాయనే వ్యాఖ్యలను అటవీశాఖ కొట్టిపారేసింది. నేవీకి ఇచ్చిన భూముల్లో ఉన్న1.93 లక్షల చెట్లకు నష్టం జరగదని.. చెట్లు లేని చోటే తాము నిర్మాణాలు చేపడతామని నమ్మబలుకుతుంది. జీవ వైవిధ్యాన్నీ, అరుదైన పశు, పక్షుల ఆవాసాన్ని పరిరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వంపై, ఈనాగరిక సమాజం మీదనే ఉంది. ప్రజలతో సంఘర్షణ లేకుండా ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి.


 (నేడు దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన)

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496


Similar News